తాడేపల్లి: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై నాలుగుపేజీలతో కూడిన నివేదికను హైపర్ కమిటీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేసింది. ప్రమాదానికి గల కారణాలు, నిబంధనలను ఈ నివేదికలో కమిటీ పేర్కొంది.ఎం6 ట్యాంకులో స్టైరిన్ నియంత్రించలేనంతగా ఆవిరైంది. ఎంఎస్ఐహెచ్‌సీ నిబంధనల ప్రకారం ఇది చాలా పెద్ద ప్రమాదం.స్టైరిన్ ఆవిరి కావడంతో ట్యాంకులో ఉష్ణోగ్రతలు పెరిగాయి.ఒక దశలో ట్యాంకు ఒత్తిడి తట్టుకోలేక ఆవిరిని బయటకు పంపింది. కూలింగ్ సిస్టమ్, రిఫ్రిజిరేషన్‌లో చాలా లోపాలు ఉన్నాయి. రక్షణ చర్యలు, వాటిపై అవగాహన, ఫ్యాక్టరీ నిపుణులకు లేదు. ఫ్యాక్టరీ ఉద్యోగులకు కూలింగ్ సిస్టమ్‌పై అవగాహన లేదు. ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఒక కారణమని కమిటీ విచారణలో తేలింది. లాక్‌డౌన్ చేసినప్పుడు ఫ్యాక్టరీలో ప్రోటోకాల్ పాటించలేదని, 36 చోట్ల అలారం వ్యవస్థ ఉంది. అయినా దాన్ని వాడలేదు. ఒకవేళ ఫ్యాక్టరీలో అలారం మోగి ఉంటే ప్రజలు జాగ్రత్త పడేవారు. గ్యాస్‌ను నిర్వీర్యం చేసే వ్యవస్థ గాని, నిల్వలు గానీ ఫ్యాక్టరీలో లేవని కమిటీ తేల్చింది. విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్‌ఆర్ వెంకటాపురం గ్రామంలోని బహుళజాతి కంపెనీ ఎల్‌జీ పాలిమర్స్‌లో మే 7 వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకై 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ వారాంత ప్రభుత్వ సహాయంతో చికిత్స పొంది కోలుకున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి బాధితులను ఆదుకుంది.