చంద్ర‌బాబు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కారదర్శి లక్ష్మీపార్వతి 

హైదరాబాద్‌:  నారా లోకేష్‌ను అదుపులో పెట్టకపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కారదర్శి లక్ష్మీపార్వతి తెలిపారు.

నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్‌పై వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కారదర్శి నందమూరి లక్ష్మీపార్వతి స్పందించారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘అనారోగ్యంతో బాధ పడుతున్న పోసానిని ఇబ్బంది పెడుతున్నారు. తనకు వచ్చిన అవార్డును పోసాని తిరస్కరించారు. ఆయన అవార్డు తిరస్కరించారని కక్ష గట్టి కేసులు పెట్టారు. నారా లోకేష్‌ను అదుపులో పెట్టకపోతే రానున్న కాలంలో చంద్రబాబుకు కష్టాలు తప్పవు. మీరంతా రాక్షస జాతిలో పుట్టారా?. పురాణాల్లో చదువుకున్నాం. ఇప్పుడు చూస్తున్నాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోసానికి అస్వస్థత..
ఇదిలా ఉండగా.. పోసాని కృష్ణమురళిని అక్రమ కేసులో ఇరికించి, అరెస్టు చేయడమే కాకుండా, ఆయన ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం కుట్రపూరితంగానే వ్యవహరించింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోసాని మురళిని గురువారం రాత్రి కోర్టులో హాజరుపరిచి, శుక్రవారం రాజంపేట సబ్‌జైలుకు తీసుకెళ్లారు. అక్కడ విరే­చనాలు అయినట్లు కుటుంబ సభ్యులకు పోసాని తెలిపారు. శనివారం గుండెల్లో, కడుపులో నొప్పిగా ఉందని చెప్ప­డంతో ముందుగా అక్కడి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమికంగా పరీక్షలు చేయించి, వైద్యుల సూచన మేరకు కడపలోని రిమ్స్‌కు తరలించారు. ఇక్కడ కూడా ఆయన పట్ల ప్రభుత్వం, పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. గుండెల్లో, కడుపు నొప్పితో బాధపడుతున్నా అంబులెన్సులో కాకుండా పోలీసు వాహనంలోనే తీసుకెళ్లడం క్రూరత్వమే.

పైగా, ఆయనది అనారోగ్యం కాదని, నటన అంటూ రైల్వే కోడూరు రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు రిమ్స్‌ ఆవరణలోనే మీడియాతో మాట్లాడుతూ చెప్పడం అందరినీ విస్మయపరిచింది. 67 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ ప్రముఖుడు, సీనియ­ర్‌ సిటిజన్‌ పట్ల ఓ సీఐ ఇంత దారుణంగా మా­ట్లాడటం ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు. ఇదే తరుణంలో పోసా­నికి ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిదంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 

Back to Top