జనసేన పార్టీకి ఎప్పుడు స్వాతంత్య్రం వస్తుందో?

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్  

తాడేప‌ల్లి: సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు స్వాతంత్య్రం వస్తుందో చెప్పాల‌ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే స్వాతంత్రం నీకు ఉందా...? అని ప్ర‌శ్నించారు.   2024 ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే స్థానాలలో, 25 ఎంపీ స్థానాలలో నీ పార్టీ పోటీ చేస్తుందా.. లేదా..  దీనికి ముందుగా ప‌వ‌న్‌ సమాధానం చెప్పాల‌న్నారు.  దేశమంతా స్వాతంత్య్రం వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ రాజకీయ కామెంట్లు చేయడం సిగ్గుచేటు అని విమ‌ర్శించారు.  ఒంటరిగా పోటీ చేసే స్వాతంత్రం లేని నువ్వు స్వాతంత్య్రం  గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు.  అసలు తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీకి స్వతంత్రం వచ్చిందా.. అని పవన్ కళ్యాణ్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా అన్నారు.  76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో.. తెలుగుదేశం పార్టీ నుండి స్వతంత్రం కోసం జనసైనికులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్... చంద్రబాబు నాయుడుకి మేలు చేయడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప, అతని వల్ల, ఆ  పార్టీ వల్ల రాష్ట్రానికి ఎటువంటి మేలు లేద‌ని చెప్పారు.

ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తి పవన్ కల్యాణ్

            భారతీయులంతా వజ్రోత్సవ స్వాతంత్య్ర‌ దినోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో.. రాష్ట్రంలోనూ నూతనంగా ఏర్పడిన జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాల్లో మొట్టమొదటిసారిగా స్వాతంత్య్ర‌ వేడుకలు ఘనంగా, ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. స్వాతంత్య్ర‌ సాధన కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్న తరుణంలో.. రాజకీయాలు తీసుకువచ్చి, రాజకీయ విమర్శలు చేసే సందర్భం కానప్పటికీ, ఇవాళ  గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి మీద, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం మీద జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. విమర్శలు చేయడానికి కూడా సమయం, సందర్భం ఉండాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి పవన్ కల్యాణ్. 

- ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కలిగిన దేశం మనది. దేశంలోని ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు ఉంది. అయితే మాట్లాడేందుకు కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆజాదీ కా అమృత్ మ‌హోత్సవల నేపథ్యంలో దేశ అభివృద్ధి, దేశంలో జరుగుతున్న పారిశ్రామిక, వ్యవసాయ, ఇతర రంగాల అభివృద్ధిపై ఎవరైనా మాట్లాడాలి. అలాగే ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు కానీ రాజకీయపరమైన విమర్శలు చేయడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.

టీడీపీ నుంచి జనసేనకు స్వాతంత్రం ఎప్పుడు..?
         రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే.. పవన్‌ కల్యాణ్‌ మాత్రం రాష్ట్ర ప్రజలను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నట్లు, వారిని కష్టాలకు గురి చేస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తయింది. మరి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకు స్వాతంత్య్రం వచ్చిందో లేదో పవన్‌ కల్యాణ్‌ సూటిగా సమాధానం చెప్పాలి.  ఇవాళ 140 కోట్లు మంది భారతీయలు స్వాతంత్య్ర‌ దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి, మీ జనసేన పార్టీకి టీడీపీ నుంచి స్వాతంత్య్రం వచ్చిందా లేదా అనేదానిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్యాకేజీ రాజకీయాలకు అలవాటు పడిన నీవు, నీ సొంత నిర్ణయాలకు స్వాతంత్య్రం వచ్చిందా లేదా చెప్పాలి. ఇవన్నీ చెప్పడం మానేసి  ముఖ్యమంత్రిగారి మీద, మా ప్రభుత్వం మీద, మా మంత్రుల మీద, మా పార్టీ నాయకత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఏ సందర్భంలో మీరు విమర్శలు చేస్తున్నారో కనీసం ఆత్మవిమర్శ చేసుకోవాలి. 

పథకాలు ఎందుకు అని ప్రశ్నించడమా..?
    గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తీసుకువచ్చిన మొట్టమొదటి వ్యక్తి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని చెప్పడానికి గర్వపడుతున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను గ్రామాలలో ప్రజలకు చేరువ చేసి, వారి సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చారు. ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేసేలా చేస్తున్నారు.  ఈ పథకాలు  ఎందుకు అని పవన్‌ ప్రశ్నిస్తున్నారు? ఇప్పుడు ఉన్న వ్యవస్థలు ఏరకంగా పటిష్టంగా ఉన్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అసలు పటిష్టంగా ఉండాల్సింది మీ రాజకీయ పార్టీ అనేది గమనించాలి.  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్లి పేదవాళ్లను అడిగితే.. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి గురించి చెబుతారు. 

2024లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని పవన్ చెప్పగలడా...?
        పవన్‌ ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. వాటి జోలికి వెళ్లదలచుకోలేదు. అసలు ఇవాళ రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు. వీటన్నింటినీ పక్కన పెడదాం. ఒకే ఒక్క అంశంపై పవన్‌ కల్యాణ్‌ సూటిగా, సుత్తి లేకుండా సమాధానం చెప్పాలి. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175  అసెంబ్లీ సీట్లకు.. 175 స్థానాల్లో పోటీ చేస్తున్నామని పవన్‌ కల్యాణ్‌ చెప్పగలడా? అలాగే 25 పార్లమెంట్‌ స్థానాలకు జనసేన పోటీ చేస్తుందా? ఈ రెండింటికి పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం. మా సవాల్‌కు సమాధానం చెప్పాలి.

రాష్ట్రాన్ని ఉద్దరిస్తామని రాజకీయ పార్టీని స్థాపించి, ఆ తర్వాత ఇతర పార్టీలకు కొమ్ముకాస్తూ, ఆ పార్టీలను భుజాన వేసుకుని మోస్తున్న నీకు..  జగన్‌గారి పాలన గురించి మాట్లాడే అర్హత ఉందా...?. అలాగే రాష్ట్రంలో పేదవాడి ఆనందాన్ని చూడలేక నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తున్నావు. దేశమంతా  వజ్రోత్సవ స్వాతంత్య్ర‌ సంబురాలు జరుపుకుంటుంటే.. మీ జనసేన పార్టీ నాయకులు మాత్రం టీడీపీ నుంచి తమకు స్వాతంత్య్రం ఇంకా రాలేదని బాధపడుతున్నారు. పవన్‌ ముందుగా దాని సంగతి చూస్తే బాగుంటుంది. దానికి సమాధానం చెప్పండి. 

మరి బాబు కోసమే పార్టీ పెట్టావా...?
        కులం చూసుకుని, ప్రాంతాన్ని చూసి పార్టీ పెట్టలేదంటూ పవన్‌ వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఇంకా మభ్యపెట్టి తద్వారా చంద్రబాబు నాయుడుకు మేలు చేద్దామనే తాపత్రయం ఎందుకో అర్థం కావడం లేదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్... చంద్రబాబు నాయుడుకి మేలు చేయడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప, అతని వల్ల, ఆ  పార్టీ వల్ల రాష్ట్రానికి ఎటువంటి మేలు లేదు .. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్పబోతున్నారు. బాబుతో మీకు లాలూచీలు ఉంటే వాటిని అంతర్గతంగా చూసుకోండి. వాటిని వదిలేసి, ఎవరికో మేలు చేయడం కోసం, మామీద విమర్శలు చేస్తే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదు. రాష్ట్రంలోని అయిదు కోట్లమంది ప్రజలకు ఏరకంగా మేలు, మంచి జరిగేలా ముఖ్యమంత్రిగారు పనిచేస్తున్నారన్నది ప్రజలకు తెలుసు. జగన్ గారు దేశంలోనే ఆదర్శంగా పాలనను అందిస్తూ.. సంక్షేమం, అభివృద్ధిలో అందరికంటే ముందున్నారు.

టీడీపీకి ఉపయోగపడాలన్నదే పవన్ పాలసీ
         ముఖ్యమంత్రిగారు రేపు (మంగళవారం) అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ. 2200 కోట్లతో రెండు దశల్లో నిర్మాణం చేపట్టిన ఏటీసీ టైర్ల కంపెనీ ఫస్ట్ ఫేజ్ ను ప్రారంభించనున్నారు. తద్వారా 5వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం. పవన్‌ కల్యాణ్‌కు  సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్రానికి కొత్తగా వస్తున్న ప్రాజెక్టులు.. ఇవన్నీ కళ్లకు కనిపించడం లేదా? టీడీపీకి ఉపయోగపడాలనే ఒకే ఒక పాలసీ పవన్‌ కల్యాణ్‌ది. తాము గాంధీజీ వారసులం కాదని, సుభాష్‌ చంద్రబోస్‌ వారసులమని చెబుతున్నారు కదా.. ఏం చేస్తావు నువ్వు. నీ ఉద్దేశం ఉంటి? నీ మాటలు ఏంటి? నీకే స్వాతంత్య్రం లేదు, ఇక మా గురించి మాట్లాడతావా? ముందు నువ్వు  స్వాతంత్య్రం తెచ్చుకుని రాష్ట్రంలోని 175 స్థానాలకు జనసేన తరపున పోటీ చేస్తామని ప్రకటన చేస్తే..  అప్పుడు నీదొక పార్టీ అని, నీవు కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావని, నీకు స్వతంత్య్రం వచ్చిందనే అభిప్రాయం రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది. అప్పుడు నువ్వు ఏది మాట్లాడినా దానిపై సమాధానం చెప్పడానికి ఎవరైనా స్పందిస్తారు. ముఖ్యమంత్రిగారి మీద, మా ప్రభుత్వంపై నువ్వు ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడితే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు గానీ చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తున్నాం.

తాజా వీడియోలు

Back to Top