ప్ర‌జ‌లు, విలువ‌ల‌తో సంబంధం లేని పొలిటీషియ‌న్ ప‌వ‌న్‌

కాపులను చంద్ర‌బాబుకు తాకట్లుపెట్టేందుకు ప‌వ‌న్‌ ప్రయత్నం 

సీఎం.. సీఎం అనేవారంతా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ప్ర‌శ్నించాలి

పవన్‌ను నమ్ముకున్న జనసేన కార్యకర్తలకు దిక్కు తోచడం లేదు

ఎవరెన్ని కుట్రలు చేసినా, మళ్లీ మా విజయాన్ని ఎవరూ ఆపలేరు

జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

విజ‌య‌వాడ‌: పవన్ క‌ల్యాణ్ అనే వ్యక్తి పావలాకో, పదికో, పరకకో లాలూచీ పడి ఈ రాష్ట్రంలో తనను నమ్ముకుని ఉన్న కాపు సామాజికవర్గ ఓటర్లందర్నీ గంపగుత్తగా చంద్రబాబుకు ఊడిగం చేయడానికి తీసుకెళ్తాడు తప్ప జరిగేది.. ఒరిగేదేమీ లేదని జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్, చంద్ర‌బాబు భేటీపై మంత్రి అంబ‌టి రాంబాబు స్పందించారు. వారిద్ద‌రి భేటీపై ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘మేం పరస్పర పరామర్శలు చేసుకుంటున్నాం’.. అని చంద్రబాబు, పవన్ చెబుతూ వారు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ తొలి నుంచి ఏం చెబుతున్నారో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఇవాళ అదే చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి పవన్ సిద్ధంగా ఉన్నాడ‌ని, వారిద్ద‌రూ సీట్లు సర్దుబాటు చేసుకోబోతున్నారని, పదో, పరకో తీసుకుని చంద్రబాబుకు ఊడిగం చేసేందుకు పవన్ కల్యాణ్‌ సిద్ధంగా ఉన్నాడన్నారు. 

‘మా పవన్ కల్యాణ్‌ సీఎం అవుతాడు’.. అని గొంతు చించుకుని అరిచే వాళ్లంతా ఇప్పుడు పవన్‌ను ను ప్రశ్నించాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని, ‘అయ్యా.. మీరిద్దరూ కలిసి 2024లో కలిసి పోటీ చేస్తున్నారా..? లేదా..?. గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి..? అని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లంతా ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించాల‌ని మంత్రి అంబ‌టి రాంబాబు సూచించారు. ఏదో మీడియాలో పెద్ద కవరేజీ కోసం వారిద్దరి ఆరాటమే తప్ప, వారిద్దరి కలయికలో పెద్ద పస ఏమీ లేదన్నారు. భారతీయ జనతా పార్టీ నేత‌లు పవన్ మాతోనే ఉన్నాడని ఇప్పటిదాకా చెప్పారని, మరోవైపు పవన్ కూడా బీజేపీతో మిత్రపక్షమని చెప్పాడని, మరి, బీజేపీతో ఉండాల్సిన పవన్ మరోవైపు చంద్రబాబుతో ఎందుకు ఉంటున్నాడు..? ఇది నైతికమేనా..? అని మంత్రి అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. 

ఈ దేశంలో, రాష్ట్రంలోనూ అన్‌రిలయబుల్‌ పొలిటీషీయన్, నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది పవన్ కల్యాణ్‌ మాత్రమేన‌న్నారు. బీజేపీతో విడాకులు కాకుండా చంద్రబాబుతో సంబంధానికి అర్థం ఏమిటి పవన్‌..?. మీకసలు నైతిక విలువలు ఉన్నాయా?. అని ప్ర‌శ్నించారు. జనసేన అనేది చంద్రబాబుకి ఒక అఫ్లియేటెట్‌ సంస్థ అని అన్నారు. చిరంజీవి అప్పుడు ఏకంగా తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశాడు. అలాగే, పవన్ కల్యాణ్‌ను కూడా తన పార్టీని తెలుగుదేశం పార్టీలో కలిపేసెయ్యండి. ఎవరొద్దన్నారు?  ఇంకా ముసుగులో గుద్దులాటలెందుకు? డ్రామాలెందుకు? పరస్పర పరామర్శలెందుకు?. ఇంకా ఎవరిని మోసం చేయాలని?. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఏం చేసినా, చేయాలనుకున్నా 2024లో మళ్లీ వైయస్ఆర్ సీపీ విజయాన్ని మీరెవ్వరూ అడ్డుకోలేరన్నారు. 
 

Back to Top