సచివాలయం: దేవాదాయశాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజల చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. మంత్రి సత్యనారాయణకు పలువురు అధికారులు అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని, ప్రస్తుతం దేవాలయాల్లో కొనసాగిస్తున్న సేవల కన్నా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అధికారులతో సమీక్షించి వారి సలహాలతో ముందుకెళ్తానని, ప్రసాద్ స్కీమ్‌లో అన్ని ప్రముఖ దేవాలయాలని అభివృద్ధి చేస్తామన్నారు. చారిత్రాత్మకమైన ఆలయాలు ఏపీలో చాలా ఉన్నాయని, టెంపుల్ టూరిజంపై దృష్టిసారించాల్సి ఉందన్నారు. ప్రత్యేకయాప్ తయారు చేసి టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. వీఐపీల కోసమే ఆలయాలు లేవని, భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తామని వివరించారు.
ప్రోటోకాల్ ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి సత్యనారాయణ అన్నారు. కొన్ని ఆలయాలకి సిబ్బంది కొరత అధిగమించడానికి అదనపు సిబ్బందిని తీసుకోవడానికి సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆలయాలలో ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆలయాల ఆస్తులు, రికార్డులు డిజిటలైజేషన్ చేయాలని, భగవంతుడు ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.