బాబూ..బీసీల‌కు ఏనాడైనా న్యాయం చేశావా?  

ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నింటా బీసీలకు ప్రాధాన్యం

14 ఏళ్ళు సీఎంగా ఉండి బీసీలను పట్టించుకోని బాబు

బీసీల గురించి మాట్లాడే అర్హతే బాబుకు లేదు

ఎన్టీఆర్ ను గౌరవించింది సీఎం వైయ‌స్‌ జగన్.. వెన్నుపోటు పొడిచింది బాబు

మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

విశాఖపట్నం:  టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో ఏనాడైన బీసీలకు న్యాయం చేశారా అని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్ర‌శ్నించారు. బీసీ న్యాయమూర్తులకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని  మండిప‌డ్డారు. చంద్రబాబు ఎవరినైనా బీసీని రాజ్యసభకు పంపించావా అని ప్ర‌శ్నించారు. బీసీల తోకలు కట్‌ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింద‌ని మంత్రి కారుమూరి తెలిపారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు రాజ్యసభకు వెళ్లారో ప్రజలకు తెలుసు. మంత్రి వర్గంలోని 25 మందిలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా బీసీలకు ప్రాధాన్యత ఉందా అని ప్రశ్నించారు. విశాఖ‌ప‌ట్నంలో మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏమన్నారంటే..

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి గంట నుంచే.. వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద వర్గాలకు అన్నింటా పెద్దపీట వేస్తూ.. గత మూడేళ్ళుగా ‘బహుజన హితాయ... బహుజన సుతాయ’అన్నట్టుగా పరిపాలన చేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రిపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. తొలి మంత్రివర్గంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం చోటు కల్పించారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో 70శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించి భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.

- వైయ‌స్‌ జగన్‌ఏలూరులో బీసీ గర్జన పెట్టి, అధికారంలోకి రాగానే, బీసీలకు  అన్నింటా పెద్దపీట వేస్తామని, వారికి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా న్యాయం చేస్తామని ఇచ్చిన డిక్లరేషన్‌ కు కట్టుబడి, గత మూడేళ్ళ పరిపాలనలో చేతల్లో చేసి చూపించారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం, బీసీ కులాలపై అధ్యయనం చేసి, 139 బీసీ కులాలను వెలికి తీసి, వారికి 56 కార్పొరేషన్లు పెట్టి, వారందరికీ చైర్మన్‌ పదవులు కట్టబెట్టారు. బీసీల్లో అట్టడుగున ఉన్న కులాలను కూడా గుర్తించి, వారికి ఉన్నత పదవులు కల్పించి, సమాజంలో గుర్తింపు తెచ్చిన  ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు. నాడు వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి, ఇవాళ వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వాలవల్లే తాము ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నామని, ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా, ప్రతి పేద వాడూ, నిరుపేద విద్యార్థులు చెబుతున్నారు. రిక్షా తొక్కుకుని జీవనం సాగించే వ్యక్తి కొడుకు కూడా ఈరోజు ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. విద్య ద్వారా లక్షలాదిమంది కుటుంబాల జీవన స్థితిగతులు మారే అవకాశం కలిగింది. తండ్రికి తగ్గ తనయుడిగా వైయస్సార్‌ ఆశయాలను అమలు చేస్తూ.. వైయ‌స్‌ జగన్‌ నాలుగు అడుగులు ముందుకు వేసి ‘నాడు-నేడు’ కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ స్కూళ్ళు- ఆసుపత్రుల్లో మౌలిక వసతులతో పాటు పేదలకు ఇంగ్లీష్‌ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చారు. 

14 ఏళ్ళు సీఎంగా ఉండి బీసీలను పట్టించుకోని బాబు
చంద్రబాబు నాయుడు తన జీవితకాలంలో ఏనాడు అయినా బీసీల గురించి ఆలోచించాడా?. వారిని ఓట్లు వేసే యంత్రాల్లా వాడుకున్నారే తప్ప, బీసీలకు ఇచ్చిన గౌరవం ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబుతో పాటు ఆయన దత్తపుత్రుడిది ఎంత నీచ బుద్ధి అంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలును అడ్డుకునేందుకు బాబుతో కలిసి కుట్రలు పన్నాడు. బాబు కొడుకు, మనవడు, ఆయన దత్తపుత్రుడి పిల్లలు మాత్రమే ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలా? బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఎందుకు ఇంగ్లీషు మీడియం చదవకూడదు?  అని ప్రశ్నిస్తున్నాం. శాసనమండలిలో ఇంగ్లీషు మీడియంపై బిల్లును పాస్‌ చేయకుండా వెనక్కి పంపిన బీసీల ద్రోహులు చంద్రబాబు అండ్ కో. ఇదేనా బీసీలకు మీరు ఇచ్చే గౌరవం,  ప్రేమ అని అడుగుతున్నాం. 

బీసీల గురించి మాట్లాడే అర్హతే బాబుకు లేదు
అధికారంలో ఉన్నన్నాళ్ళూ బీసీలను చిన్నచూపు చూసిందే కాక, నోరెత్తితే.. బీసీల తాట తీస్తా, తోకలు కట్‌ చేస్తానని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ బీసీల మీటింగు పెట్టి, అది చేశాను, ఇది చేశాను అని మాట్లాడుతుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. బీసీలు జడ్జిలుగా పనికిరారంటూ మీ స్వహస్తాలతో కేంద్రానికి లేఖలు రాసింది చంద్రబాబు కాదా? వీటన్నింటినిబట్టే చంద్రబాబుకు బీసీల పట్ల  ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, రాజ్యసభకు బీసీలను ఎవరినైనా నామినేట్‌ చేశావా? అదే మా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ రాజ్యసభలో 9 ఖాళీలు ఏర్పడితే, అందులో ఐదుగురు బీసీలకు స్థానం కల్పించారు. అదే చంద్రబాబు, తన పార్టీ కోసం పనిచేసిన వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని చివరి వరకు ఆశ చూపించి, చివరిక్షణంలో మొండిచేయి ఇచ్చాడు.   అలాంటి మీకు బడుగు, బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం.

అవినీతికి తావు లేకుండా రూ. 1.65 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశాం
ఎలాంటి అవినీతికి తావులేకుండా మధ్యవర్తులు, దళారులు లేకుండా 1.65 లక్షల కోట్ల రూపాయిలు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేసిన ప్రభుత్వం మాది. అందులో 80 శాతానికి పైగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన ఘనత వైయ‌స్ జగన్‌కే దక్కుతుంది. అలాగే ఉన్నత సామాజికవర్గాల్లోని పేదలకు కూడా, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ముఖ్యమంత్రి గొప్ప మనసుతో సాయం అందిస్తున్నారు. మంత్రివర్గంలో 25మంది ఉంటే, వారిలో 17మంది అంటే 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారికి స్థానం కల్పించారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, ఈ వర్గాలకు ఇన్ని మంత్రి పదవులు ఇవ్వలేదు సరికదా.. కనీసం తన పార్టీ లో కూడా మెజార్టీ పదవులు తన సామాజిక వర్గానికే ఇచ్చుకున్నాడు. 

ఆ బాదుడు ఎవరిది..?
అధికారంలో ఉండగా, బడుగు, బలహీనవర్గాలను అడుగడుగునా అవమానించి, వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రజల దగ్గరకు వెళ్లలేని పరిస్థితి.  అందుకే ప్రజల దృష్టి మరల్చేందుకు ఏదో ఒకటి సృష్టిస్తాడు. బాదుడే.. బాదుడు అంటూ వీధుల వెంట తిరుగుతున్నాడు. అది ఎవరి బాదుడో మీకు తెలియదా? పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ఎవరి పరిధిలోనిది? ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీయలేవు, కనీసం కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేవు.  ఎందుకంటే, కేంద్రాన్ని ప్రశ్నిస్తే, మిమ్మల్ని ఎక్కడ లోపల వేస్తారేమో అని భయం. బాబు బీసీలకే కాదు.. రైతులకు కూడా ద్రోహం చేశాడు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఎగ్గొట్టిన ఇన్‌ఫుట్‌ సబ్సిడీని కూడా మేము అధికారంలోకి వచ్చాకే ఇచ్చాం. నెల రోజుల్లోనే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ సొమ్మును రైతుల ఖాతాలో జమయ్యేలా మా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. రైతులు, మహిళలు, బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాలకు సాయం చేస్తున్న మనసున్న గొప్ప మానవతావాది వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. నిత్యావసర సరుకుల ధరలు మన రాష్ట్రంలో తక్కువ
ఇతర రాష్ట్రాలలో కంటే మన రాష్ట్రంలోనే నిత్యావసర సరుకుల ధరలు తక్కువగా ఉన్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయని గోల పెడుతున్న టీడీపీ వాళ్లు..  నిన్నటివరకూ అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎందుకు కనీసం ప్రశ్నించలేకపోయారు అని అడుగుతున్నాం. ఎందుకంటే వారు చెప్పేవన్నీ అబద్ధాలు, అసత్యాలే.  ఏదోవిధంగా సభలో అల్లర్లు సృష్టించి, భోజనం సమయానికి సస్పెండ్ చేయించుకుని వెళ్లిపోయింది మీరు. రాష్ట్రంలో పాలన చక్కగా జరుగుతోంది. దాంతో ప్రజల ముందుకు ఏవిధంగా వెళ్లాలో అర్థం కాక చంద్రబాబు నాయుడు... ఎల్లో మీడియా ద్వారా ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక బురద చల్లించే కార్యక్రమం చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖపైనా ఆరోపణలు చేస్తే... వాటిని ఆధారాలతో సహా చూపించడంతో తోక ముడిచారు. చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంలా వ్యవహరించలేక, ఎక్కడో ఏదో జరిగితే, దానిని సాకుగా చూపించి, పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. ఇది మంచి పద్దతి కాదని హితవు పలుకుతున్నాం.

ఎటువంటి రాజకీయం లేదు
- ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చడం విషయంలో ఎటువంటి రాజకీయం లేదు. దీనిపై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు. పేదల ప్రాణాలను కాపాడేందుకు ఆరోగ్యశ్రీ తెచ్చి, నాడు లక్షల మంది ప్రాణాలు కాపాడి, ప్రాణం పోసిన వైద్యదాత, మహానుభావుడు రాజశేఖర రెడ్డి పేరు పెట్టడమే సముచితం. ఎన్టీఆర్ గౌరవార్థమే.. విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేశాం. ఎన్టీఆర్ ను గౌరవించింది వైయ‌స్‌ జగన్.. వెన్నుపోటు పొడిచింది, ఆయన చావుకు కారణమైంది చంద్రబాబు. 

- అధికార భాష సంఘం అధ్యక్షుడు యారగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఎవరో, ఎందుకు  రాజీనామా చేశాడో అన్నది ఆయన వ్యక్తిగత విషయం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top