అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్ధానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, భారీ కేక్‌కట్ చేశారు. అనంతరం పేదలకు వస్త్రాల పంపిణీ చేశారు. విశాఖలో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున చేపట్టారు.