ఉరవకొండ: అన్నమయ్య జిల్లా మాధవవరం గ్రామంలో చేనేత కార్మికుడు సుబ్బారావు తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అన్యాయం, మోసం కారణంగానే జరిగిందని వైయస్ఆర్‌సీపీ చేనేత విభాగం నాయకులు స్పష్టం చేశారు. ఈ ఆత్మహత్యల ఘటన తమను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. మాధవవరం గ్రామంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యపై ఉరవకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో ఉరవకొండవైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆ విభాగం నేతలు చందా చంద్రమ్మ, చంగల మహేష్, ఎంసి నాగభూషణం, మిడతలు చంద్రమౌళీ, కొత్తపల్లి హరి, గట్టు ఎర్రిస్వామి, నిమ్మల వెంకటరమణ తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ నాయకుల దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఒంటిమిట్ట మండలం మాధవవరం గ్రామంలో చేనేత కార్మికుల కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. 2015 లో సుబ్బారావు 3 ఎకరాల పొలం కొన్నారని అప్పటి టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడి ఆ భూమిని వేరే వ్యక్తుల పేరు మీద ఆన్లైన్ లో ఎక్కించారని వెల్లడించారు. ఇటీవల కాలంలో ఆ పొలాన్ని అమ్మలని ఆయన ప్రయత్నాలు చేసారు. అయితే 2017 లోనే అది ఆన్లైన్ లో ఇతరుల పేరు మీద నమోదు కావడంతో భూమి అమ్ముడు పోలేదని చెప్పారు. ఒకవైపు టీడీపీ నేతలకు కొమ్ము కాసిన కొందరు అధికారుల అవినీతి, మరోవైపు భూ వివాదం కారణంగా సుబ్బారావు మనస్తాపానికి గురై తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. కానీ టీడీపీ నాయకులకు ఇవేవీ పట్టనట్లు అసలు నిజాలు తెలుసుకోకుండా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పై బురద జల్లుతున్నారని విమర్శించారు. కేవలం వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బారావు కుటుంబాన్ని తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఇప్పటికే పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మి విరాళాల ద్వారా సేకరించిన రూ.4 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. టీడీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకుని వీలైతే ఆ కుటుంబానికి సాయం అందించాలని రాజకీయ స్వార్థం కోసం ఎవరూ రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వేల్పుల వాసుదేవుడు, సాధు వెంకటస్వామి, బీరే శివ,కాసుల అంజి, అరె రాజా, కామర్తి ఎర్రిస్వామి, అమర్నాథ్, గిరెప్ప, పుల్లా బొజ్జన్న, శంకర, బాలాజీ, కరూర్ వెంకటేష్, రామన్న తదితరులు పాల్గొన్నారు.