సీఎం నిర్ణయమే మాకు శిరోధార్యం

తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఎవ‌రిని నియమించినా సమష్టి కృషితో పనిచేస్తాం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో చిత్తూరు, నెల్లూరు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేత‌ల స‌మావేశం 

విజయవాడ: తిరుపతి పార్లమెంట్‌ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎవరిని ఎంపిక చేసినా.. గతం కంటే గొప్ప మెజార్టీ సాధించే దిశగా సమష్టి కృషితో పనిచేస్తామని చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు. తిరుపతి వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ అనారోగ్యంతో ఇటీవల మరణించడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడి ఉప ఎన్నిక వచ్చింది. దీంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల మంత్రులు, ఆయా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి పార్లమెంట్‌ అభ్యర్థి ఎంపికపై తమ సలహాలు, సూచనలు సీఎం వైయస్‌ జగన్‌కు అందజేశామని చెప్పారు. ఎవరి అభిప్రాయం వారు తెలియజేశామని, భిన్నాభిప్రాయాలు ఏమీ లేవని తెలిపారు. అంతిమ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తీసుకుంటారని, సీఎం ఏ అభ్యర్థిని ఖరారు చేసినా.. అంతా సమష్టి కృషితో మా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామన్నారు. గతం కంటే గొప్ప మెజార్టీ సాధిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని సీఎంకు మాటిచ్చామన్నారు. 

Back to Top