ఒడిశా : రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారని, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించిన అనంతరం మంత్రి అమర్‌నాథ్, ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం ఆదివారం ఉదయం బాలాసోర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ.. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో తమ వారు కనిపించడం లేదని ఇప్పటివరకు ఎవరూ రాలేదని, ఇప్పటికీ తమ వారి ఆచూకీ లభ్యం కానివారు 83339 05022 వాట్సాప్‌కు వారి ఫొటోలు పంపిస్తే అధికారులు వారి వివరాలు సేకరిస్తారని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు. `కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో 309 మంది ఏపీకి చెందినవారు ప్రయాణిస్తున్నారు. అలాగే, ఏపీ నుంచి హౌరా వైపు 33 మంది ప్రయాణిస్తున్నారు. ఈ 342 మందిలో ఇప్పటివరకు 331 మందిని గుర్తించాం, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. గుర్తించిన వారిలో 14 మంది క్షతగాత్రులని, వీరిలో 10 మంది రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్‌లో, నలుగురు క్షతగాత్రులు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. ఇదే బోగీలో ప్రయాణిస్తున్న గురుమూర్తి అనే ఒక వ్యక్తి మాత్రం మరణించారు` అని మంత్రి అమర్‌నాథ్ వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన 16 అంబులెన్స్‌లను, 10 మహాప్రస్థానం వాహనాలను భువనేశ్వర్ లో అందుబాటులో ఉంచామని, మరో ఐదు అంబులెన్సులను బాలాసోర్ వద్ద సిద్ధంగా ఉంచామని మంత్రి చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొంతమందిని భువనేశ్వర్ లోని అపోలో హాస్పిటల్ తరలించామని, ఇద్దరిని విశాఖలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ కు, ఒకరిని విశాఖ ఆరిలోవలోని అపోలోకు తరలించినట్టు తెలిపారు.