డిప్యూటీ స్పీక‌ర్‌గా కోన ర‌ఘుప‌తి ఎన్నిక‌

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి కోన ర‌ఘుప‌తి నామినేషన్‌ దాఖలు చేయ‌గా, ఆయ‌న‌ను ప్ర‌తిపాదిస్తూ 10 మంది ఎమ్మెల్యేలు సంత‌కాలు చేయ‌డం, ఒకే నామినేష‌న్ దాఖ‌లు కావ‌డంతో కోన ర‌ఘుప‌తిని ఉపసభాపతి ఎన్నికైన‌ట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్ర‌క‌టించారు. కోన ర‌ఘుప‌తిని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందిస్తూ గౌర‌వ‌పూర్వ‌కంగా స‌భాప‌తి కుర్చీ వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. అనంత‌రం ప‌లువురు స‌భ్యులు కోన ర‌ఘుప‌తికి అభినంద‌న‌లు తెలిపారు.  కోన రఘుపతి గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019లో రెండు సార్లు వైయ‌స్ఆర్‌సీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకర్‌రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు స్పీకర్‌గా సేవలు అందించారు. 1981 ఫిబ్రవరి 24 నుంచి 1981 సెప్టెంబర్ 22 వరకు ఆయన ఏపీ స్పీకర్‌గా విధులు నిర్వర్తించారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన సిక్కిం, మహారాష్ట్రలకు గవర్నర్ కూడా పనిచేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top