తాడేపల్లి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్లు కట్టుకుంటున్న అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు అందజేస్తున్నామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అక్కచెల్లెమ్మలకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా ఒక ఆస్తిని ఇచ్చి ఒక మంచి అన్నగా, తమ్ముడిగా రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఇచ్చేందుకు దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే...: 4,07,323 మందికి మంచి చేస్తూ రూ.47 కోట్లు జమ. దేవుడి దయ వల్ల ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 12,77,373 మంది అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.35వేలు చొప్పున పావలా వడ్డీకే రుణాలిప్పించడమే కాకుండా.. వాటికి సంబంధించి ఈ దఫాలో 4,07,323 మందికి పావలా వడ్డీ కింది ఇవాళ రూ.47 కోట్లు జమ చేస్తున్నాం. ప్రతి ఆరునెలలకొకసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. గతంలో సున్నావడ్డీ డబ్బులు అక్కచెల్లెమ్మలకు విడుదల చేసినప్పుడు... దాదాపుగా 5,43,140 మంకి అప్పట్లో ఈ కార్యక్రమం కింద రూ.54 కోట్లు గతంలో విడుదల చేశాం. ఇవాళ ఇప్పుడు మరో 4,07,323 మందికి.. ఈ ఆరునెలల జాబితాలో మరో రూ.47 కోట్లు విడుదల చేస్తున్నాం. పావలా వడ్డీకే ఇలా ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి చేస్తూ.. రూ.35వేలు వారికిస్తూ.. తద్వారా వాళ్ల ఇళ్ల నిర్మాణం పురోగతిని వేగంగా చేసే కార్యక్రమం జరుగుతుంది. దేశచరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవ్వరూ సాహసం చేయని విధంగా ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్ధలాలు నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. అందులో ఇప్పటికే 22.25 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. ఇది ఎక్కడా, ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో చూడని విధంగా జరుగుతుంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా రూ.2.70 లక్షలు ఖర్చవుతుంది. మరో రూ.1లక్ష మౌలిక సదుపాయాల కోసం అదనంగా ఖర్చవుతుంది. అంటే ఇంటినిర్మాణం, మౌలిక వసతుల కోసమే దాదాపుగా రూ.3.70వేలు ఖర్చువుతుంది. ఇలాంటిపరిస్థితుల్లో రూ.1.80 లక్షలు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం. మరో రూ.35వేలు పావలా వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. దాదాపు రూ. 15వేలు ఖరీదు చేసే ఇసుక సరఫరా చేస్తున్నాం. ఇవి కాక మరో రూ.40వేలు ఖరీదు చేసే సిమెంట్, మెటల్ ఫ్రేమ్‌లాంటి వివిధ రకాల వస్తువులు ఇస్తూ... వారికి మంచి జరిగే కార్యక్రమం చేస్తున్నాం. ఒకవైపు రూ.2.70 లక్షలకు సంబంధించి ఇళ్లనిర్మాణం, రూ.1లక్షకు సంబంధించిన మౌలిక వసతులు నిర్మాణంలో ఉండగా.. ఈ 31.19లక్షల ఇంటి స్ధలాల్లో ఒక్కో ఇంటిస్ధలం విలువ జిల్లా, ప్రాంతాన్ని బట్టి కనీసం రూ.2.50 లక్షల నుంచి కొన్ని కొన్ని ప్రాంతాలు, జిల్లాల్లో రూ.15 లక్షల పై చిలుకు ఉంది. ఈ ఇంటి స్దలం విలువ మీద.. నిర్మాణం కోసం ఖర్చు చేస్తున్న రూ.2.70వేలు, రూ.1 లక్ష విలువైన మౌలిక సదుపాయాలు అన్నింటినీ కలుపుకుంటే.. దాదాపుగా ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.5లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆస్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వగలిగే గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈ దఫా 4,07,323 మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ.. సున్నా వడ్డీ కింద రూ.47 కోట్లు ఇస్తున్నాం. బ్యాంకుల దగ్గర నుంచి దాదాపుగా 9 నుంచి 11 శాతం వరకు వడ్డీకి రుణాలు తీసుకుని, వాటిని తిరిగి బ్యాంకులకు కట్టే కార్యక్రమం అక్కచెల్లెమ్మలు ప్రాంప్ట్‌గా చేయాలి. అది వాళ్ల బాధ్యత. వాళ్లు కట్టిన వడ్డీ సొమ్మును తిరిగి వాళ్లకివ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం. ఆ అక్కచెల్లెమ్మలకు నికరంగా రూ.35వేలు మీద పావలా వడ్డీ మాత్రమే పడుతుంది. ఇది మంచి కార్యక్రమం. దీన్ని ముందుకు తీసుకువెళ్దామని స్పష్టం చేస్తూ.. సీఎం వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.