'అగ్రిగోల్డ్‌' అసలు దొంగ చంద్రబాబే

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే సెబీ పర్మిషన్‌ లేకుండా అగ్రిగోల్డ్‌ ఏర్పాటు

ప్రజల నుంచి వేల కోట్లు వసూలు 

జగనన్న చెప్పినట్లే బాధితులకు సొమ్ము చెల్లిస్తున్నారు

హోం మంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు  : అగ్రిగోల్డ్‌ సంస్థ విషయంలో అసలు దొంగ చంద్రబాబునాయుడేనని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. లక్షలాదిమంది ప్రజలకు అగ్రిగోల్డ్‌ శాపంగా మారటానికి ప్రధాన కారకుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని చెప్పారు. ఆయన హయాంలోనే అగ్రిగోల్డ్‌ కనీసం సెబీ అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. గుంటూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అగ్రిగోల్డ్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకుని ప్రజలు, బాధితుల నెత్తిన శఠగోపం పెట్టారని పేర్కొన్నారు.

దేశ చరిత్రలో ఆర్థిక నేరాల ద్వారా మోసపోయిన ప్రజలను ఆదుకున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని చెప్పారు. అగ్రిగోల్డ్‌ ఏర్పాటు చేసి  ప్రజల నుంచి రూ. వేల కోట్లు వసూలు చేశారని, 2014 డిసెంబర్‌లో బోర్డు తిప్పేశారని తెలిపారు. అప్పుడు చంద్రబాబు బాధితులకు న్యాయం చేస్తానని చెప్పి అగ్రిగోల్డ్‌ ఆస్తులపై కన్నేసి డిపాజిట్‌దారులను నట్టేట ముంచాడన్నారు.

అగ్రిగోల్డ్‌తో కుమ్మక్కై విలువైన ఆస్తులను కాజేసి 2014 నుంచి 2019 వరకు బాధితులకు సొమ్ము చెల్లించకుండా తొక్కిపట్టి ప్రజలను మోసం చేశాడని చెప్పారు. 300 మంది ఏజెంట్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రజల కష్టాలను గమనించిన జగనన్న వారికి చెప్పినట్లే ఇప్పటికే రూ.10 వేలలోపు డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించారని, ఇప్పుడు రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులకు చెల్లిస్తున్నారని వివరించారు.  గుంటూరు ఏటీ అగ్రహారంలో ఒక యువతిపై కానిస్టేబుల్‌ అత్యాచారం చేసినట్లు లోకేశ్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.  

Back to Top