గుంటూరు: పేదలకు అండగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. బుధవారం గుంటూరులో టిడ్కో ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయకుండా వదిలేసిందన్నారు. మా ప్రభుత్వం 2.62 లక్షల ఇళ్లల్లో 1.43 లక్షల యూనిట్లు నిరుపేదలకు చెందినవే. వీటికి గత పాలకులు ఒక్కో యూనిట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి, బ్యాంకు రుణాలు మంజూరు చేశాక, ప్రతి నెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని చెప్పిందన్నారు. అలా చెల్లిస్తే ఒక్కొక్కరు మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. 1.43 లక్షల మందిపైనా సుమారు రూ.10 వేల కోట్లకు పైగా భారం పడుతుందన్నారు. కానీ, సీఎం వైఎస్ జగన్ 300 చ.అ. ఇళ్లను ఒక్క రూపాయికే ఇచ్చారు. అంతేకాక.. రూ.6 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన టిడ్కో ఇళ్ల పథకాన్ని ప్రస్తుత వైయస్ఆర్ కాంగ్రెస్ సర్కారు పునరుద్ధరించి 88 పట్టణ స్థానిక సంస్థల్లో 2,62,216 ఇళ్లను జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మాణం చేపట్టిందన్నారు. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంగల 1,43,600 ఇళ్లను ఒక్క రూపాయికే అందించడంతో పాటు వీటికయ్యే ఆర్థిక భారం రూ.3,805 కోట్లను ప్రభుత్వమే భరిస్తోందన్నారు.లబ్ధిదారులు అందరికీ ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకు దాదాపు రూ.1,000 కోట్లను ప్రభుత్వమే భరించి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తోందన్నారు. టిడ్కో ఇళ్ల పత్రాలు, తాళాలు గృహ సముదాయ ప్రాంగణాల్లోనే అందజేస్తున్నామని తెలిపారు.