ప్ర‌తీ అడుగులోనూ పిల్ల‌ల‌కు మేన‌మామగా  తోడు ఉంటా

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

 కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దబోతున్నాం

విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు–నేడు 

 డబ్ల్యూహెచ్‌ఓ సూచనల ప్రకారమే బడులు తెరిచాం 

ప్రతీ సబ్జెక్ట్‌కూ, ప్రతీ క్లాస్‌కు ఒక టీచర్‌ ఉండేలా మార్పు

 ప్ర‌తి విద్యార్థికి బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్

విద్యా వ్యవస్థ ఆరు విభాగాలుగా మారబోతోంది

57 వేల బడులను మార్చబోతున్నాం

పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువే

మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

 తూర్పుగోదావరి:  ప్ర‌తీ అడుగులోనూ పిల్ల‌ల‌కు వారి మేనమామగా తోడు ఉంటాన‌నే భావ‌న తీసుకువ‌చ్చే విధంగా విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తెస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం కోసం మనబడి నాడు-నేడు కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టామ‌ని తెలిపారు. తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించామ‌ని చెప్పారు. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్‌ సోమవారం నాడు-నేడు తోలి ద‌శ‌లో పూర్తి అయిన పాఠ‌శాల‌ల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ విద్యార్థులకు అంకితం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ వేదికగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి ప్ర‌సంగించారు. 

 ‘‘ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టాం. నేడు మూడు కార్యక్రమాలు జరగనున్నాయి. మొదటిది ఈ రోజు నుంచి బడులు తెరుస్తున్నాం. రెండేళ్ల నుంచి విద్యార్థులు పాఠశాలకు దూరం అయ్యారు. కోవిడ్‌ తీవ్రత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బడులు మూసివేసిన పరిస్థితులు మనందరికి తెలిసిందే. మన పిల్లలు రెండేళ్లుగా పరీక్షలు కూడా రాయలేదు.  డబ్ల్యూహెచ్‌ఓ, ఐసీఎంఆర్‌ సూచనల మేరకు బడులు తెరిచాం. పిల్లల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న.. గ్రామ సచివాలయాలు యూనిట్‌గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించాం. కోవిడ్ ప్రొటోకాల్స్‌ పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించాం.  టీచర్లకు అందరికి టీకాలిచ్చాం’’ అని తెలిపారు. 

‘‘పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్ధులకు 'జగనన్న విద్యాకానుక' ఇస్తు‍న్నాం. దీనిలో భాగంగా 47.32 లక్షల మంది విద్యార్ధులకు 731.30 కోట్లతో 'జగనన్న విద్యాకానుక' ఇస్తున్నాం. విద్యాకానుకలో ఒకవైపు తెలుగు, మరో వైపు ఇంగ్లీష్ భాషల్లో ఉన్న బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, డిక్షనరీ ఇస్తున్నాం. ఐదో తరగతి వరకు విద్యార్థులకు అర్థమయ్యేలా బొమ్మలతో ఇంగ్లీష్‌ డిక్షనరీ ఇస్తున్నాం’’ అని తెలిపారు. 

‘‘నాడు-నేడుతో తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాలల అభివృద్ధి చేశాం. నేడు రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టాం. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నాం. నాడు-నేడు కింద స్కూళ్లలో ఫర్నిచర్, నీటివసతి, రక్షిత తాగునీరు, పెయింటింగ్స్‌..గ్రీన్‌ చాక్‌ బోర్డ్‌, ఇంగ్లీష్ ల్యాబ్‌, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, ప్రహరీ గోడ, వంటగది నాడు-నేడుతో ప్రతి స్కూల్‌లో ఇంగ్లీష్‌ ల్యాబ్‌ కూడా తీసుకొచ్చాం’’ అని  సీఎం వైయ‌స్ జగన్ తెలిపారు. 
  
 ఒక్కో సెక్షన్‌లో 20 మంది కంటే ఎక్కువగా ఉంటే రోజు మరిచి రోజు క్లాస్‌లు జరుగుతాయి. టీచర్లందరికీ టీకా వేయించాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ..వివరంగా గైడ్‌లైన్‌ ఇచ్చాం. బడులైనా, పరీక్షలైనా, విద్యా వ్యవస్థలో మార్పులైనా, సీబీఎస్‌ఈ, ఇంగ్లీష్‌ మీడియం, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెనతో నేరుగా తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేయడం అన్న నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రతి ఒక్కరి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని  తీసుకుంటున్నాం. రేపు పోటీ ప్రపంచంలో నిలబడే విధంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. కుటుంబాల రూపురేఖలు మారాలనే తపన, తాపత్రయంతో చదువులపై ఇంతగా శ్రద్ధ పెడుతున్నాం.

జగనన్న విద్యా కానుక కార్యక్రమం
2021 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నాం. చదివిస్తున్న అక్క చెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా, పిల్లలకు మేనమామగా..ప్రతి పాపకు కూడా మంచి స్కూల్‌ బ్యాగ్, బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌, డిక్షనరీ కూడా ఇస్తున్నాం. 5వ తరగతి వరకు చదివి పిల్లలకు డిక్షనరీలో బొమ్మలు కూడా పెట్టించాం. 6 నుంచి 10వ తరగతి వరకు డిక్షనరీలోసైజ్‌ పెంచాం. పిల్లలందరికీ కూడా బెల్ట్, బూట్లు, మూడు జతల యూనిఫాం, టై అన్ని కూడా ఒక కిట్‌గా ప్రతి ఒక్క పిల్లాడికి ఇస్తున్నాం.
జగనన్న విద్యా కానుక ద్వారా రెండేళ్లలో అక్షరాల రూ.1380 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ఏడాది ఇచ్చే 42,32 లక్షల మందికి జగనన్న కిట్లు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా నాణ్యతతో కూడినవిగా ఉన్నాయి. ఎక్కడా కూడా రాజీ పడలేదు. బ్యాగ్‌లు మోసే సమయంలో కుషన్‌ కూడా ఉండాలని ఈ ఏడాది వాటిని కూడా పెట్టించాం. కారణం ఏంటంటే..ఇది మన పిల్లలకు ఒక మేనమామగా ఇచ్చే కానుక కాబట్టి శ్రద్ధ పెట్టాం.

మన బడి నాడు–నేడు
నిన్నటితో మొదటి దశ  15,715 పాఠశాలల అభివృద్ధి చేశాం ..ఇవాళ రెండో దశకు శ్రీకారం చుడుతున్నాం. ప్రభుత్వ బడులన్నీ కూడా రూపురేఖలు మార్చుతున్నాం. బడులు, హాస్టళ్లలో ఆధునీకరణ పనులు చేపట్టి కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాల్లలో 1 0 మార్పులు తీసుకు వచ్చాం. కొత్త పర్నిచర్, మంచినీటి సదుపాయం, మినరల్‌ వాటర్‌ప్లాంట్, మంచి టాయిలెట్స్‌ కూడా ఏర్పాటు చేస్తున్నాం.  రన్నింగ్‌వాటర్‌ ఖచ్చితంగా ఉండేలా చర్యలు, మంచి పెయింట్స్‌ వేయించడం, కంపౌండ్‌వాల్, ఇతర మరమ్మతులు, అదనపు తరగతి గ దులు, గ్రీన్‌ చాక్‌బోర్డులు, కరెంట్, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, గోరుముద్ద కోసం మంచి కిచెన్‌ ఏర్పాటు చేశాం. ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌కు ఒక ల్యాబ్‌ కూడా ఏర్పాటు చేశాం. అక్కడ టీవీలు ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్‌వాడీలను కూడా మనబడి  నాడు–నేడు కిందకు తీసుకువచ్చాం. ఇందుకోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని సగర్వంగా చెబుతున్నాను. 

ఆరు ర‌కాలుగా స్కూల్స్‌..

 నూతన విద్యా విధానంలో స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరించాం. ఈ విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటారు. 
‌శాటిలైట్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2) 
ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2. 1, 2)
ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ)
ప్రీ హైస్కూల్స్‌ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ)
హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకూ)
హైస్కూల్‌ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ) వర్గీకరించామని  సీఎం వైయ‌స్ జగన్‌కు వివరించారు. పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ వర్గీకరణ వల్ల సుమారుగా ఇప్పుడున్న స్కూల్స్‌  44వేల నుంచి సుమారు 58వేల స్కూల్స్‌ అవుతాయని   సీఎం వైయ‌స్ జగన్‌ తెలిపారు.
 దీనివల్ల జరిగే మేలు ఏమిటంటే..ఎఫ్‌సీఆర్‌ ఈ మధ్య కాలంలో సర్వే చేసింది. 3వ తరగతి పిల్లాడికి రెండో తరగతి పుస్తకం ఇచ్చి చదవమంటే కేవలం 20 శాతం మంది మాత్రమే రెండో తరగతి పుస్తకం చదివారు. ఇలాంటి దారుణమైన చదువుల పరిస్థితిని మార్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. 1 నుంచి 5వ తరగతి వరకు 18 సబ్జెట్లు ఉంటే ఒకే టీచరే ప్రతి క్లాస్‌కు చెబుతున్నారు. అన్ని సబ్జెట్లు ఒకే టీచర్‌ చెప్పడంతో పిల్లలకు ఫోకస్‌ రావడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దుతూ..ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచర్‌ ఉండేలా, ప్రతి క్లాస్‌కు ఒక టీచర్‌ ఉండేలా స్కూళ్లను మార్పు చేస్తున్నాం.

 ఈ పిల్లలందరికీ రెండేళ్లుగా మనం చేస్తున్న అమ్మ ఒడి, గోరుముద్ద, నాడు–నేడు అన్నికార్యక్రమాల వల్ల జరిగిన మంచి ఏంటంటే..1 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లల సంఖ్య ఎంత అంటే గత రెండేళ్ల క్రితం 2018–2019తో పోలిస్తే 70.43 లక్షల మంది చదువుతుంటే,,ఆ సంఖ్య 75.65లక్షలకు చేరింది. కోవిడ్‌ ఉన్నా కూడా ఆ సంఖ్య పెరిగింది. ప్రభుత్వ బడులను తీసుకుంటే..37.20 లక్షల మంది మాత్రమే ఉండేవారు. ఈ రోజు 43.43 లక్షల మంది చదువుతున్నారు. మన ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యల వల్ల ప్రతి తల్లిలోనూ, ప్రతి బిడ్డలోనూ ఆత్మ విశ్వాసం కనిపిస్తోంది.  ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి.  

ప్రతి ఒక్కరికీ కూడా విద్యా దీవెన, వసతి దీవెన తీసుకువచ్చాం. అన్ని పథకాలు ఒక్కసారి గమనిస్తే..జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా రూ.13 వేల కోట్లు ఇవ్వగలిగాం. విద్యా దీవెన వల్ల రూ. 5573 కోట్లు, వసతి దీవెన నుంచి 2269 కోట్లు ఇవ్వగలిగాం. గోరుముద్ద ద్వారా 35 లక్షల మందికి రూ.3200 కోట్లు ఖర్చు చేశాం. మన బడి నాడు–నేడు మొదటి దశకు రూ.3600 కోట్లు ఖర్చు చేశాం. సంపూర్ల పోషణకు రూ.3400 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నాను. అక్షరాల రూ.32302 కోట్లు ఈ పథకాలకు ఖర్చు చేశానని సగర్వంగా చెబుతున్నాను. పిల్లలు బాగా చదవాలి. వారికి ఇవ్వగలిగే ఆస్తి ఒక్క చదువే. చదువు ఉంటే వాళ్ల కాళ్లపై వారు నిలబడుతారు. పిల్లల భవిష్యత్‌మారాలని, పేదరికంలో ఉన్న పిల్లలు ఆ పేదరికాన్ని దాటాలని మనసారా కోరుకుంటూ..ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ..ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, పిల్లలను చదివించేందుకు కష్టం రాకూడదని, దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు కావాలని మనసారా కోరుకుంటూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సెలవు తీసుకున్నారు.  

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top