అమరావతి: సమాజ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న నాయకులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అవకాశం ఉన్న అన్నిచోట్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వైయస్ఆర్‌సీపీ పెద్ద పీట వేస్తోందని తెలిపారు. అందుకే వైయస్ఆర్ సీపీకి ఆయా వర్గాల ఆదరణ లభిస్తోందని తెలిపారు. శుక్రవారం సచివాలయంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు చేత మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ్టితో శాసన మండలి సభ్యుల నియామక అంకం పూర్తయ్యిందన్నారు. మత్స్యకార కుటుంబం నుంచి కర్రి పద్మశ్రీ, ఎస్టీ నుంచి కుంభా రవిబాబుకు అవకాశం కల్పించారన్నారు. మొత్తం 43 ఎమ్మెల్సీ ఖాళీల్లో 18 మంది బీసీలు, 6 గురు ఎస్సీలు, నలుగురు మైనారిటీలు, ఒక ఎస్టీ అభ్యర్థికి వైయస్ జగన్ అవకాశం కల్పించారని చెప్పారు. ఈ పంథాను వైయస్ఆర్‌సీపీ కొనసాగిస్తుందని అన్నారు. ఎంపికైన సభ్యులు తమ వర్గాల, సమాజ అభ్యున్నతి కోసం పని చేస్తారని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కుంభా రవి, కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ.. తమకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఇచ్చిన బాధ్యతను తాము తూ.చ. తప్పకుండా నెరవేరుస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చట్ట సభల ద్వారా గొంతు వినిపించే అవకాశం ఇచ్చారని.. ఆధునిక సామాజిక సంస్కర్త వైయస్ జగన్ అని కొనియాడారు. విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. 75 ఏళ్ళ తర్వాత మొదటిసారి మత్స్యకార మహిళకు మండలిలో అవకాశం ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజన్న దొర, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు.