తాడేపల్లి: చందద్రబాబు నిర్వాకాన్ని ఏనాడూ ఈనాడు రాయలేదే.. అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇప్పుడేమో పోలవరంపై ఈనాడు పత్రిక పుంఖానుపుంఖాలుగా కథనాలు వండి వారుస్తోందని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పురోగతి ఆగిపోయిందని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు కూడా పదే పదే అదే మాట మాట్లాడుతున్నాడు. నిన్న కొంత మంది మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు పోలవరం వెళ్తామంటూ గందరగోళాన్ని చేశారని ధ్వజమెత్తారు. ఆదివారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఏం మాట్లారంటే: - ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలన చేసిన చంద్రబాబు పోలవరం నిర్మాణ విషయంలో అనేక తప్పిదాలు చేసింది. - దాని వల్ల పోలవరం పురోగతి ఆగిపోవడమే కాకుండా తీవ్రమైన నష్టం జరిగింది. - ఇప్పుడు మేం ఆ నష్టాలను సరిచేసే కార్యక్రమం అనేక కష్టనష్టాలకు ఓర్చి చేస్తున్నాం. - అనేక సందర్భాల్లో మేము పోలవరానికి చంద్రబాబు చేసిన నిర్వాకాన్ని వివరించినా మళ్లీ మళ్లీ అదే పాట పాడుతున్నారు. - సోమవారం పోలవరం అంటూ ప్రచారం చేసుకున్నారే తప్ప ప్రొటోకాల్ ప్రకారం ఏ నిర్మాణాన్ని చేపట్టని కారణంగా పోలవరానికి తీవ్రమైన నష్టం జరిగింది. - ప్రధానంగా డయాఫ్రం వాల్ నిర్మించి, కాఫర్ డ్యాం నిర్మాణం చేయకపోవడం వల్ల రూ.2,020 కోట్ల నష్టం జరిగింది. - మొన్న ఎన్‌హెచ్‌పీసీ కూడా వచ్చి దెబ్బతిన్న భాగాలను పరిశీలించి నివేదిక కూడా ఇచ్చింది. - ఆ దెబ్బతిన్న బాగాలను పూడ్చటానికి రూ.2020 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసి కేంద్రానికి పంపడం కూడా జరిగింది. - ఇంత తీవ్రమైన నష్ట జరిగినప్పుడు ఈ రామోజీరావు పత్రిక, ఆంధ్రజ్యోతి చిన్న ముక్క కూడా రాయలేదు. - ఇది వారి స్వయంకృతాపరాదం వల్ల, తెలివితక్కువ తనం వల్ల జరిగిందని ఒక్కరూ రాయలేదు. - టీడీపీ చేసిన తప్పిదాల వల్ల కేంద్రం నుంచి నిధులు రావడం ఆగిపోయింది. - 2013–14 రేట్లతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని చంద్రబాబు 2016లో అగ్రిమెంట్ అయ్యాడు. - అప్పుడు అంచనాల ప్రకారం పోలవరం మొత్తం ఖర్చు రూ.20,398 కోట్లు. - చంద్రబాబు ఆపనులను రామోజీ బంధువులదైన నవయుగ కాంట్రాక్టు సంస్థకు నామినేషన్ పద్దతిలో ఇచ్చేశాడు. - టీడీపీ వాళ్లు 72 శాతం పనులు పూర్తి చేశాం అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్లు చేసింది 48 శాతం పనులు మాత్రమే. - కేవలం 48 శాతం పనులు పూర్తి చేసి అప్పటి అంచనా ప్రకారం రూ.1200 కోట్లు మినహా మొత్తం రూ.20,398 కోట్లూ డ్రా చేసేశారు. - చంద్రబాబు, రామోజీ, నవయుగ వారి కాసుల కక్కుర్తి వల్ల నిధుల విడుదల ఆగిపోయింది. *వైయస్ జగన్ గారు వచ్చాకే పోలవరంలో శరవేగంగా పనులు:* - జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సార్లు ప్రధాని, జలశక్తి, ఆర్ధిక మంత్రులను కలిసి 2017–18 రేట్ల ప్రకారం అంచనాలు వేసి పంపాం. - ఆ అంచనాలు రూ.55,546 కోట్లు..దీన్ని మంత్రి వర్గం ఆమోదించాల్సిన అవసరం ఉంది. - ఈ మధ్య కాలంలో మొదటి దశ పనులకు కావాల్సిన ఖర్చులన్నీ రిలీజ్ చేయడానికి ఆర్ధిక శాఖ సిద్ధపడింది. - త్వరితగతిన పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి నిధుల అడ్డంకి తొలిగిపోయింది. - ఇది ఖచ్చితంగా జగన్ గారి చొరవ, చిత్తశుద్ధి వల్లే జరిగింది. - దీంతో ఈ పచ్చ మందకు కడుపు మండి ఏదేదో మాట్లాడుతున్నారు. - మొత్తం రూ.12,911 కోట్లను పోలవరానికి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. - అంతేకాదు...ఇంకా అదనంగా విడుదల చేయాల్సిన నిధులు కూడా ఉన్నాయి. - 41.15 కాంటూరులో నిర్వాసిత కుటుంబాలు 20,946 మంది. ఇది అంచనా మాత్రమే. - లైడర్ సర్వే చేసిన తర్వాత 16,642 కుటుంబాలు అదనంగా పెరిగాయి. దీని అంచనాలు కూడా పంపాము. - దీని కోసం మొదటి దశకు అదనంగా రూ.5,127 కోట్లు విడుదల చేయాలని మళ్లీ మేం పంపాము. - వాటిని కేంద్రం పరిశీలించి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. *నవయుగకు కాంట్రాక్టు తీసేశారనే కడుపుమంటతో పిచ్చి రాతలు:* - జగన్ గారు ప్రాజెక్టును పరిశీలించి వస్తే పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు. - దీనికి కారణం ఒక్కటే.. రామోజీ బంధువులదైన నవయుగ నుంచి కాంట్రాక్టు మెగా వారికి ఇచ్చారు కాబట్టి కడుపు మంట రాతలు రాస్తున్నారు. - మెగా వారు రివర్స్ టెండర్లో కాంట్రాక్టును దక్కించుకుంటే కడపు మంటతో తప్పుడు రాతలు రాస్తున్నారు. - మాజీ మంత్రి దేవినేని ఉమా పోలవరం వద్దకు వెళ్లి కుస్తీలు పట్టారు. - మీరు, మీ ఎమ్మెల్యేలు పోలవరాన్ని చూడాలనుకుంటే వెళ్లి జొరబడతారా..? కాస్తన్నా సిగ్గుండాలి.. - పద్దతంటూ ఒకటుంటుంది. మీరు అనుమతి కోరితే ప్రభుత్వం అనుమతిని ఇస్తుంది కదా. - ఒక ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులకు నిబంధనలు తెలియదా..? - గతంలో చంద్రబాబు కూడా రాత్రి 7 గంటలకు పోలవరం వెళ్తానంటూ ఇలానే హడావుడి చేశాడు. - పత్రికల్లో వార్తలు రావడం కోసం న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా ఒక చౌకబారు ఎత్తుగడ.. - డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణమై...రూ.2,020 కోట్లు నష్టం వాటిల్లేలా చేసిన మీరు మా గురించి మాట్లాడటం దురదృష్టకరం. - పోలవరాన్ని సర్వనాశం చేసింది చంద్రబాబు అండ్ కో..దానిని మేం బాగుచేశాం. *చంద్రబాబు తప్పిదాలను సరిచేసుకుంటూ శరవేగంగా ముందుకు:* - మీరు వదిలేసిన కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసిన ఘనత జగన్ గారిది. - మీరు స్పిల్ వే పూర్తి చేయకుండా ఒక రేకు పెట్టి గేట్లు పెట్టామన్నారు. - ఆ స్పిల్ వే మొత్తాన్ని పూర్తి చేసిన ఘనత జగన్మోహన్‌రెడ్డి గారిది. - నదీ ప్రవాహాన్ని స్పిల్ వే వైపు నడిపించింది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే. - ఈ పురోగతిని చూసి భరించలేక ఏవేవో రాతలు రాస్తున్నారు. - గైడ్ బండ్ కుంగలేదు..గైడ్ బండ్ అనేది స్పిల్ వేకి ప్రవాహం వస్తున్నప్పుడు అక్కడ సుడిగుండాలు ఏర్పడకుండా ఏర్పాటు చేసింది. - మెయిన్ డిజైన్‌లో ఇది లేదు. స్పిల్ వే కట్టిన తర్వాత పరిశోధన చేసి 500 మీటర్లు గైడ్ వేయాలని నిర్ణయించారు. దాని విలువ రూ.81 కోట్లు. - గైడ్ బండ్ వేసిన తర్వాత కొద్దిగా జారిన మాట వాస్తవం. ఎందుకు జారింది అనే దానిపై పరిశోధన చేస్తున్నాం. - సీడబ్ల్యూసీ ఒక ప్రత్యేక బృందాన్ని వేశారు. వారి పరిశీలించి నిర్ణయిస్తారు. - ఇదే విషయాన్ని జగన్‌గారు కూడా చెప్పారు. దీనికి గందరగోళం అయిపోయిందంటూ రామోజీ రోజూ దస్తాలకు దస్తాలు వార్తలు రాస్తున్నారు. - కాంట్రాక్టర్ల తప్పిదం ఏంటి..? కాంట్రాక్టర్లు డిజైన్‌లు చేయరు..డిజైన్లు అధికారులు పరిశీలించి ఆమోదిస్తారు. - సీడబ్యూసీ, పీపీఏతో పాటు ఇతర శాఖలన్నీ ఆ డిజైన్‌ను ఆమోదించిన తర్వాత మాత్రమే కాంట్రాక్టర్ ఆ పనిని చేస్తాడు. - పొరపాటు జరిగితే సరిచేస్తారు..అది చిన్న విషయం.దానికే ప్రభుత్వ అసమర్ధత అంటూ రాయడం దుర్మార్గం. - టీడీపీ చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ...ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు జగన్ గారి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. - నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. *కుప్పానికి పిల్లకాల్వ తవ్వలేని వాడు మంత్రుల గురించి మాట్లాడుతున్నాడు:* - చంద్రబాబు నీ బుర్రేమన్నా పోయిందా..? నీ గొప్పతనం ఏంటి..? - 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కనీసం కుప్పాన్ని మున్సిపాలిటీ చేశావా..? కనీసం రెవిన్యూ డివిజన్ కూడా తీసుకురాలేదు. - కనీసం కుప్పంలో కాలువను కూడా తీసుకురాలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో వదిలేశావ్. - కుప్పానికి ఏ అభివృద్ధీ చేయని నీకు మంత్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉందా..? - ఒక్క సారి పులివెందుల వెళ్లి చూడండి...ఎంతో అద్భుతంగా అభివృద్ధి జరిగింది. - పులివెందులను ఒక అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దిన వ్యక్తి డాక్టర్ వైఎస్సార్. - ఆయన ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా చేస్తే నువ్వు 14 ఏళ్లు చేశావ్. - పులివెందుల వెళ్లి చూడు తెలుస్తుంది..రాజశేఖరరెడ్డి గారిని చూసి నేర్చుకో... - పిల్ల కాల్వలు తవ్వడానికి మేం మ్రంతులమయ్యామా..? బుద్ధుండే మాట్లాడుతున్నావా..? - ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నావ్...సరైన పద్దతి కాదు. - మా మంత్రుల గురించి మాట్లాడుతున్నావ్ కానీ...నువ్వు ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఉండి ఏం చేశావ్..? - నీ ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోలేదు..కనీసం నీ నియోజకవర్గంలో ఇళ్లే కట్టుకోలేదు. - ఆయనకు కుప్పంపై ప్రేమే లేదు. తన గ్రామం, నియోజకవర్గం, రాష్ట్రంపై ప్రేమే లేదు. - నా నియోజకవర్గంలో కాల్వలు తవ్వడానికా నేను మంత్రిని అయ్యింది..? రాష్ట్రంలో ఇక ప్రాజెక్టులే లేవా..? - నేను రాష్ట్రానికి మంత్రిని...పోలవరం, వెలిగొండతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నేనే పర్యవేక్షించాలి. - ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకోవద్దు. నువ్వు ఒక మాట అంటే మేం వంద మాటలు అనగలం. - మీరు వయసులో పెద్ద వారు..కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. - వృద్ధాప్యం వల్ల ఒక ఫ్రస్టేషన్ వల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. *పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు, రామోజీ, నవయుగ:* - పోలవరంలో మేమేం ఎక్కడ కాసులకు కక్కుర్తి పడ్డామో చూపించండి... - మాపై ఆరోపణలు చేయడానికి మా మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి..? - ప్రధాని మోడీ గారు ఆనాడు చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంగా ఉపయోగించుకున్నాడు అన్నది నిజం కాదా..? - జాతీయ ప్రాజెక్టును మీరెందుకు కట్టాలని నిర్ణయించుకున్నదాంట్లోనే అసలు కాసుల కక్కుర్తి దాగి ఉంది. - 2013–14 రేట్లతోనే పూర్తి చేస్తామని అగ్రిమెంట్ అవడానికి కారణమే కాసుల కక్కుర్తి. - ఎప్పుడు బిల్లులు చేసుకుని దోచేసుకుందామనే ఆతృత..నవయుగ వాళ్ల నుంచి కమీషన్ తీసుకుందామని ఆనాడు చంద్రబాబు ఆతృత. - పోలవరాన్ని కాసుల కక్కుర్తితో సర్వనాశనం చేసింది చంద్రబాబు, రామోజీ, నవయుగ. - వీరు ముగ్గురు కలిసి కమీషన్ల కోసం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. - జాతీయ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేస్తే బాగుండేది. మీరు కాసులకు కక్కుర్తి పడి కేంద్రం నుంచి లాక్కుని మమ్మల్ని అంటే ఎలా..? *పోలవరాన్ని జగన్ గారే పూర్తి చేస్తారు..నీళ్లిస్తారు..:* - మేం రెండో డీపీఆర్‌ను ఆమోదింపజేసుకుని మొదటి దశకు రూ.12,911 కోట్లు విడుదల చేసే పరిస్థితి తీసుకొచ్చాం. - 41.15 మీటర్లతో ఈ ప్రాజెక్టును ఆపేస్తాం అంటూ దుష్ప్రచారం చేశారు. - ఆర్ధిక లోటు రూ.10,400 కోట్లు ఇస్తే ఇక పోలవరానికి డబ్బులివ్వరని వీళ్లే ప్రచారం చేశారు. - మరి పోలవరానికి కూడా డబ్బులు రూ.12,911 కోట్లు ఇస్తున్నారు కదా..? - వాళ్లకి పత్రికలు, చానళ్లు ఉన్నాయని ఇష్టారీతిన అబద్దాలు వండివారుస్తున్నారు. - పోలవరం మీద చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం. - కారణం ఇది రాజశేఖరరెడ్డి గారు కలలు కన్న ప్రాజెక్టు. - చంద్రబాబు పూర్తి చేయడం అనేది ఇక జరగని పని. - జగన్ గారే దాన్ని పూర్తి చేస్తారు..కుడి ఎడమ కాల్వలకు ఆయనే నీరిస్తారు. - పోలవరంలో వైఎస్సార్ గారి అద్భుతమైన విగ్రహం కూడా పెడతాం. *చంద్రబాబు, పవన్ చేసే ఆరోపణలే బీజేపీ చేస్తోంది..:* - భారతీయ జనతా పార్టీ వాళ్లు మాపై ఆరోపణలు చేయడంలో కొత్తేముంది..? - పవన్ కళ్యాణ్ ఏ ఆరోపణలు చేశారో అవన్నీ బీజేపీ చేసినట్లే.. - టీడీపీ వారు చేసే ఆరోపణలే పవన్ కళ్యాణ్ చేస్తాడు..పవన్ చేసే ఆరోపణలే బీజేపీ చేస్తోంది. - అయినా నిన్నటి వరకూ సోము వీర్రాజు కూడా ఇవే అరోపణలు చేశారు కదా..? - ఒక రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం వారికి సరదా అయ్యింది.. - మా అవినీతిపై వారి వద్ద ఆధారాలున్నాయి అంటే కేంద్రంలో వారే అధికారంలో ఉన్నారు కదా...నిరూపించుకోమనండి.. *ఎంత మంది వస్తాదులు వచ్చినా నన్నే గెలిపిస్తారని నా నమ్మకం:* - కొత్త కొత్త వ్యక్తులను నా మీదకు పోటీకి తీసుకొస్తున్నారు...వస్తాదులను తీసుకొస్తున్నారు. - ఇంతకు ముందు కుస్తీ పోటీల్లో, ఎన్నికల పోటీల్లో గెలిచిన వస్తాదులను తీసుకొచ్చి నన్ను ఓడించాలని చూస్తున్నారు. - పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేసుకునే ప్రయత్నాలకు నాకేమీ అభ్యంతరం లేదు. - అన్ని పార్టీలు మారిన వస్తాదులను తీసుకొచ్చి నామీద పెడుతున్నారు. - నేనేమీ కాళ్లు పట్టుకుని, పార్టీలు మారి టిక్కెట్ తెచ్చుకోను. - విశ్వాసంగా ఉండి నేను జగన్ గారి వద్ద నుంచి టిక్కెట్ తెచ్చుకుని సత్తెనపల్లిలోనే పోటీ చేస్తాను. - ఎంత మంది వస్తాదులు వచ్చినా నా ప్రజలు నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను.