పాజిటివ్‌ కేసుల్లో 140 మంది ఢిల్లీ వెళ్లొచ్చినవారే

సోషల్‌ డిస్టెన్స్‌తో కరోనా వ్యాప్తిని అరికట్టగలం

ప్రతీ చోట పరిశుభ్రత, నాణ్యత పాటించాలి

కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ల సంఖ్య పెంచబోతున్నాం

ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని సీఎం ఆదేశం

అర్హులైన ప్రతీ ఒక్కరికి రూ. వెయ్యి సాయం 

దుకాణాల వద్ద శాశ్వత మార్కింగ్‌లు ఏర్పాటు చేస్తాం

రైతుకు ఎలాంటి కష్టం రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

తాడేపల్లి: కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో 140 మంది ఢిల్లీ వెళ్లివచ్చినవారే ఉన్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో 161 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వివరించారు. సోషల్‌ డిస్టెన్స్‌తో కరోనా వ్యాప్తిని అరికట్టగలం అని, దయచేసి అందరూ లాక్‌డౌన్‌ను సహకరించాలని కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష ముగిసిన అనంతరం ఆళ్ల నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని సీఎం ఆదేశించారన్నారు. వలస కూలీల కోసం క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, నాణ్యమైన భోజనం, వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. అదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రూ. 1000 ఆర్థిక సాయం అందజేయనున్నామన్నారు. 

మంత్రి ఆళ్ల నాని ఇంకా ఏం మాట్లాడారంటే....

కరోనా వైరస్‌కు సంబంధించిన పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 161 పాజిటివ్‌ కేసులు నమోదై ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా 140 ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారే. మిగిలిన 21 మంది విదేశాల నుంచి వచ్చినవారు. 1085 మంది సభ్యులను ఢిల్లీ నుంచి వచ్చినవారిని గుర్తించాం. అందులో 946 ఈ రాష్ట్రంలోనే ఉన్నారు. 139 మంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. ఏదైతే 946 మంది ఉన్నారో.. 881 మందిని గుర్తించి, వైద్య పరీక్షలు చేశాం. అందులో 108 పాజిటివ్‌ వచ్చాయి. 65 మంది రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది. ఎవరైతే ఢిల్లీ నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన వారికి సంబంధించి 616 కంటాక్ట్స్‌ను గుర్తించాం. వీరిలో 32 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మిగిలిన 335 మంది శాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపించే ప్రక్రియ జరుగుతుంది. 

సీఎం వైయస్‌ జగన్‌ చేసిన సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జాగ్రత్త, ముందస్తు చర్యలకు మరిన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లతో చేయిస్తున్న సర్వే వివరాలను సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. సుమారు 1.45 కోట్ల ఇళ్లు సర్వే చేయాల్సి ఉండగా ప్రస్తుతానికి 1.28 కోట్ల ఇళ్లలో సర్వే పూర్తయింది. 

రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య  పెరుగుతుండడంతో టెస్టింగ్‌ ల్యాబ్‌ల సంఖ్య పెంచాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడ, కాకినాడ, అనంతపురం ప్రాంతాల్లో ల్యాబ్‌లు పనిచేస్తుండగా.. కొత్తగా గుంటూరు, కడప ప్రాంతాల్లో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. సోమవారం నుంచి విశాఖలో కూడా ల్యాబ్‌లో పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌లలో 500 మందికి టెస్టులు చేయడం వీలవుతుంది. ప్రైవేట్‌ ల్యాబ్‌ల సహకారం కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఏడు ల్యాబ్‌లు వర్కింగ్‌లోకి వస్తే రోజుకు సుమారు 900 మందికి టెస్టులు చేసే అవకాశం ఉంటుంది. 

పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. నిత్యావసర, రేషన్‌, కూరగాయల దుకాణాల వద్ద సోషల్‌ డిస్టెన్స్‌ పాటించేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, దుకాణాల వద్ద శాశ్వత మార్కింగ్‌ కోసం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ధరల పట్టిక పెద్దవిగా ఉండాలని, ప్రజలకు కనిపించే విధంగా ఉండేలా చూడాలని సూచించారు. 
క్వారంటైన్‌, ఐసోలేషన్‌లలో కనీస వసతులు, సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత, పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

వలస కూలీల కోసం ప్రత్యేకమైన క్యాంపులు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 236 క్యాంపులు నడుపుతున్నాం. క్యాంపుల్లో ప్రత్యేకమైన అధికారులను నియమించి, నాణ్యమైన భోజనం, వసతి కల్పిస్తున్నాం. అన్ని క్యాంపుల్లో కలిపి 78 వేల మంది ఉంటే 16 వేల మందికిపైగా భోజనం, వసతి సదుపాయం ప్రభుత్వం చేపడుతుంది. మిగిలిన వారి కోసం ఆయా కంపెనీలు, సంస్థలతో మాట్లాడి వసతి, భోజన సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇందుకు ప్రత్యేకమైన అధికారులను నియమించాలని ఆదేశించారు. సంస్థలు సరైన సదుపాయాలు ఏర్పాటు చేయలేకపోతే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కార్మికులకు వసతి, భోజన సదుపాయం కల్పిస్తుంది. ఎవరూ ఆకలితో అలమటించకూడదు. 

రేషన్‌కార్డు ఉన్నవారితో పాటు, కార్డు కోసం అప్లయ్‌ చేసుకున్నవారిలో అర్హులకు కూడా రూ.1000 ఆర్థిక సాయం అందించాలని సీఎం ఆదేశించారు. లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14వ తేదీ వరకు అమలులో ఉంటుంది. కరోనా వైరస్‌ నియంత్రణకు ఏ విధంగా భాగస్వాములయ్యారో.. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు ఇదే విధంగా సహకరించాలి. అవసరమైన సమయాల్లో మాత్రమే బయటకు రావాలి. సామాజిక దూరం పాటిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలుగుతామని విజ్ఞప్తి చేస్తున్నాం. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతులెవరూ నష్టపోకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్యవసాయ పనులకు అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు నష్టపోకూడదు. పంటకు కచ్చితమైన మద్దతు ధర ఇచ్చేలా అధికారులే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం ఇబ్బందులు పడినా.. రైతులు ఇబ్బంది పడకూడదని సీఎం దిశానిర్దేశం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top