ఉద్యోగాల నియామ‌కాలు పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాలి

డీఎస్సీ ద్వారా గ్రామ సచివాలయ ఉద్యోగాలు

మంచినీటి ఎద్ద‌డి నివార‌ణ‌కు శాశ్వ‌త చ‌ర్య‌లు చేప‌ట్టాలి

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి 

అమరావతి : గ్రామ సచివాలయాలను అక్టోబర్‌ 2న ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రతి రెండు వేల మందికి గ్రామ సచివాలయం ఉండాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయంలో ఉద్యోగాల నియామాకానికి ఈ నెల జూలై 15 నాటికి నోటిఫికేషన్‌ జారీ చేయాలని, జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ) ద్వారా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అత్యంత పారదర్శక విధానంలో, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల్లో కల్పించే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలన్న విషయం యువతకు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు.

గ్రామంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా మరో పది మందికి ఈ ఉద్యోగాలు ఇస్తున్న విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. వివిధ అర్హతలున్న వారిని పరిగణలోకి తీసుకోవాలని, వారంతా తమకు నిర్ణయించిన ఏ పనైనా చేయగలిగేలా తీర్చిదిద్దాలన్నారు. మంచినీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని, అందుకోసం డ్రింకింగ్‌ వాటర్‌ కార్పొరేషన్‌ను నోడల్‌ ఏజెన్సీగా చేపట్టాలని తెలిపారు. ఒక జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఆ జిల్లాలో తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలన్నారు. రాబోయే ముప్పై ఏళ్లు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్పొరేషన్‌ ప్రణాళికలు రచించుకుని అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉందని వెల్లడించారు.

Back to Top