దివ్యాంగులపై వేధింపులు ఆపాలి

వైయస్ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్‌రాజ్ 

సదరం క్యాంపుల వద్ద కనీస వసతులు కరువు

రోజంతా టెంట్‌ కింద దివ్యాంగులు మగ్గిపోతున్నారు

దివ్యాంగుల ఆత్మగౌరవం కాపాడతానన్న పవన్‌ స్పందించాలి  

ప్రెస్‌మీట్‌లో కిరణ్‌రాజ్‌ స్పష్టీకరణ

తాడేపల్లి: దివ్యాంగుల పింఛన్లు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నేతలు ఒక్క కొత్త పింఛన్‌ కూడా ఇవ్వకపోగా, సదరం సర్టిఫికెట్స్‌ పేరుతో వారిని వేధించడంతో పాటు, ఉన్న పెన్షన్లు కూడా పీకేసే కుట్రకు తెర తీశారని వైయస్ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్‌రాజ్‌ ఆక్షేపించారు. ప్రభుత్వం వెంటనే ఆ కుట్ర యోచన విరమించాలని ఆయన డిమాండ్‌ చేశారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా చూస్తానని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.. ప్రభుత్వం నిర్వహిస్తున్న సదరం క్యాంపుల వద్ద కనీస వసతులు కల్పించకుండా వేధిస్తున్నా ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. అర్హులైన లబ్ధిదారుల పింఛన్లు తొలగిస్తే తమ పార్టీ చూస్తూ ఊర్కోదని, వారికి అండగా ఉంటుందని కిరణ్‌రాజ్‌ స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కిర‌ణ్‌రాజ్ మీడియాతో మాట్లాడారు.

ఒక్క కొత్త పింఛ‌న్ కూడా ఇవ్వ‌లేదు:
– కూటమి ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8.20 లక్షల మంది దివ్యాంగులు, వారి కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి.  
– అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల పింఛన్‌ రూ.6 వేలు, రూ.15 వేలకు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన కూటమి పార్టీలు దాన్ని అమలు చేయకపోగా పింఛన్లు తొలగించే కార్యక్రమానికి ప్రభుత్వం తెర తీసింది. 
– అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో ఒక్క దివ్యాంగునికి కూడా కొత్త పింఛన్‌ ఇవ్వకపోగా సదరం సర్టిఫికెట్ల పేరుతో పింఛన్లు పీకేయాలని చూస్తున్నారు.
– 20 ఏళ్లుగా వైకల్యంతో బాధ పడుతున్న దివ్యాంగులను సైతం వైకల్య ధృవీకరణ పత్రాలు సరిగా లేవని కొత్తగా సదరం సర్టిఫికెట్స్‌ తీసుకోవాలని వేధిస్తున్నారు. పుట్టుకతోనే కళ్లు లేని వారిని కూడా సర్టిఫికెట్స్‌ అడుగుతున్న దౌర్భాగ్య పరిస్థితి కూటమి పాలనలో కనిపిస్తోంది. 
– వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2016 వికలాంగుల హక్కుల చట్టం తీసుకొచ్చిన వైఎస్‌ జగన్‌.. దివ్యాంగులకు ప్రత్యేకమైన హక్కులు కల్పించడం జరిగింది. అలాంటిది వైఎస్సార్సీపీ హయాంలో అనర్హులకు దివ్యాంగుల పేరుతో పింఛన్లు ఇచ్చారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.  
– వ్యవస్థలో జరిగిన చిన్నచిన్న పొరపాట్లను సాకుగా చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగ సమాజాన్ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
– 2010 నుంచి  మాత్రమే సదరం ద్వారా వైకల్య ధ్రువీకరణ పత్రాలు అందించడం జరుగుతోంది. అంతకన్నా ముందు నుంచే పింఛన్లు పొందుతున్న వారు చాలా మంది ధ్రువీకరణ పత్రాలు లేకుండానే పింఛన్లు పొందుతున్నారు. ఇప్పుడు వారి సంగతి వర్ణణాతీతంగా ఉంది. 

కనీస వసతులు కరవు
– వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం సదరం క్యాంపులకు వచ్చే దివ్యాంగులు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఒక టెంట్‌ ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించేలా చేస్తున్నారు. 
– దివ్యాంగులు తలెత్తుకుని బతికేలా చూస్తానని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు స్పందించడం లేదు. 
– దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, అర్హుల పింఛన్లు తొలగించినా వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు పార్టీ అండగా ఉంటుంది.
– అందుకే ఎవరూ గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని కిరణ్‌రాజ్‌ స్పష్టం చేశారు.

Back to Top