సాగునీటిపై ‘ఎల్లో విషం’

ఎల్లో మీడియా కధనాలపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్ర‌హం

 నిత్యం జగన్‌గారిపై బురద చల్లే ప్రయత్నం

సాగునీటి ప్రాజెక్టులపైన మరో తప్పుడు కథనం

భారతి సిమెంట్స్‌కు నీరు ఇస్తున్నారంటూ విమర్శ

నిర్ణీత అనుమతితోనే ఆ సరఫరా కొనసాగుతోంది

అదే విషయాన్ని మళ్లీ అదే పత్రిక రాసుకొచ్చింది

మరి ఆ కథనం ఎందుకు రామోజీరావుగారూ?

 పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ పాపం చంద్రబాబుదే

దమ్ముంటే చర్చకు రండి. అసెంబ్లీలోనే మాట్లాడుదాం

అసెంబ్లీకి రాకుండా బయట విమర్శలు చేయడం ఏమిటి

మీకు చర్చించే ధైర్యం ఉంటే అసెంబ్లీకి హాజరు కండి

చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు సవాల్‌

ఆగస్టులో నెల్లూరు, సంగం బ్యారేజీల ప్రారంభం

నాడు వైయస్సార్‌ మొదలు పెట్టిన బ్యారేజీల పనులు

నేడు ఆయన కుమారుడు ప్రారంభించనున్నారు

సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు

ప్రెస్‌మీట్‌లో మంత్రి అంబటి రాంబాబు వెల్లడి

తాడేపల్లి: సాగునీటి ప్రాజెక్టుల‌పై ‘ఎల్లో విషం’ చిమ్ముతున్నార‌ని మంత్రి అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. ఎల్లో మీడియా కధనాలనుమంత్రి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో పారదర్శక పాలన సాగిస్తున్న సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు నీరాజనాలు పలుకుతుండటం చూసి ఓర్వలేక 40 ఏళ్ల రాజకీయ జీవితమని చెప్పుకునే చంద్రబాబు బూతు పురాణానికి తెగబడ్డారని ధ్వ‌జ‌మెత్తారు. ఇక అధికారం దక్కదనే భయంతోనే దాష్టీకాలకు తెరతీయడం నిజం కాదా అంటూ  సూటిగా ప్రశ్నించారు. ఆరిపోయే దీపానికి వెలు గెక్కువ అనే రీతిలో పతనావస్థకు చేరిన టీడీపీ.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.. అయ్యన్న పాత్రు డు, నెల్లూరులో వడివేలు లాంటి ఓ నేత కంటే దిగ జారిపోయి.. సీఎం వైయ‌స్‌ జగన్‌ను దూషిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  మంత్రి అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  

అందుకే రెచ్చగొట్టే ప్రయత్నం:
    రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన జరుగుతోంది. ధర్మమైన, అవినీతి లేని పాలన సాగుతోంది. ఇవి చూసి భరించలేని చంద్రబాబు, మళ్లీ అధికారంలోకి రామని తెలియడంతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
    చంద్రబాబు పాలనలో రైతు భరోసా, వైయస్సార్‌ చేయూత, అమ్మ ఒడి అనే పథకాలు ఉన్నాయా? అవేవీ లేవు. అయినా అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు.
    వారికున్న మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. ఈ మూడు ఒక ఉద్యమం చేపట్టాయి. చెడు వార్తలు రాయడం. జగన్‌మోహన్‌రెడ్డిగారి మీద విషం చిమ్మడం. ప్రజల మైండ్‌ మార్చడం. వారిని చంద్రబాబు వెంట నడిపించాలనే ప్రయత్నం. ఒక చెడు ఉద్యమానికి పునాదులు వేసి, అదే పనిగా రాస్తున్నారు.
    మహిళలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై ప్రజల్లో చర్చకు రావొద్దని, తెలుగుదేశం పార్టీ వారే ఏదో ఒక అ«ఘాయిత్యం సృష్టించడం, దాన్ని వైయస్సార్‌ కాంగ్రెస్‌కు అంటగట్టి ప్రచారం చేస్తున్నారు.

ప్రాజెక్టులపై అసత్య కథనం:
    ఇవాళ ఒక వార్త ఈనాడులో రాశారు. ప్రాజెక్టుల మీద వార్త రాశారు. రైతు ఆశలపై నీళ్లు. భారతి సిమెంట్స్‌కు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, చేపల చెరువులకు లబ్ధి అని రాశారు. భారతి సిమెంట్స్‌కు మేము నీళ్లు దొంతనంగా ఇస్తున్నామని రాశారు. రామోజీరావుగారు చట్టబద్దంగా ఏ కంపెనీ అయినా నీళ్లు తీసుకుంటుంది. మరి దీనికి వార్త రాయాల్సిన పనేమిటి? మరోవైపు మళ్లీ ఆయనే రాశారు. నిర్ణీత విధానం ప్రకారం జల వనరుల శాఖ దానికి అనుమతి ఇచ్చిందని. మరి ఎందుకు వార్త రాసి, మొదటి పేజీలో రాశారు.
    అలా జగన్‌గారు, నీళ్ల ప్రాజెక్టులన్నీ కూడా ఆయన భారతి సిమెంట్స్‌కు, ఆయన బంధువులు చెరువుల నీళ్లకు ఉపయోగించుకుంటూ, రైతులకు ఏ విధంగా ఉపయోగపడడం లేదని విషం చిమ్ముతూ వార్త రాశారు. అలా ఒక పరంపరలా వార్తలు రాస్తూ, విషం చిమ్ముతున్నారు.

ఆ ప్రాజెక్టులన్నీ జగన్‌గారి హయాంలోనే..:
    ఇవాళ గండికోట రిజర్వాయర్, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, సర్వారాయ ప్రాజెక్టు, వామికొండ రిజర్వాయర్‌.. చంద్రబాబు కాలంలో వీటిపై దృష్టి పెట్టలేదు. వాటిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ (పూర్తిగా నీరు నిండేలా) వరకు నీరు తీసుకొచ్చే విధంగా పనులు చేయకపోతే.. జగన్‌గారి ప్రభుత్వం వచ్చాక గండికోట రిజర్వాయర్‌కు (జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌–1) సంబంధించి, రూ.1,231 కోట్లు వెచ్చించి ఎఫ్‌ఆర్‌ఎల్‌ వరకు నీళ్లు తీసుకురావడం జరిగింది. ఆ మేరకు ఆర్‌ ఆర్‌ ప్యాకేజీ కూడా ఇవ్వడం జరిగింది.
    అదే విధంగా చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో ఆర్‌ ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి రూ.338 కోట్లు ఖర్చు చేసి, ఎఫ్‌ఆర్‌ఎల్‌ వరకు నీరు తెచ్చాం.
సర్వారాయసాగర్, వామికొండ రిజర్వాయర్లలో కూడా రూ.212 కోట్లు వెచ్చించి, వాటిలో నీరు నింపేందుకు కాలువలు తవ్వించే ప్రణాళికలు సిద్దం చేయడం జరిగింది.
    ఈ రెండు ప్రాజెక్టులకు మట్టి కావాల్సి వచ్చింది. అలా మట్టి తవ్వాక అక్కడ చేపల చెరువులు ఏర్పాటు చేసేలా రైతులకు ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతోంది.

కాస్త బుద్ధి తెచ్చుకోండి:
    ఇంత జరుగుతుంటే రామోజీరావుగారు దుర్మార్గంగా రాస్తున్నారు. కుక్క తోక వంకరలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఈజ్‌ ఈక్వల్‌ టు రామోజీరావు. అందుకే ఏదో విధంగా నారాజీరావును అధికారంలోకి తీసుకువచ్చే కార్యక్రమం చేస్తున్నారు.
    కాస్త బుద్ది తెచ్చుకోండి. మీరు వయసులో పెద్దవారు. చంద్రబాబును మీరు అధికారంలోకి తీసుకురావాలనుకుంటే, వేరే మార్గాలు అన్వేషించుకోండి. అంతే తప్ప, జగన్‌గారి మీద బురద చల్లకండి.

ఆగస్టులో ఆ బ్యారేజీలు ప్రారంభం:
    నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీలు. ఈ రెండింటినీ నాడు 2008, 2009లో వైయస్సార్‌గారు సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది ఆగస్టులో అటు ఇటుగా ఆ రెండింటినీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు ప్రారంభించనున్నారు. సంగం బ్యారేజీకి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టబోతున్నాం. అక్కడే వైయస్సార్‌ విగ్రహం, గౌతమ్‌రెడ్డి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. దీన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నాను.

దమ్ముంటే సభకు రండి. చర్చిద్దాం:
    పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి జగన్‌గారే కారణమని చంద్రబాబు మహానాడు, మినీ మహానాడులో  విమర్శలు చేశారు. అలాంటి సీనియర్‌ నాయకులు ఆ విధంగా ఆరోపణలు చేయడం సరికాదు. డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి ముమ్మాటికి చంద్రబాబే కారణం. మీకు దమ్ముంటే చర్చకు రండి. మీరు శాసనసభకు రండి. అక్కడే చర్చించుకుందాం.
    ఇప్పటికైనా దమ్ముంటే, చంద్రబాబుకు సిన్సియారిటీ ఉంటే.. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ జగన్‌గారి వల్లనే కొట్టుకుపోయిందనుకుంటే, శాసనసభకు రండి. అక్కడే చర్చిద్దాం. ప్రజలన్నీ చూస్తారు. నీకు దమ్ముంటే సభకు రమ్మని సవాల్‌ చేస్తున్నాం.

స్థాయి మర్చిన చంద్రబాబు:
    ప్రతిపక్ష నేత చంద్రబాబుగారు శాసనసభకు రాకుండా బయట సుదీర్ఘ ఉపన్యాసాలు చేసి ప్రజలను విసిగిస్తున్నారు. మొన్న ఒంగోలులో మహానాడు. ఆ తర్వాత చోడవరంలో మినీ మహానాడు. ఇక ఇవాళ æ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో రోడ్‌షో. ఇలా ప్రతి చోటా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. తెచ్చి పెట్టుకున్న ఆవేశం. తన స్థాయి మర్చిపోయి దిగజారి మాట్లాడే మాటలు చూస్తుంటే జాలేస్తోంది. ఎన్ని గుంటనక్క చేష్టలు చేసి అధికారంలోకి వచ్చినా, 14 ఏళ్లు సీఎంగా రాష్ట్రాన్ని పరిపాలించారు.
    అలాంటి ఆయన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌పై విరుచుకుపడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి తీవ్రవాదిలాగా తయారయ్యాడని, ఎమ్మెల్యేలు ఆస్తులు కబ్జా చేస్తున్నారని. ఇంకా క్విట్‌ జగన్‌. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని అంటున్నాడు.

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ:
    ఒక ఆవేశం. ఒక ఫ్రస్టేషన్‌. చంద్రబాబులో ఒక కొత్త మనిషి, ఒక చిత్రమైన చంద్రబాబు కనిపిస్తున్నాడు. ప్రజలకు అర్ధమవుతోందా? ఇక ముందేం జరుగుతుందో తెలియదు. ఆవేశం. ఫ్రస్టేషన్‌. ఇవన్నీ చూస్తుంటే ఒకటే అనిపిస్తోంది ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. అందుకే గర్జిస్తున్నాడు. లేనిపోని గర్జన చేస్తున్నాడు.
    అయ్యన్నపాత్రుడి కంటే, నెల్లూరులో ఒక నాయకుడు వడివేల మాదిరిగా ఉంటాడు. వారి మాటలకన్నా దిగజారి మాట్లాడుతున్నాడు.
వలంటీర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. బయట ఉద్యోగం చేస్తే రూ.15 వేలు ఇస్తారని, కానీ వారికి కేవలం రూ.5 వేలే ఇస్తున్నారంటూ వలంటీర్లను రెచ్చగొట్టే పని చేస్తున్నాడు. ఊర్కే ఆవేశపడిపోతున్నాడు.

ఆ సినిమాలు చూస్తే నిన్ను చితక్కొడతారు:
    ఇవాళ ఒక గొప్ప మాటన్నాడు. ఎన్టీ రామారావు సినిమా బొబ్బిలిపులి సినిమా గుర్తు చేసుకుని పోరాటం చేయమన్నాడు.
నిజంగా ఆ సినిమా గుర్తు తెచ్చుకుంటే, మరి సర్దార్‌ పాపారాయుడు సినిమా, మేజర్‌ చంద్రకాంత్‌ సినిమా గుర్తు తెచ్చుకుంటే.. తెలుగు ప్రజలు, తెలుగు యువత, తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారి ఈ మూడు సినిమాలు చూస్తే.. మోసం చేసిన చంద్రబాబును, 420 చంద్రబాబును, కుటుంబాలను చీల్చిన చంద్రబాబును, ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న 420 చంద్రబాబును గడ్డం ఊడేదాక, బట్టలు ఊడదీసి చెప్పులతో కొడతారు.
    ఆరోజు ఎన్టీఆర్‌ మూడు సినిమాల్లో చెప్పింది. మోసగాళ్లను తరిమి కొట్టాలని. అది చంద్రబాబును చూసే చెప్పినట్లుంది. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తల్లారా..ఆ మూడు సినిమాలు చూసి, చంద్రబాబుకు బుద్ధి చెప్పండి.

 చంద్రబాబు ఏం కోరుకుంటున్నారు?:

    శ్రీలంకలో మాదిరిగా ప్రజలు తిరగబడాలని అంటున్నాడు. అలా ప్రజలు తిరగబడ్డారు కాబట్టే, చంద్రబాబును 23 సీట్లకు పరిమితం చేసి, చివరకు ఆయన రాజకీయ వారసుడైన కొడుకును కూడా ఇంట్లో కూర్చోబెట్టారు.
    అయినా చంద్రబాబు ఉద్దేశం ఏమిటి? హింసను ప్రోత్సహిస్తున్నాడా? తిరుగుబాటు చేసి మంత్రుల ఇళ్లు తగలబెట్టాలా? ఎమ్మెల్యేల ఇళ్లు తగలబెట్టాలా? వారందరినీ చంపేయాలా?
    అధికారం కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం చంద్రబాబుది. ఆయన గురించి చంద్రబాబు తోడల్లుడు వెంకటేశ్వరరావు, స్వయంగా ఒక పుస్తకంలో రాశారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే నీచ మనస్తత్వం చంద్రబాబుది. ఈ విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసు.

Back to Top