10 నుంచి భక్తులకు దుర్గమ్మ దర్శనం

ఆలయ సిబ్బందితో ట్రయల్‌ రన్‌ ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: ఈనెల 10వ తేదీ నుంచి భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం కల్పించనున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శన ట్రయల్‌ రన్‌ను మంత్రి ప్రారంభించారు. ఆలయ సిబ్బందితో నిర్వహించిన ట్రయల్‌ రన్‌ను మంత్రి పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. అమ్మవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేశామన్నారు.  గంటకు 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని, దయచేసి భక్తులందరూ సహకరించాలని కోరారు. భక్తులు మాస్కులు ధరించాలని, శానిటైజర్‌ వాడాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్‌ ఉంటేనే ఆలయాల్లోకి అనుమతిస్తారన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలోని ఆలయాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లోకి 10వ తేదీ నుంచి భక్తులను అనుమతించడం జరుగుతుందన్నారు. భక్తులు జాగ్రత్తలు పాటించాలని, కచ్చితంగా ఫోన్‌లో ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేయాలని కోరారు. 

కరోనా వైరస్‌ వచ్చి రాష్ట్ర ఖజానాకు ఆదాయం లేని పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించినా తొనకకుండా.. బెనకకుండా కరోనా కష్టకాలంలో అన్ని వర్గాలకు సీఎం సాయం అందించారన్నారు. అమ్మవారి ఆశీస్సులతో దిగ్విజయంగా మిగతా నాలుగు సంవత్సరాలపాలన కూడా సుభిష్టంగా ఉంటుందన్నారు. 

Back to Top