‘నాడు–నేడు’ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది

జూలై చివరికల్లా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు పూర్తిచేస్తాం

రూ.8,380 కోట్లతో రెండో విడత ‘నాడు–నేడు’ కార్యక్రమం

30 వేల స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, 151 డిగ్రీ కాలేజీల్లో సదుపాయాల కల్పన

రాష్ట్రంలో అదనంగా 5 వందల జూనియర్‌ కాలేజీల నిర్మాణం

‘జగనన్న గోరుముద్ద’పై త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు

సమీక్ష అనంతరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జూలై మాసం చివరికల్లా 15,715 స్కూళ్లలో ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని పూర్తిచేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ‘నాడు–నేడు’ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. విద్యారంగంలో నాడు–నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సీఎం క్యాంపు కార్యాలయ ఆవరణలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం కింద ఏర్పాటు చేయబోయే ఫర్నిచర్, బ్లాక్‌బోర్డు, ఫ్యాన్లు, రక్షిత మంచినీటి సదుపాయాలంన్నింటినీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పరిశీలించి మరికొన్ని సూచనలు చేశారన్నారు. సీఎం సూచనల మేరకు రెండు, మూడు వారాల్లో ఇవన్నీ స్కూళ్లకు తరలించడం జరుగుతుందన్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన దాఖలాలు దేశ చరిత్రలోనే లేవని విద్యాశాఖ మంత్రి సురేష్‌ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మూడు సంవత్సరాల కాలంలో స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పన పూర్తిచేస్తామన్నారు. 

30 వేల స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రెండో విడత నాడు–నేడు కార్యక్రమం చేపట్టబోతున్నామని, ఇందుకు రూ.7,500 కోట్లు ఖర్చు చేయనున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. వీటికి అదనంగా మరో 151 డిగ్రీ కాలేజీలను నాడు–నేడు కార్యక్రమం కిందకు తీసుకువచ్చామని, వీటి అభివృద్ధి కోసం రూ. 880 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 30 వేల స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లతో పాటు 151 డిగ్రీ కాలేజీలకు కలుపుకొని రూ.8,380 కోట్ల నిధులతో ఫేస్‌–2 నాడు–నేడు కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. 

నాబార్డు నిధులతో అదనంగా 5 వందల జూనియర్‌ కాలేజీలను తీసుకువస్తున్నామని, ఇందుకు సంబంధించి 342 కాలేజీలకు టెండర్లు పూర్తిచేయడం జరిగిందని, మిగిలిన 158 కాలేజీలకు కూడా త్వరలోనే టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు.  

జగనన్న గోరుముద్దపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆరా తీశారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రతకు, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఏమైనా అవకతవకులు జరిగినా.. నాణ్యత ప్రమాణాలు తగ్గినా తల్లిదండ్రులు, విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు త్వరలోనే టోల్‌ఫ్రీ నంబర్‌ తీసుకురానున్నామని మంత్రి సురేష్‌ చెప్పారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top