సత్తెనపల్లి: పుంగనూరులో ఘర్షణకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, పోలీసులపై టీడీపీ రౌడీ మూకలు దౌర్జన్యానికి పాల్పడ్డారని, చంద్రబాబు ప్రేరేపించిన దాడిలో అనేకమంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అధికారంలో లేకపోతే రాష్ట్రంలో అలజడులు సృష్టించడం, విధ్వంసాన్ని ప్రేరేపించడం, హింసను ప్రోత్సహించడం, తద్వారా ప్రభుత్వంపై నెపం మోపాలనే మనస్తత్వం చంద్రబాబుదని మండిపడ్డారు. పుంగనూరులో చంద్రబాబు రోడ్డు షోకు అనుమతి లేకపోయినప్పటికీ కావాలని రౌడీ మూకలను వెనకేసుకొచ్చి విధ్వంసం సృష్టించాడన్నారు. పుంగనూరులో జరిగిన ఘర్షణకు కారణం వైయస్‌ఆర్ సీపీ కార్యకర్తలేనని టీడీపీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, ఆ సమయంలో వైయస్‌ఆర్ సీపీ కార్యకర్త ఒక్కరూ కూడా ఘటనా స్థలంలో లేరని స్పష్టం చేశారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పోలీసులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే.. రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు. నిన్న పుంగనూరులో జరిగిన విధ్వంసానికి ప్రధాన కారకుడు చంద్రబాబు. టీడీపీ అధికారంలో లేకపోతే విధ్వంసాన్ని సృష్టించాలని, హింసను ప్రోత్సహించాలని తద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే మనస్తత్వం చంద్రబాబుది. రాయలసీమకు మేలు చేస్తున్నాను, కష్టపడి పనిచేశాను అని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం ఇవన్నీ దుర్భిక్ష ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని, నీరు అందించాలని సీఎం వైయస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకువచ్చారు. దీన్ని సుమారు రూ.40,480 కోట్లు వెచ్చించి శ్రీశైలం నుంచి నీరు లిఫ్ట్ చేయాలని, 800 అడుగుల్లో ఉన్నప్పటికీ నీరు లిఫ్ట్ చేయాలని పథకాన్ని ప్రారంభించారు, దానిలో మొదటి దశ అయిన రాయలసీమ లిఫ్ట్ కొంత వరకు వెళ్లింది. ఆ తరువాత అనేక ప్రాజెక్టులు దీనితో ముందుకెళ్తాయి. దానిలో ముఖ్యంగా తంబళ్లపల్లెలో ముదివేడు, పుంగనూరు నీతిగుంటపల్లి, ఆవులపల్లి ఇలా మూడు రిజర్వాయర్లను క్రియేట్ చేస్తున్నారు. వాటికి టెండర్లు పిలిచారు. రూ.2,144 కోట్లతో టెండర్లు అయ్యాయి. ముదివేడుకు 2 టీఎంసీ, నీతిగుంటపల్లి 1 టీఎంసీ, ఆవులపల్లి రిజర్వాయర్ 3.5 టీఎంసీలు.. అంటే సుమారు 6.5 టీఎంసీలను గండికోట నుంచి తీసుకువచ్చి ఈ మూడు రిజర్వాయర్లను నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రూ.2,144 కోట్లతో ప్రారంభించారు. దీనిలో 50–60 శాతం అయిపోయింది. ఈ క్రమంలో అందరినీ రెచ్చగొట్టి ఎన్జీటీకి పంపించి దీనిపై స్టే తీసుకువచ్చాడు. ప్రాజెక్టుపై స్టే తీసుకువచ్చి ఇవాళ వెళ్లి రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రి, మంత్రులను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేసి రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడు. నేను సింహాన్ని అంటాడు. ఆయన నక్క అని అందరికీ తెలుసు. దాన్ని కొద్దిగా దాటవేయాలని సింహం అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స్టే తీసుకువచ్చిన చంద్రబాబుకు వ్యతిరేకంగా పుంగనూరులో వైయస్‌ఆర్ సీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. చంద్రబాబు పుంగనూరు రోడ్డు షో లేదు, బైపాస్ నుంచి పూతలపట్టు వెళ్లిపోతానని పోలీసులకు చెప్పాడు. ఉదయం వైయస్‌ఆర్ సీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు 1గంటకు అది పూర్తయింది. పోలీసులపై టీడీపీ దాడి 4 గంటలకు జరిగింది. బైపాస్ రోడ్డున వెళ్లాల్సిన చంద్రబాబు పుంగనూరు వెళ్లాల్సిందేనని చొచ్చుకుపోయే ప్రయత్నం చేశాడు. పర్మిషన్ లేదు, వెళ్లిపోండి, వస్తే గొడవలు జరుగుతాయని పోలీసులు నచ్చజెప్పినా వినకుండా దాడికి పాల్పడ్డారు. ఘటన ప్రదేశంలో ఒక్క వైయస్‌ఆర్ సీపీ కార్యకర్త కూడా లేడు. ఘర్షణ జరిగింది పోలీసులు, చంద్రబాబు వర్గం మధ్యే. పోలీసులపై రాళ్లు, గాజుముక్కలు, బీరుబాటిళ్లు వేశారు, ప్రిపేర్డ్‌గా వారి దగ్గర డబుల్ బ్యారల్ గన్ కూడా ఉందని పేపర్లో చదివాను. వీరంతా ఎక్కడ నుంచి వచ్చారు, పుంగనూరు, చిత్తూరు వాసులు కాదు.. అనంతపురం, ఇంకా వేర్వేరు ప్రాంతాల నుంచి టీడీపీ రౌడీ గ్యాంగ్‌ను పోగేసుకొని వచ్చి పుంగనూరులో చంద్రబాబు దౌర్జన్యకాండకు తెగబడ్డాడు. పుంగనూరులో ప్రోగ్రాం లేకపోయినప్పటికీ, పోలీసులు నచ్చజెప్పినప్పటికీ వినకుండా గొడవ సృష్టించాడు. లా అండ్ ఆర్డర్ కాపాడుతున్న పోలీసులపై దౌర్జన్యకాండ చేసి నీతులు చెబుతున్నాడు. ఎంతోమంది పోలీసుల తలలు పగులగొట్టారు, వ్యాన్లు తగలబెట్టారు, వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ రౌడీ మూకలు చేసిన దాడికి నిరసనగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బంద్ కూడా ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యలో దత్తపుత్రుడు వచ్చి చంద్రబాబుపై దాడిని ఖండిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకునే పవన్ కల్యాణ్.. పుంగనూరు ఘర్షణలో పోలీసులను రక్తం వచ్చేలా టీడీపీ రౌడీమూకలు దాడిచేసినా కూడా కానిస్టేబుల్ కొడుకువైన నువ్వు ఎందుకు దాన్ని ఖండించలేదు. ఇదేనా నీ ధర్మం పవన్..? పోలీసులపై దాడిని ఖండించకుండా చంద్రబాబుకు మాత్రం వత్తాసు పలుకుతున్నాడు. చంద్రబాబే పోలీసులపై దాడి చేయించాడు.. హింసను ప్రోత్సహించాడు, అంతాచేసి తనదే రైటు అని పత్రికల్లో రాయించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దుర్మార్గం. అధికారంలో లేకపోతే హింసను సృష్టించి దాని ద్వారా అధికారం సాధించాలనే తాపత్రయం పడుతున్నాడు. దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు కనీసం హంద్రీనీవా నీరు కుప్పం నియోజకవర్గానికి తీసుకురాలేకపోయాడు. ఎన్నికలకు ముందే కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ప్రారంభించి కుప్పం ప్రజానీకానికి నీరు అందిస్తాం. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు చేయలేకపోయాడు. వైయస్ జగన్ కుప్పం ప్రజల కోసం బ్రాంచ్ కెనాల్‌ను తీసుకువస్తున్నారు’ అని మంత్రి అంబటి చెప్పారు.