అన్ని జాగ్రత్తలతో పాఠశాలలు ప్రారంభిస్తాం

ప్రతీ పాఠశాలకు వైద్య సిబ్బందిని, డాక్టర్‌ను అందుబాటులో ఉంచుతాం

పదో తరగతి పరీక్షల ఫలితాల ఆధారంగా ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్లు

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

అమరావతి: అన్ని జాగ్రత్తలతో నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం నవంబర్‌ 2వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభిస్తున్నామన్నారు. విద్యా సంవత్సరం వృథా కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  ఉపాధ్యాయులందరికీ రోజూ డీఎంహెచ్‌ఓ ద్వారా అవగాహన కల్పిస్తామని, ప్రతీ పాఠశాలకు వైద్య సిబ్బందిని, పీహెచ్‌సీలో డాక్టర్‌ని అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రతి రోజూ కరోనా క్లాసులు చెప్తామని, ఇప్పటికే జగనన్న విద్యా కానుకలో ప్రతి విద్యార్థికి మూడు మాస్కులు అందజేశామని చెప్పారు. సెలవులు, సిలబస్‌ తగ్గించాల్సి ఉంటుందన్నారు. మొదటి నెల రోజులు ఒక్క పూట పాఠశాలలు నిర్వహిస్తామని, తరువాత సమీక్షించి భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. 1, 3, 5, 7, 9 తరగతులకు ఒకరోజు, 2, 4, 6, 8, 10 తరగతులకు మరో రోజు క్లాసులు నిర్వహిస్తామన్నారు. 

ఈ ఏడాది ట్రిపుల్‌ ఐటీలో పదో తరగతి పరీక్షల ఫలితాల ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. కరోనా కారణంగా ఈ ఏడాది పరీక్షలు నిర్వహించలేదన్నారు. అందుకే ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా ఎన్జీ రంగా, ఎస్వీ వెటర్నరీ, వైయస్‌ఆర్‌ హార్టికల్చర్‌ డిప్లమా కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షల ప్రకటన వెలువడిందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నవంబర్‌ 10వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయన్నారు. అనంతరం రూ. వెయ్యి అపరాధ రుసుంతో నవంబర్‌ 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. నవంబర్‌ 28న పరీక్ష నిర్వహించి, డిసెంబర్‌ 5న ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

ప్రవేశ పరీక్షకు ఓసీ అభ్యర్థులు– 300, బీసీ అభ్యర్థులు – 200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పదవ తరగతి స్థాయిలో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, పరీక్ష ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్‌ షీట్‌లో నిర్వహిస్తామని, ఎలాంటి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు.  

Back to Top