పాఠశాలలు తెరిచే సమయానికి పనులు పూర్తిచేస్తాం

‘మన బడి నాడు–నేడు’పై మంత్రి ఆదిమూలపు సురేష్‌ సమీక్ష

విద్యార్థుల సమస్యల ‌పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్‌ విడుదల

అమరావతి: కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్‌ రాష్ట్ర కార్యాలయంలో ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమంపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఏర్పాటు చేయబోయే పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్య, వైద్యం, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది రకాల మౌలిక వసతులు కల్పించనున్నామన్నారు. మరుగుదొడ్లు, టేబుల్స్, తాగునీరు, ప్రహరీగోడలు వంటి తొమ్మిది అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కావాల్సిన పరికరాలకు టెండర్‌ ప్రక్రియ ఖరారు చేశామని ఆయన వెల్లడించారు. 

ఆగస్టు నెల చివరి నాటికి పాఠశాలలను తెరిచే ఆలోచనలో ఉన్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను మంత్రి విడుదల చేశారు. విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా 1800 123 123 124 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చని సూచించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరికీ ప్రత్యేకంగా ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కోర్టు వివాదాలు పరిష్కారం కాగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటిస్తామన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top