తాడేపల్లి: కేసులు ఎక్కువ వస్తున్నాయని రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ సీఎం వైయస్ జగన్ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేసులు ఎక్కువగా వస్తున్నాయని రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు. రోజూ చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. రోజుకు 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనదేనని ఉద్ఘాటించారు. ప్రతి 10 లక్షల మందిలో 31 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, 90 శాతం పరీక్షలు కొవిడ్ క్లస్టర్లలో జరుగుతున్నాయని వివరించారు. 'కొవిడ్ వస్తుంది, పోతుంది... ఇప్పటి పరిస్థితుల్లో కొవిడ్ తో కలిసి జీవించక తప్పద'ని సీఎం వైయస్ జగన్ అభిప్రాయపడ్డారు.