కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు 

ఎమ్మార్పీకి మించి విక్రయించడానికి వీల్లేదు 

  మంత్రి కన్నబాబు

విజ‌య‌వాడ‌: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలో డీఏపీతో సహా ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్‌బీకేల్లో కూడా చాలినంత ఎరువు నిల్వలున్నాయని చెప్పారు. ప్రస్తుత సీజన్‌కు 20.20 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, 6.71 లక్షల ప్రారంభ నిల్వలున్నాయని, కేంద్రం ఇప్పటి వరకు 10.22 లక్షల టన్నులు సరఫరా చేసిందన్నారు. ఇప్పటి వరకు 8,19,089 టన్నుల విక్రయాలు జరగ్గా ప్రçస్తుతం రాష్ట్రంలో 8,73,591 టన్నుల నిల్వలున్నాయన్నారు. ఆర్‌బీకేల్లో 1,60,311 టన్నుల నిల్వలుంచగా, ఇప్పటి వరకు 64,795 టన్నుల విక్రయాలు జరిగాయన్నారు. ఇంకా 62,491 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 

సమృద్ధిగా డీఏపీ నిల్వలు 
తూర్పు గోదావరితో పాటు పలు చోట్ల డీఏపీ కొరత సృష్టించి కొంతమంది వ్యాపారులు ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరుపుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. సీజన్‌లో డీఏపీ 2,49,999 టన్నులు అవసరం కాగా, ప్రారంభ నిల్వ 42,589 టన్నులుండగా, కేంద్రం ఇప్పటివరకు 1,29,185 టన్నులు రాష్ట్రానికి సరఫరా చేసిందన్నారు. ఇప్పటి వరకు 93,195 టన్నులు అమ్మకం జరగ్గా, ఇంకా 78,579 టన్నులు నిల్వలున్నాయని చెప్పారు. ఆగస్టుకు సంబంధించి 63,320 టన్నులు అవసరం కాగా, ఇప్పటికే కేంద్రం 63,450 టన్నులు కేటాయించిందన్నారు. డీఏపీ 50 కేజీల బస్తా రూ.1200 మించి విక్రయించడానికి వీల్లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఒక్క డీలర్‌ అయినా ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని, అవసరమైతే వారి లైసెన్సులు రద్దు చేయిస్తామన్నారు.   

Back to Top