ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకే జీవో నం.1

చంద్రబాబు ఎక్కడ కాలుపెడితే అక్కడ జనం పిట్టల్లా రాలిపోతున్నారు 

మీటింగ్‌ల పేరుతో ప్రజల ప్రాణాలను తీస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా..? 

జీవోలో రోడ్డు షోలు, సభలను బహిష్కరించినట్టుగా ఉందా..?

చంద్రబాబును, పవన్‌ కల్యాణ్‌ను కట్టడి చేసినట్టుగా ఉందా..?

ఎవ్వరినీ కట్టడి చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు, రాదు

ప్రభుత్వం తెచ్చిన జీవో నం.1 అన్ని పార్టీలకు వస్తుంది, అతిక్రమిస్తే చర్యలు తప్పవు

నా కుప్పం అంటున్న చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు, ఓటు ఉందా..?

చంద్రబాబు కుప్పం పర్యటన డ్రామా.. ఆస్పత్రి సంఘటనతో బట్టబయలైంది

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి: ‘చంద్రబాబు ఎక్కడ కాలుపెడితే అక్కడ జనం పిట్టల్లా రాలిపోతుంటే.. బాధ్యత కలిగిన ప్రభుత్వం చూస్తూ ఉరుకుంటుందా..? ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకే జీవో నం.1 తీసుకొచ్చాం, ప్రజలు, వారి ప్రాణాలే మా ప్రభుత్వానికి ముఖ్యం’ అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో రోడ్డుషోలు, సభలను బహిష్కరించినట్టుగా ఉందా..? లేక చంద్రబాబును, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ను కట్టడి చేసినట్టుగా ఉందా..? ఒక్కసారి ఆ జీవోను చదుకోవాలని సూచించారు. ప్రభుత్వం తెచ్చిన జీవో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తోందని చెప్పారు. జీవోను అతిక్రమిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..

కందుకూరులో 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గుంటూరులో ముగ్గురు అమాయక పేద ప్రజానికం చనిపోయారు. చీరలు, కందిపప్పు, చింతపండు ఇస్తామని టోకెన్లు పంచితే వచ్చి తొక్కిసలాటకు గురై గుంటూరులో ముగ్గురు మరణించారు. చంద్రబాబు ఎక్కడ కాలుపెడితే అక్కడ పిట్టల్లా జనం రాలిపోతుంటే.. ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా..? 
జీవోపై ఎల్లో మీడియా, టీడీపీ పెంచిపోషిస్తున్న కొంతమంది విశ్లేషకుల పేరుతో వచ్చినవారు, దత్తపుత్రుడి సేన కూడా యాగీ చేస్తున్నారే.. ఎక్కడికెళితే అక్కడ పిట్టలు రాలిపోయినట్టుగా ప్రజలు రాలిపోతుంటే బాధ్యత కలిగిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో రోడ్డు షోలను, సభలను బహిష్కరించినట్టుగా ఉందా..చంద్రబాబును, పవన్‌ కల్యాణ్‌ను కట్టడి చేసినట్టుగా ఉందా..? ఆ జీవోను ఒక్కసారి చదువుకోండి. 

మీటింగ్‌లు, రోడ్డు షోలు పెట్టుకోండి. ఒక పద్ధతి ప్రకారం పోలీసుల అనుమతితో ఒక గ్రౌండ్‌లో పెట్టుకోండి అని చెబితే.. ఇంత యాగీ చేసే కార్యక్రమం చేస్తున్నాడు. నా కుప్పం.. నా కుప్పానికి నన్ను వెళ్లనివ్వరా..? అని అరుస్తున్నాడు. ఈ మూడున్నర సంవత్సరాలలో చంద్రబాబు ఎన్నిసార్లు కుప్పం వెళ్లాడో.. ఆయన జీవితంలో అన్ని సార్లు కూడా కుప్పం వెళ్లలేదు. ఎందుకంటే.. కుప్పంలో తెలుగుదేశం పార్టీ సమాధి అవుతుందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా..? నీ కుప్పంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మున్సిపాలిటీ గెలిచారా..? చిత్తుచిత్తుగా టీడీపీ ఓడిపోయింది. ఆవేశపూరితమైన ప్రసంగాలతో భావోద్వేగాలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలనే ప్రయత్నం తప్ప కుప్పంలో టీడీపీకి పసలేదు. కుప్పానికి చంద్రబాబు రెవెన్యూ డివిజన్, బ్రాంచ్‌ కెనాల్‌ తెచ్చిన సందర్భం లేదు. 

సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు కుప్పంలో అందుతున్నాయి. అందువల్లే సీఎం వైయస్‌ జగన్‌ను అభిమానించి ఓట్లు కుమ్మరించి వైయస్‌ఆర్‌ సీపీని గెలిపించారు. చంద్రబాబును ఛీకొట్టారు. కుప్పంలో ఓడిపోతామనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. ఆ భయంతోనే నా కుప్పం అని కేకలు వేస్తున్నాడు. చంద్రబాబుకు కుప్పంలో ఇల్లుందా..? కనీసం ఓటు ఉందా..? ఇల్లు, ఓటు లేని చంద్రబాబు.. నా కుప్పం అని ఎందుకు మాట్లాడుతున్నాడు. రంకెలు వేసి రౌడీయిజం చేసే పరిస్థితిలోకి వెళ్తున్నాడు. ఎల్లోమీడియా చంద్రబాబుది హీరోయిజం అని రాస్తే ప్రజలు నమ్మేస్తారా..? 

11మందిని బలితీసుకున్నాడు. ఆ ప్రాణాలు పోయినప్పుడు వారి ఆవేదన చంద్రబాబుకు పట్టదా..? ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.2 లక్షల పరిహారం అందించింది. ప్రాణాలు పోతే చంద్రబాబు తిరిగి తేగలడా..? అన్యాయంగా కేసులు పెట్టారని ఇంటికెళ్తే మీ భార్యాపిల్లలు అడుగుతారు మీకు సిగ్గులేదా అని పోలీసులను దబాయిస్తున్నాడు.. మరి చంద్రబాబును వారి ఇంట్లోవారు అడగరా..? మీ పర్యటనలో 11 మంది చనిపోయారని చంద్రబాబును వారి భార్య అడక్కపోవచ్చు. కానీ, ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడికెళితే అక్కడ చనిపోయినవారి తాలూకా బంధువులు బాధపడుతున్నారు, రోదిస్తున్నారు. వారిని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈజీవోను తెచ్చారు తప్ప.. చంద్రబాబును కట్టడి చేయాలనే ఉద్దేశం కానేకాదు. 

పుష్కరాలకు వచ్చిన 29 మంది భక్తులు చంద్రబాబు ప్రచార పిచ్చికి మృతిచెందారు. ఇంకా బుద్ధిలేకుండా, పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. 14 సంవత్సరాలు పరిపాలన చేశాను.. ఇంత అభివృద్ధి, ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాను నాకు ఓటు వేయండి అని అడగకుండా.. నన్ను కట్టడి చేస్తున్నారు.. తిరగబడండి అని భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు సాధించాలనుకునే వాడికి.. తాత్కాలిక రాజకీయాలకు తప్ప.. శాశ్వత రాజకీయాలకు పనికిరాడని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు చేస్తున్న యాగీని ప్రజలు గమనించాలి. 
సీఎం వైయస్‌ జగన్‌ గతంలో ఓదార్పు యాత్ర, భరోసా యాత్ర చేసినప్పుడు ఎక్కడైనా అన్యాయం జరిగిందా..? జనం చనిపోయారా..? తగు జాగ్రత్తలు తీసుకొని యాత్రలు చేశారు. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎవ్వరికైనా వర్తిస్తోంది. వైయస్‌ఆర్‌ సీపీ కూడా జీవోలో ఉన్న నియమాలను పాటిస్తుంది. 

చంద్రబాబు పెద్ద డ్రామా ఆడే కార్యక్రమం చేస్తున్నారు. లాఠీ చార్జ్‌లో చాలామందికి దెబ్బలు తగిలాయని ఆస్పత్రికి వెళ్లి చంద్రబాబు పరామర్శించాడు. అవన్నీ కృత్రిమ కట్టు కట్టారు. బాబు పలకరించి వెళ్లిపోగానే.. వారంతా ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇంతకంటే డ్రామా ఏమైనా కావాలా..? దెబ్బలు తగలకపోయినా.. తగిలినట్టుగా కట్లు కట్టించి, ఆస్పత్రిలో చేర్పించి, వారిని పలకరిస్తున్నట్టుగా మాట్లాడి.. కన్నీరు పెట్టుకున్నట్టుగా యాక్షన్‌ చేసి ఫొటోలు తీసుకొని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీల్లో వేసి అన్యాయం జరిగిపోయిందనే మాట మాట్లాడుతున్నావంటే.. ఎందుకింత దిగజారిపోయావు. 

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు దుప్పట్లు, చింతపండు పంపిణీ చేస్తే తప్ప ఆయన సభలకు జనం రాని దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్లి.. వారందరినీ పోగుచేసి, వారి ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చి, శనిలాగా ఈ రాష్ట్రానికి పట్టుకున్న చంద్రబాబు.. జీవోను చూసి గగ్గోలుపెడుతున్నాడు. 

ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారమే మీటింగ్‌లు పెట్టుకోవాలి, జీవో ప్రకారమే టూర్లు చేయాలి. ఇది చట్టం, దీన్ని అతిక్రమిస్తే ఎవ్వరినైనా ప్రభుత్వం సహించదు. ప్రజలు, వారి ప్రాణాలు ఈ ప్రభుత్వానికి ముఖ్యం. ఎవ్వరినీ కట్టడి చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు, రాదు. 

తాజా వీడియోలు

Back to Top