విజయవాడ: మహిళలను వేధించే వారికి మహిళా కమిషన్ సుప్రీమే అని, బోండా ఉమా లాంటి గూండాలకు మహిళా కమిషన్ సుప్రీమే అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి బాధితురాలిని పరామర్శించడానికి వచ్చారా..?. లేక రాజకీయం చేయడానికి వచ్చారా అని చంద్రబాబు, బోండా ఉమాలను ప్రశ్నించారు. బాధితురాలికి భరోసా ఇవ్వడానికి వచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను బెదిరిస్తారా..? అత్యాచార బాధితురాలి గదిలో కేకలు వేస్తారా..? మహిళా కమిషన్ చైర్ పర్సన్‌తో ప్రవర్తించే తీరు ఇదేనా అని ధ్వజమెత్తారు. 27వ తేదీన కమిషన్ ముందుకువచ్చి సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన పనికి సమన్లు ఇవ్వక..చప్పట్లు కొడతారా అని నిలదీశారు. విజయవాడలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ అంటే తూతూమంత్రంగా నడిపారు. ఇప్పుడు మహిళా కమిషన్ డమ్మీ కాదు.. మహిళా కమిషన్ అత్యంత శక్తివంతమైనది. ఈ నెల 27 ఉ.11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమా స్వయంగా వచ్చి సమాధానం చెప్పాలి. మహిళా కమిషన్‌పై బోండా ఉమా ఆరోపణలు చేస్తున్నాడు. మహిళా కమిషన్ సుప్రీమా? అని అడుగుతున్నాడు అవును, కమిషన్ నీలాంటి ఆకు రౌడీలకు సుప్రీమే. మహిళలని వేధించే వారికి కమిషన్ సుప్రీమే. ఇలాంటి నేరాలు ఎవరూ చేసిన క్షమించేది లేదు. బాధితురాలితో ఎలా వ్యవహరించాలో చంద్రబాబుకు తెలియదని నిన్ననే అర్దమైంది. యుద్దానికి వెళ్తున్నట్టు పెద్ద సంఖ్యలో వచ్చారు. మనసు, శరీరం గాయం అయిన యువతితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. అత్యాచార బాధితురాలితో ఎలా మాట్లాడాలో తెలియదా?. అలాంటి వారికి సమన్లు ఇచ్చే అధికారం మహిళా కమిషన్‌కు ఉంది. గతంలో చాలా కేసుల్లో పోలీసు అధికారులకు కూడా ఇచ్చాం. వారానికి యాభై, అరవై సమన్లు ఇస్తున్నాం. కోట్లాది మంది మహిళలకు నేను బాధ్యురాలిని. నా హక్కులు నాకు ఉన్నాయి. నేను రాజకీయ నాయకురాలినైతే అప్పుడు వేరేగా ఉండేది. 27న చంద్రబాబు, బోండా ఉమా కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందే. లొసుగులతో బయట పడేలా ప్లాన్ చేస్తున్నారు. న్యాయవాదులతో మాట్లాడుతున్నారట. అసలు బాధితురాలి దగ్గర బల ప్రదర్శన చేయటం ఏంటి? నామీద సవాల్ చేయటం ఏంటి? ఆ ఘటనని రాజకీయం చేయడం తప్ప వారిలో సానుభూతి ఏదీ?. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కూడా అత్యాచార బాధితురాలిని పరామర్శించలేదు చంద్రబాబు. అలాంటి వ్యక్తి నిన్న ఆస్పత్రిలో రచ్చరచ్చ చేశారు. సమన్లు ఎందుకు ఇచ్చామో చాలా స్పష్టంగా చెప్పాం. కచ్చితంగా వారిద్దరినీ కమిషన్ ఎదుట హాజరయ్యేలా చేస్తాం. వారిష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కమిషన్ తల వంచుకోవాలా?. కమిషన్ సమన్లు ఇచ్చిందంటే చచ్చినట్టు హాజరవ్వాల్సిందే. చేసిన తప్పును తెలుసుకుని క్షమించమని అడగాల్సిందిపోయి ఎదురుదాడి చేస్తున్నారు. మీరా మహిళలకు న్యాయం చేసేది?. బాధితురాలి కుటుంబాన్ని సీఎం వైయస్ జగన్ కలిసేలా కమిషన్ చూస్తుంది. అసలు ఏ అత్యాచార ఘటన దగ్గరకు చంద్రబాబు వెళ్లారు?. రిషితేశ్వరి కేసులో ఆర్నెళ్లు ఏం చేశారని లోకేష్ తన తండ్రిని అడగాలి. వనజాక్షి కేసులో ఏం చేయలేకపోయారెందుకని కూడా తన తండ్రిని అడగాలి అంటూ కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ లోకేష్‌కు సూచించారు.