వైయస్‌ఆర్‌ ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా

సంగం మేకపాటి గౌతంరెడ్డి బ్యారేజ్‌ ప్రారంభోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌  

సంగం బ్యారేజ్‌కు మేకపాటి గౌతమ్‌రెడ్డిగా నామకరణం చేశాం

గౌతమ్‌రెడ్డి మన మనసులో చిరస్థాయిగా ఉండిపోతారు

మూడేళ్లలోనే సంగం, ¯ð ల్లూరు బ్యారేజ్‌లను పూర్తి చేశాం

ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి రెండు ప్రాజెక్టులను పూర్తి చేశాం

సంగం బ్యారేజితో 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు

ప్రాధాన్యతా క్రమంలో మరో 26 ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తాం

నెల్లూరు: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించడం ఆయన  కుమారుడిగా గర్వపడుతున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ సీఎం అయ్యాక నెల్లూరు జిల్లాకు మోక్షం వచ్చిందన్నారు. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టు రేట్లు పెంచి కమీషన్లు దండుకున్నారని, సాగునీరు ,తాగునీరు ఇవ్వాలనే ఆలోచన చేయలేదన్నారు.  ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రంలో 26 ప్రాజెక్టుల పనులను పూర్తి చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. సంగం బ్యారేజీ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమన్నారంటే..

నిండు మనస్సుతో, చిరునవ్వుతో ఆప్యాయతలు పంచిపెడుతున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడుకి, ప్రతి అవ్వాతాతకు ముందుగా చేతులు జోడించి పేరు, పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. 

రూ.320 కోట్లతో సంగం, నెల్లూరు ప్రాజెక్టులు.
దేవుడి దయతో ఈరోజు మరోమంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. దాదాపు రూ.320 కోట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు చేసి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ ఈ రెండు ప్రాజెక్టులను పూర్తిచేసి జాతికి అంకితం చేసుకుంటున్నాం. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీటిని స్ధిరీకరించాం. దీనివల్ల ఆత్మకూరు, నెల్లూరురూరల్, సర్వేపల్లి, కోవూరు, కావలి నియోజకవర్గాలకు మంచి చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. 

నాలుగేళ్లలో ఒక్క కరువు మండలమూ లేదు...
దేవుడి దయ వలన వరుసగా నాలుగో ఏడాది కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. రైతన్నల మొహంలో చిరునవ్వు కనిపిస్తోంది. మన రైతు మీద, రైతాంగం మీద, రాష్ట్ర ప్రజలమీద నాలుగు సంవత్సరాలుగా.. ఏ ఒక్క సంవత్సరం కూడా, ఏ ఒక్క మండలం కూడా కరవు మండలముగా ప్రకటించాల్సిన అవసరం లేకుండా, రాకుండా దేవుడి దయతో ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో కనిపిస్తోంది. 

ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీని, దీని తర్వాత నెల్లూరు బ్యారేజీని జాతికి అంకితం చేస్తున్నాం. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3.85 లక్షల ఎకరాలకు వరప్రదాయిని అయిన సంగం బ్యారేజీను ప్రాధాన్యతా ప్రాజెక్టుగా చేపట్టి, నిర్మాణంలో వేగం పెంచి పూర్తి చేయడంతో పాటు ఇవాళ జాతికి అంకితం చేశాం. 

ప్రతికూల పరిస్థితులున్నా ప్రాజెక్టు పూర్తి..
2019 జూన్‌లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు తిరగక ముందే కోవిడ్‌ సమస్య వచ్చింది. ఒకవైపు కరోనా సమస్య.. మరోవైపు పెన్నా నదిలో వరుసగా రెండేళ్ల పాటు వరదలు వచ్చాయి. అయినా కూడా అన్ని సమస్యలకు, ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి ప్రాజెక్టు పనులమీద దృష్టి పెట్టి కేవలం మూడేళ్లలో రూ.320 కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేయగలిగాం. 

ఈ ప్రాజెక్టుల చరిత్ర చూస్తే...
వీటికి సంబంధించిన పూర్వపు వివరాల్లోకి ఒక్కసారి వెళ్లాల్సిన అవసరం ఉంది. దాదాపు 140 సంవత్సరాల క్రితం బ్రిటీష్‌ వారి హయాంలో కట్టిన ఈ ఆనకట్ట కాలక్రమేణా శిధిలావస్ధకు చేరుకుంది. గతంలో ఎంత మంది ముఖ్యమంత్రులున్నా కూడా అప్పట్లో ఏ ఒక్కరూ కూడా ఈ ప్రాజెక్టు చేపట్టి, నెల్లూరు జిల్లాకు మంచి చేయాలన్న ఆలోచన ఏ ఒక్కరికీ రాలేదు.

దివంతనేత వైయస్సార్‌ హయాంలో మాత్రమే.... 
 దివంగత నేత,  ప్రియతమ నాయకుడు, మహానేత రాజశేఖర్‌రెడ్డి గారు(నాన్నగారు) ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ జిల్లాకు మోక్షం వచ్చింది. మళ్లీ యుద్ధప్రాతిపదికన పనులు పూర్తయ్యేందుకు అడుగులు ముందుకు పడ్డాయి. 

2006లో సంగం బ్యారేజ్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఆ పెద్దాయనకు కొడుకుగా, ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన ప్రాజెక్టు పనులను పూర్తి చేయగలిగానని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెపుతున్నాను. నాన్నగారి హయాంలో ప్రాజెక్టు పనులు మొదలు కాగా... 2009లో దివంగత నేత, నాన్నగారు మన మధ్య నుంచి దూరమయ్యారు. ఆ తర్వాత ఈ రెండు ప్రాజెక్టులను కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. 2006లో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి వేసిన అడుగులు మాత్రమే నిలిచాయి.
 

టీడీపీ హయాంలో మహుర్తాలు తప్ప పనుల్లేవు...
 మళ్లీ 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వ హయాంలో.. ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.30.85 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు. సంగం బ్యారేజీని 2017 నాటికి పూర్తి చేస్తామని ఒకసారి చెప్పారు. 2018 నాటికి పూర్తిచేస్తామని మరోసారి.. 2019 నాటికి పూర్తి చేస్తామని ఇంకోసారి చెప్పారు. ఇలా మహుర్తాలు మీద మహుర్తాలు పెట్టుకుంటూ, మార్చుకుంటూ పోయారే తప్ప... ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏరోజూ ఆలోచన చేయలేదు. వారు చేసిందల్లా ప్రాజెక్టులలో రేట్లు పెంచేయడం, ఎస్కలేషన్‌ ఇచ్చేయడం... ఆ తర్వాత కమిషన్లు దండుకోవడమే. చంద్రబాబు గారి హయంలో ఇటువంటి అడుగులు చూశాం. 

నాకు మిత్రుడు– ఆత్మీయుడు అయిన గౌతమ్‌ జ్ఞాపకార్ధం...
మనం వచ్చిన తర్వాత ఒకవైపు కోవిడ్‌ సమస్యలు, మరోవైపు  వరదల వంటి ప్రతికూల పరిస్థితులున్నా... మూడు సంవత్సరాలలోనే రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం. ఇలా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి స్నేహితుడు గౌతమ్‌ పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టాం. నాకు మిత్రుడు, మంచివాడు, అత్మీయుడు అయిన మేకపాటి గౌతం రెడ్డి నిజానికి ఈ రోజు ఇక్కడ మనందరి మధ్య ఈ ప్రాజెక్టు ప్రారంభించడానికి  ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సింది. హఠాన్మరణంతో మనందరికీ కూడా గౌతమ్‌ దూరమయ్యాడు. గౌతమ్‌ జ్ఞాపకార్ధం సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ అని పేరు పెడుతున్నాం. తద్వారా గౌతమ్‌ చిరస్ధాయిగా ఎప్పుడూ మన మనస్సులోనే ఉంటాడని చెప్పి నమ్ముతూ ఈ కార్యక్రమం చేస్తున్నాం.

 ఆ రోజు గౌతమ్‌ సంస్మరణ కార్యక్రమంలో చెప్పిన ఆ మాటను నిలుపుకుంటూ ఈ రోజు గౌతమ్‌ పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టడమే కాకుండా నిర్మాణం కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేసే భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

ఈబ్యారేజ్‌ వల్ల ఇప్పుడు పెన్నా డెల్టా కనిగిరి కాలువ కింది 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద మరో 63వేలు ఎకరాలు, కావలి కాలువ కింద మరో 75 వేల ఎకరాలు వెరసి.. 3.85 లక్షల ఆయుకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 

నెల్లూరు బ్యారేజీకి శ్రీకారం....
ఈ కార్యక్రమం తర్వాత... ఇక్కడ నుంచి నెల్లూరు బ్యారేజీ‌కు శ్రీకారం చుట్టేందుకు వెళ్తున్నాను. ఆ ప్రాజెక్టు కూడా ఇంతే. 150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆయుకట్టు శిధిలావస్థకు చేరింది. పట్టించుకునే నాధుడు లేక దాదాపు 1 లక్ష ఎకరాలకు నీరందించే ఆ ప్రాజెక్టు ఇప్పుడు నీరు అందించలేకపోయింది. అప్పట్లో ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర్‌రెడ్డి చొరవ చూపడం వల్ల మాత్రమే ప్రాజెక్టు అడుగులు ముందుకు పడ్డాయి. ఆనాడు రూ.147 కోట్లతో ప్రాజెక్టు వ్యయం అంచనా వేస్తే... ఆనాడు అప్పటికే రూ.86 కోట్లు ఖర్చు చేసి 
ప్రియతమ నేత రాజశేఖర్‌రెడ్డిగారు ప్రాజెక్టును పరుగులు తీయించగలిగారు.

ప్రియతమ నేత రాజశేఖర్‌రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రాజెక్టు మరలా నిర్లక్ష్యానికి గురైంది. అలాంటి పరిస్ధితుల మధ్యలో నుంచి మరలా ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసిన జాతికి అంకితం చేస్తున్నాం. 

ప్రాధాన్యతా క్రమంలో 26 సాగునీటి ప్రాజెక్టులు...
ఈ రోజు ఈ ప్రాజెక్టులు మాత్రమే కాదు.. దేవుడి దయతో ప్రతి సాగునీటి ప్రాజెక్టును కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయడానికి  అడుగులు ముందుకు వేస్తున్నాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు కూడా 26 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో తీసుకున్నాం. ఆ ప్రతి ప్రాజెక్టును కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తామని హామీ ఇస్తున్నాను. మంచి చేసే అవకాశం దేవుడి ఇవ్వాలని.. తద్వారా రైతన్నలకు ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

రూ.85 కోట్ల విలువైన పనులకు పచ్చజెండా...
కాసేపటి కిందట సోదరుడు, ఎమ్మెల్యే విక్రమ్‌ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించి.. కొన్ని సమస్యలు చెప్పారు. జాతీయ రహదారి నుంచి సంగం బ్యారేజ్‌కు నేరుగా రహదారి నిర్మాణానికి రూ.15 కోట్లు అవుతుందన్నారు. అది మంజూరు చేస్తున్నాను. నియోజకవర్గంలో 12 ఇరిగేషన్‌ పనులకు సంబంధించి అడిగారు. రూ.40 కోట్లు అంచనా కలిగిన వాటిని కూడా మంజూరు చేస్తున్నాం. నియోజకవర్గంలో రోడ్లు లేని ఊర్లు 25 ఉన్నాయన్నారు... వాటికి రహదారి నిర్మాణానికి అవసరమైన రూ.14 కోట్లు కూడా మంజూరు చేస్తున్నాం. ఆత్మకూరు మున్సిపాల్టీకి స్పెషల్‌ గ్రాంట్‌ కింద రూ.12 కోట్లు అడిగారు అవి కూడా మంజూరు చేస్తున్నాను. సంగం ప్రాజెక్టు నుంచి సంగం పంచాయతీకి నీటి సదుపాయం కోసం రూ.4 కోట్లు అడిగారు. వాటిని కూడా మంజూరు చేస్తున్నాం. మొత్తమ్మీద దాదాపు రూ.85 కోట్ల విలువైన ఈ పనులన్నింటికీ అనుమతులు మంజూరు చేస్తున్నాను. 

చివరిగా..
మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ.. మీ అందరి చల్లని దీవెనలతో మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని ఆశిస్తూ.. సెలవు తీసుకుంటున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top