ముద్రగడ పద్మనాభం నివాసంపై దాడి 

జై జనసేన అంటూ నినాదాలు..

పోలీస్ అదుపులో నిందితుడు.

కాకినాడ: వైయ‌స్ఆర్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసంపై కూట‌మి నేత‌లు దాడి చేశారు. ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసం వద్ద జనసేన కార్యకర్త హల్‌చల్‌ చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్‌ తీసుకుని వచ్చాడు. అనంతరం, అక్కడ బీభత్సం సృష్టించాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్‌ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్‌ చేశాడు. అనంతరం, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన దాడిని పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ శ్రేణులు, ముద్రగడ అభిమానులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దాడిని ఖండించిన కురసాల కన్నబాబు

వైయ‌స్ఆర్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై జన‌సేన నేత‌ల దాడిని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ఖండించారు. ఈ దాడిని చూస్తే.. రాష్ట్రంలో శాంతిబద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్ధమవుతోంద‌న్నారు. కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీల మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న దుర్మార్గపు ఆలోచనతో ఉన్నార‌ని మండిప‌డ్డారు. కూటమీ నేతల ఉదాశీనత..ప్రోత్సాహం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయ‌ని ఫైర్ అయ్యారు. ముద్రగడ ఇంటి పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కురసాల కన్నబాబు డిమాండు చేశారు.
 

Back to Top