మత్స్యకార గ్రామాల్లో 144 సెక్షన్‌ ఎత్తివేత

రింగు వలల వివాదం పరిష్కారంపై సమావేశం

సముద్రంలో 8.కి.మీ తర్వాత రింగు వలలు వాడొచ్చు

మంత్రి సీదిరి అప్పలరాజు

  విశాఖపట్నం: మత్స్యకార గ్రామాల్లో రేపటి నుంచి 144 సెక్షన్‌ ఎత్తివేస్తున్నట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. రింగు వలల వివాదం పరిష్కారానికి మత్స్యకార సంఘాల నాయకులతో  ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కురసాల కన్నబాబు, సీదిరి అప్పలరాజు ఆదివారం చర్చలు జరిపారు.  సంప్రదాయ కారులు, రింగు వలల మత్స్యకార సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. ఈ నెల 20లోగా నివేదిక ఇవ్వాలని గడువు పెట్టామని తెలిపారు. రేపటి నుంచి సంప్రదాయ మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొచ్చాన్నారు.  సముద్రంలో 8 కి.మీ తర్వాత రింగు వలలు వాడొచ్చని పేర్కొన్నారు. అధికారులు, మత్స​కార సంఘాల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

 
ఇటీవల రింగు వలల వినియోగం విషయంపై సముద్రంలో మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ మేరకు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో మత్స్యకార సంఘం నాయకులతో భేటీ అయ్యారు. ఇరు వర్గాల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలను సేకరించారు. వీటిపై అధికారుల నుంచి కూడా వివరణ తీసుకున్నారు ఈ దశలో సాంప్రదాయ మత్స్యకారులు చేపల వేట కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు తేల్చారు.

అలాగే రింగు వలల వినియోగంపై లైసెన్స్ ఉన్న మత్స్యకారులు తీరం నుంచి 8 కిలో మీటర్ల దూరంలో చేపలవేట కొనసాగించవచ్చని కూడా అధికారులు నిర్ణయించారు అయితే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చేపలవేట సాగించినట్లయితే ఎలాంటి మత్స్య సంపద లభించదని రింగు వలల మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు గ్రామాలకు చెందిన మత్స్యకారులు నిర్ణీత ప్రాంతంలో చేపల వేట కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని అధికారులను మత్స్యకారులు కోరారు. అలాంటి అనుమతులు చట్టబద్ధంగా ఇవ్వడానికి అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పారు.

దీంతో ఇరు గ్రామాల పెద్దలు కొందరు అధికారులతో కలిసి కమిటీగా ఏర్పడి ఈ సమస్యను పరిష్కరించుకుంటామని  చెప్పారు. దీంతో ఈ నెల 20వ తేదీలోగా ఈ సమస్యపై గ్రామ పెద్దల మధ్య చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రులు సూచించగా.. ఇరు గ్రామాల ప్రజలు కూడా సమ్మతించారు మరోవైపు ఉద్రిక్తతల నడుమ కొనసాగిస్తున్న 144 సెక్షన్ కూడా ఎత్తి వేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ప్రకటించారు. మత్స్యకారులు సమన్వయంతో చేపల వేటను రేపటినుంచి కొనసాగించవచ్చని మంత్రులు ప్రకటించారు.

 

తాజా వీడియోలు

Back to Top