మొబైల్‌ రైతు బజార్లు ప్రారంభం

 కాకినాడ : రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్‌ రైతు బజార్లను పెద్ద ఎత్తున పెంచాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్‌లో మంత్రి కన్నబాబు గురువారం మొబైల్‌ రైతు బజార్లను జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా వార్డులు,కాలనీల్లో మొబైల్‌ రైతు బజార్లు తిరుగుతాయన్నారు. ఒక్కొక్క రైతు బజారును ఐదు రైతు బజార్లుగా వికేంద్రీకరిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చొరవ తీసుకొని వ్యాపారులతో మాట్లాడి ధరలు అధికంగా లేకుండా మొబైల్‌ బజార్లు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఉదయం వేళ తోపుడు బళ్ల ద్వారా పండ్లు, కూరగాయలు విక్రయించేలా అనుమతివ్వాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే నిత్యవసరాల వస్తువులకు కొరత రాకుండా చూడాలంటూ సీఎం ఆదేశించారు. అనవసరంగా ధరలు పెంచాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా అరటిని కొనుగోలు చేస్తున్నామని , నిల్వ ఉంచలేని పండ్లు, కూరగాయలకు మార్కెట్‌ క్రియేట్‌ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులకు తమ పంటలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు వస్తే సంబంధిత అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తే పరిష్కారం చూపిస్తారని కన్నబాబు తెలిపారు. 
 

Back to Top