మంగళగిరి: రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు వేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు మంగళవారం దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ‘మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం’ పేరుతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయ కన్వీనర్లు సహా 2,700 మందికిపైగా నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సమావేశం ఏర్పాట్లను వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతరులు కూడా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో వైయస్ఆర్‌సీపీ దూకుడు రాష్ట్రంలో గత 58 నెలలుగా రాష్ట్రంలోని ప్రతి పేదింటి భవిష్యత్తును గొప్పగా మార్చేలా సీఎం వైయస్ జగన్ సుపరిపాలన అందిస్తుండటంతో వైయస్ఆర్‌సీపీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఇది ప్రతిబింబించింది. సుపరిపాలన వల్ల ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్లీన్ స్వీపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని 2022 మే 11న ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అప్పటి నుంచి వైయస్ఆర్‌సీపీ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతోంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పట్టారు. గత నెల 27న భీమిలి వేదికగా ఎన్నికలకు ‘సిద్ధం’ అంటూ సీఎం వైయస్ జగన్ ఎన్నికల శంఖం పూరించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. దీంతో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో దూకుడు మరింత పెంచాయి. వచ్చే నెల 3న పల్నాడు ప్రాంతంలో పిచ్చికలగుడిపాడు ‘సిద్ధం’ చివరి సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.