అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగిని రాధిక కుటుంబాన్నిఆదుకుంటాం

స్విమ్స్ ఘటనపై మంత్రి ఆళ్ల నాని సీరియస్‌‌
 

అమరావతి: తిరుపతి స్విమ్స్ శ్రీ పద్మావతి కోవిడ్ హాస్పిటల్ కొత్తబ్లాక్‌లో చోటు చేసుకున్న ప్రమాదంలో ఒక ఉద్యోగి మృతి చెందడం బాధాకరమని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఈ సంఘటన జరిగిన తీరుపై తక్షణమే స్పందించిన మంత్రి.. తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ నుంచి ప్రమాద వివరాలను ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సీరియస్‌ అయిన మంత్రి గాయపడిన కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ వెంగమ్మను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగిని రాధిక కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకొని ఒక నివేదిక ఇవ్వాలని ఇంజినీర్లను ఆయన ఆదేశించారు.  

తిరుపతి స్విమ్స్ మొదటి అంతస్తులో కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్విమ్స్ డైరెక్టర్లకు సూచించారు. స్విమ్స్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం మొదటి బ్లాక్‌లోకి వస్తున్న సమయంలో కరోనా పేషెంట్లకు గాయాలు అయ్యాయని చెప్పారు. ఆకస్మికంగా పెచ్చులు ఊడి పడటంతో ప్రమాదం జరిగిందని, పూర్తి విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో ఎవరైనా బాద్యులు అని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

Back to Top