అరెస్ట్‌లపై టీడీపీ తప్పుడు ప్రచారం

మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

తాడేప‌ల్లి: అరెస్ట్‌లపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరెస్ట్‌లు, నేరాలను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు రాష్ట్రపతిని కలిశారని ఆయన ధ్వజమెత్తారు.‘‘ గత ఐదేళ్ల పాలనలో టీడీపీ రాజ్యాంగానికి తూట్లు పొడిచింది. టీడీపీ పాలనలో అన్ని వ్యవస్థలను  నిర్వీర్యం చేశారు. ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకుని పేదలకు టీడీపీ అన్యాయం చేసింది. ఇంగ్లీష్‌ మీడియంపై రాష్ట్రపతి మిమ్మల్ని ప్రశ్నిస్తే టీడీపీ ఏం సమాధానం చెబుతుంది?. చంద్రబాబు పీఎస్ ఇంట్లో సోదాల తర్వాత 2వేల కోట్ల లావాదేవీలకు ఆధారాలు బయటపడ్డాయి.చంద్రబాబుకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని’’ ఆయన దుయ్యబట్టారు.  

సంక్షోభంలోనూ సంక్షేమం
సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి సురేష్‌ తెలిపారు. ఇంగ్లీష్‌ మీడియాన్ని అడ్డుకుని పేదల పిల్లలకు టీడీపీ అన్యాయం చేసిందన్నారు. పేద ప్రజల బిడ్డలు ఎదగడం టీడీపీ నేతలకు ఇష్టం లేదని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా దళితుడిని నియమిస్తే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి పాటు పడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

అందుకే ఢిల్లీ వెళ్లారు
టీడీపీ నేతలు కేసుల నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీకి వెళ్లార‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ పేర్కొన్నారు. సీబీఐ, సీఐడీలపై కూడా టీడీపీ నేతలకు నమ్మకం లేదు.  రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వైఎస్సార్‌ చేయూత కింద మహిళలకు కొత్త పథకాలు ప్రవేశ పెడుతున్నాం. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి గతం కంటే ఎక్కవ నిధులు కేటాయించామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 

Back to Top