సుజనా..మీరు కూడా అలాగే పారిపోదామనుకుంటున్నారా? 

విజయవాడ : దోపిడి చేసిన వాళ్లు చాలా మంది దేశం వదిలి వెళ్లారని.. ఎంపీ సుజనా చౌద‌రి కూడా అలాగే పారిపోదామనుకుంటున్నారని వ్యవసాయ మంత్రి కన్నబాబు విమర్శించారు.  రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరిపై ఆయ‌న మండిపడ్డారు. ఒక ఎంపీగా ఉంటూ దేశం వదిలి వెళ్లిపోతానని అనడం సిగ్గు చేటన్నారు. రాజధాని పేరుతో ఎన్ని వేల కోట్లు కుంభకోణం చేశారో సుజనా మాటలను చూస్తే అర్థమవుతుందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని పేరుతో సుజనా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. అందుకే ఇప్పుడు మరో దేశానికి కాందిశీకుడిగా పోతానంటూ దేశాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 
సుజనా చౌదరి తొందరపడవద్దని..త్వరలోనే ఆయన దోపిడీ అంతా బయటపెడతామన్నారు. కేసులకు భయపడే సుజనా బీజేపీలోకి వెళ్లాడని ఆరోపించారు. విశాఖ రాజధాని కావాలని ఎవరు అడిగారని చంద్రబాబు అంటూన్నారు.. మరి అమరావతి రాజధాని కావాలని ప్రజలు ఏమైనా ఉద్యమాలు చేశారా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కావడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని నిలదీశారు. చంద్రబాబు మాటలు విని అమరావతి రైతులు మోసపోవద్దని కోరారు. 

 బినామీల కోసం చంద్రబాబు నాయుడు బస్సుయాత్ర చేస్తున్నారని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల మాటలు విని అమరావతి రైతులు మోసపోవద్దని కోరారు. చంద్రబాబు చెప్పు చేతుల్లో నడిచే పవన్‌ కల్యాణ్‌ ఒక నాయకుడేనా అని ఎద్దేవా చేశారు. రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలన్నారు. అమరావతిలోని బినామీలను బయటకు తీసి.. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌లను జైల్లో వేయాలని ఎమ్మెల్యే ద్వారంపుడి డిమాండ్‌ చేశారు.  

Back to Top