ఇంత దౌర్భాగ్య ప్రతిపక్షంలో దేశంలో ఎక్కడా లేదు

తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక టీడీపీ సభ్యులు పారిపోయారు

నెల్లూరు జిల్లా నుంచి బీసీని మంత్రిని చేసిన ఘనత జననేతది

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల దీవెనలు సీఎం వైయస్‌ జగన్‌కు కలకాలం ఉంటాయి

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

అమరావతి: స్వాతంత్రం వచ్చిన తరువాత నెల్లూరు జిల్లా నుంచి బీసీ అభ్యర్థికి మంత్రివర్గంలో చోటు కల్పించిన నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఇదొక చరిత్ర అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. మంత్రివర్గంలో 50 శాతం కంటే ఎక్కువ బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు మంత్రి పదవులు కల్పించిన ప్రభుత్వం వైయస్‌ఆర్‌ సీపీదన్నారు. అసెంబ్లీలో మంత్రి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. 40 సంవత్సరాల నుంచి ఎక్కడ సభ పెట్టినా అక్కడ డప్పు కొట్టుకుంటూ బీసీలను చంద్రబాబు మోసం చేశారన్నారు. బీసీల్లో కూడా చైతన్యం వచ్చి టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాలు బాగుపడాలని ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడుతుంటే ప్రతిపక్ష సభ నుంచి వాకౌట్‌ చేయడం చంద్రబాబు అహంకారానికి నిదర్శనమన్నారు. మంచిబిల్లులు ప్రవేశపెడుతుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ప్రతిపక్ష సభ్యులు దాక్కున్నారన్నారు. బిల్లుల చర్చలో పాల్గొనకూడదని సభ నుంచి వాకౌట్‌ చేసిన దౌర్భాగ్య ప్రతిపక్ష పార్టీ దేశ చరిత్రలోనే ఎక్కడా లేదన్నారు. 

గత ప్రభుత్వం చిట్ట చివరి నాలుగు నెలల్లో మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చిందని, ఎస్టీకి ఒక శాసనసభ్యుడు చనిపోయిన తరువాత ఆయన కుమారుడికి మంత్రి పదవి ఇచ్చిందన్నారు. కానీ, వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిందన్నారు. అంతేకాకుండా ఏడు మంది బీసీలు మంత్రులుగా ఉన్నారని, ఈ ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు. అంబేడ్కర్, జ్యోతిరావుపూలే వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పి విస్మరించిన నాయకులను చూశామని, కానీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంబేడ్కర్, జ్యోతిరావుపూలే ఆశయాలను నెరవేర్చేందుకు పనిచేస్తున్నారన్నారు. బీసీ అభ్యర్థి అయిన తనకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక మంత్రి పదవి ఇచ్చి తనపై నమ్మకం ఉంచి ముందుకు నడిచేందుకు ప్రోత్సహిస్తున్నారన్నారు. 

చంద్రబాబు బీసీలకు కత్తెర, ఇస్తీ్ర పెట్టె ఇచ్చి మీరు ఇలాగే ఉండండి అని వ్యవహరించారన్నారు. కానీ దాన్ని మార్చిన వ్యక్తి మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని మంత్రి అనిల్‌కుమార్‌ గుర్తు చేశారు. అందరూ చదువుకోవాలని, ఎంత ఖర్చు అయినా నిరుపేదలు ఉచితంగా విద్యను అభ్యసించాలని ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. వైయస్‌ఆర్‌ సహకారంతో 60 శాతం మంది బీసీలు ఉన్నత స్థాయికి చేరారన్నారు. కానీ ఆయన మరణాంతరం వచ్చిన ప్రభుత్వాలు ఆ పథకానికి తూట్లు పొడిచాయన్నారు. మళ్లీ ఫీజురియంబర్స్‌మెంట్‌కు మహానేత తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాణం పోశారని, అదే విధంగా పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల దీవెనలతో వైయస్‌ జగన్‌ చిరకాలం ముఖ్యమంత్రిగా వర్థిల్లుతారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులకు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మంత్రి అనిల్‌కుమార్‌ తెలిపారు.

 

Back to Top