తూర్పుగోదావరి: రాజమండ్రిలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల ఏర్పాటు కానుందని, వెయ్యి పడకల ఆసుపత్రిగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు అవుతుందదని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజమండ్రిలో మెడికల్ కాలేజీకి లైన్ క్లియర్ అయిందని ఆయన తెలిపారు. శనివారం ఆయన మీడయాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు మొదటిదశలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి యాభై ఎకరాల స్థలం అవసరం ఉందని ఆయన తెలిపారు. అవసరమైతే మరో 30 ఎకరాల భూసేకరణ ప్రయత్నాలు చేస్తామని రాజా తెలిపారు. ఇప్పటికే రెండు మూడు చోట్ల ప్రభుత్వ భూములు పరిశీలించామని ఆయన చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాల రాజమండ్రిలో ఏర్పాటు చేస్తే స్థానికులతో పాటు ఇతర జిల్లాల వారికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఎంత ఖర్చయినా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇంటి స్థలం అందించాలనేది సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కల అని గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే చర్యలు చేపడుతున్నామని జక్కపూడి రాజా తెలిపారు.