నిరూపిస్తే దేనికైనా సిద్ధమే..

టీడీపీ నేతలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ సవాల్‌

ప్రకాశం: డాక్టర్‌ సుధాకర్‌బాబుతో గాని, వాళ్ల అమ్మతో గాని నేను మాట్లాడానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని, నిరూపించడానికి మీరు సిద్ధమా..? అని టీడీపీ నేత వర్ల రామయ్యకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సవాల్‌ విసిరారు. మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్‌ సుధాకర్‌బాబును అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. సీబీఐని మేనేజ్‌ చేయడానికి తాను రంగంలోకి దిగినట్లు వర్ల రామయ్య చేస్తున్న ఆరోపణలను మంత్రి సురేష్‌ తీవ్రంగా ఖండించారు. సుధాకర్‌బాబుతోనైనా, అతనికి సంబంధించిన వారితోనైనా మాట్లాడానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. మేనేజ్‌ అనే పదం టీడీపీకి బాగా సూటవుతుందని, చంద్రబాబు ఎవరినైనా మేనేజ్‌ చేయగలడన్నారు. దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు దళిత జాతికి క్షమాపణ చెప్పాలని మంత్రి సురేష్‌ డిమాండ్‌ చేశారు. వర్ల రామయ్య, డాక్టర్‌ సుధాకర్‌బాబును అడ్డుపెట్టుకొని దళితులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. 

Back to Top