ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయాలు నేను చేయను

మంత్రి అంబ‌టి రాంబాబు

రూ.2 లక్షలు తీసుకునే దౌర్భాగ్యం ఉంటే పదవిని తృణప్రాయంగా వదిలేస్తా

 చంద్రబాబు జేబు పార్టీ నాపై ఆరోపణలు చేస్తే నేనేలా ఊరుకుంటా 

జనసేన అభిమాని చనిపోతే కనీసం పలకరించని కుసంస్కారం పవన్‌ది

ప‌ల్నాడు:  ప్యాకేజీ తీసుకునే స‌న్నాసి రాజకీయాలు తాను చేయ‌న‌ని మంత్రి అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు. తాను రూ.2 ల‌క్ష‌లు లంచం అడిగిన‌ట్లు చంద్ర‌బాబు జేబు పార్టీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను మంత్రి అంబ‌టి రాంబాబు తీవ్రంగా ఖండించారు. రూ.2 లక్షలు తీసుకునే దౌర్భాగ్యం ఉంటే పదవిని తృణప్రాయంగా వదిలేస్తాన‌ని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల పరిహారంలో డబ్బులు తీసుకున్నానని సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ళ వచ్చి  నాపై ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ ను, నిరూపించమని నేను సవాల్ విసిరితే అది చేతకాక పారిపోయి, ఈరోజు రైతులకు సంబంధం లేని వేరే ఘటనను తెరపైక తీసుకొచ్చి  నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిప‌డ్డారు. 

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,  సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వారికి ఒక్కొక్క కుటుంబానికి రూ.7 లక్షలు చొప్పున మొత్తం రూ. 84 లక్షలను ప్రభుత్వం పరిహారంగా చెల్లించింది. ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేదు. చేతనైతే నిరూపించు అని మరోసారి పవన్ కల్యాణ్ కు సవాల్ విసురుతున్నాను. 

 దానికి సమాధానం చెప్పలేక, సత్తెనపల్లిలో ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ ఘటనలో మరణించిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన పంచాయితీని దీనికి ముడిపెట్టి ఆరోపణలు చేయడం తగదని మంత్రి అంబటి హెచ్చరించారు. 

 జనసేన కోసం ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రాణాలు అర్పించిన యువకుడు మట్టం అశోక్  కుటుంబాన్ని ఆదుకుంటామని మాట ఇచ్చి, ఇక్కడకు వచ్చి కూడా కనీసం పలకరించలేని, మృతుడు తండ్రి పరిహారం కోసం వస్తే.. గెంటేసిన పవన్ కల్యాణ్ .. నాపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటు . 

  పవన్ కల్యాణ్ లా పార్టీ పెట్టి, దానిని చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టి, అందుకు ప్యాకేజీగా క్యాష్ తీసుకునే సన్నాసి రాజకీయాలు నేను జన్మలో చేయను అంటూ అంబటి విరుచుకుపడ్డారు.

శ‌వాల మీద పేలాలు ఏరుకోవాల్సిన ఖర్మగానీ, రైతుల ఆత్మహత్యల పరిహారాన్ని తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిగానీ నాకు పట్టలేదని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల దగ్గర నుంచి నేను  రూ. 2 లక్షలు రూపాయలు తీసుకున్నానని నిరూపిస్తే.. నా పదవిని తృణప్రాయంగా వదులుకోవడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని మంత్రి అంబటి స్పష్టం చేశారు.

Back to Top