ధరల నియంత్రణ కోసం ప్రత్యేక సెల్‌ 

రైతుల సంక్షేమం కోసం ప్రతి నెల నిపుణులతో సీఎం జగన్‌ చర్చిస్తున్నారు 

చిరు ధాన్యాల సాగుకు ప్రోత్సాహం

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు 

అమరావతి : మార్కెట్లపై నిరంతరం నిఘా ఉంచి ధరల నియంత్రణ కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమం కోసం ప్రతి నెల వ్యవసాయ నిపుణులతో చర్చిస్తున్నారని  స్పష్టం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ వ్యవసాయ మిషన్ మూడో సమావేశం నిర్వహించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  సరుగుడు, జాం ఆయిల్ రైతులకు సాయం చేసే అంశంపై చర్చ జరగాలని ముఖ్యమంత్రి కోరినట్లు వెల్లడించారు. చిరు ధాన్యాల సాగుకు ప్రోత్సాహం చేపట్టాలని, దాని కోసం మిల్లెట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. రైతు ఏ దశలోనూ నష్టపోకుండా ఉండేదుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో చంద్రబాబు 2000 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలు పెట్టాడని, ఇప్పుడు వాటిని విడుదల చేసేందుకు చర్యలు చెపడుతున్నామని కన్నబాబు తెలిపారు. 

టమాట విస్తీర్ణం తగ్గిందని, అంతేగాక ధర విషయంలోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయన్నారు. కావున వీటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, దానికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ తెలిపారని మంత్రి అన్నారు. ధర పడిపోయినప్పుడు స్పందించడం కంటే ముందు చూపుతో రైతును ఆదుకునే దిశగా ప్రయత్నం చేయాలని, ఇప్పటికే ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్లు ఉందని స్పష్టం చేశారు. మినుములు, పెసలు, కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ముందుగానే చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. 

వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ మిషన్ మూడో సమావేశం సీఎం జగన్ నిర్వహించారని, రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలన్నదే ఈ సమావేశ ప్రధాన లక్ష్యమని తెలిపారు. టమాట పంట దిగుబడి ఉన్నా.. రైతులు మార్కెటింగ్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో రైతు భరోసా పధకం అమలు చేయాలని, దాని కోసం అర్హులైన రైతులు నష్ట పోకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. రైతు భరోసా విషయంలో ఎవరనీ ఇబ్బంది పెట్టొద్దని, కౌలుదారులకు భరోసా ఇచ్చేందుకు కృష్ణా డెల్టా ఆధునికీకరణపై చర్చ జరిగిందని తెలిపారు. 

Back to Top