విజయవాడ: చంద్రబాబు అనాలోచిత నిర్ణయం.. ప్రణాళిక లోపం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, కాఫర్ డ్యామ్ పూర్తికాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం టీడీపీ చేసిన చారిత్రక తప్పిదం కాదా..? అని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. విజయవాడలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుభవం ఉందని, 2018లోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పిన టీడీపీ నేతలు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. కాఫర్ డ్యామ్ సగంలో ఉండగానే డయాఫ్రమ్ వాల్ కట్టారని, టీడీపీ చేసిన చారిత్రక తప్పిదం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారిందని మండిపడ్డారు. ఆర్‌అండ్‌ఆర్ పూర్తి కాకపోవడంతో 56 గ్రామాలు మునిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు జేబు మీడియా పోలవరంపై అవాస్తవలను ప్రచారం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ తమ వల్ల దెబ్బతిందని విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డయాఫ్రమ్ వాల్ నష్టం ఎవరి పాపం అని ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వ ప్రణాళిక లోపం వల్లనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ పూర్తి చేయకుండా.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారని, అందుకే దెబ్బతిందని తెలిపారు. వరదలకు ముందే దాన్ని క్లోజ్ చేస్తే గ్రామాలకు ముంపు వస్తుందన్నారు. తాము ఆర్అండ్ఆర్ పూర్తి చేసి కాఫర్ డ్యామ్ క్లోజ్ చేశామని చెప్పారు.