క్రీడాకారులకు వరాల జల్లు

ప్రోత్సాహకాలు ప్రకటించిన సీఎం వైయస్‌ జగన్‌

29 నుంచి వారం రోజుల పాటు కార్యక్రమాలు సాగించాలని ఆదేశం

అమరావతి: సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రీడాకారులకు వరాల జల్లు కురిపించారు. గతంలో ఎవరూ క్రీడల గురించి, క్రీడాకారుల గురించి పట్టించుకోలేదని వారికి ప్రోత్సాహకం అందిస్తేనే మెరుగ్గా రాణించగలుగుతారని సీఎం అభిప్రాయపడ్డారు. దిగువస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత జాతీయస్థాయిలో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకం అందించేలా నిర్ణయం తీసుకున్నారు. బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు రూ. 5 లక్షలు, రజతం సాధించిన వారికి రూ. 4 లక్షలు, కాంస్యం సాధించిన క్రీడాకారులకు రూ. 3 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. జూనియర్, సబ్‌ జూనియర్‌ స్థాయి క్రీడాకారులను గుర్తించాలని, ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో స్వర్ణం సాధించిన వారికి రూ. 1.25 లక్షలు, రజతం వచ్చిన వారికి రూ. 75 వేలు, కాంస్యం వచ్చిన వారికి రూ. 50 వేల ప్రోత్సాహకం ఇస్తేనే వీళ్లంతా పీవీ సింధులా మారుతారని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవం నుంచి ఈ కార్యక్రమాలు వారం రోజుల పాటు కొనసాగాలని వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను ఆదేశించారు.

Back to Top