వైజాగ్: విశాఖ బహిరంగ సభలో పవన్ ప్రసంగమంతా అహంకారం, విద్వేషం, అసత్యాలతో కూడిన ఆరోపణలతో నిండిపోయిందని, వైయస్ జగన్‌పై అసూయ, ఆరాటం పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపించిందని, తాను నమ్ముకున్న దత్తతండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారనే భ్రమల్లో పవన్ బతుకుతున్నాడని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. పవన్ మాటల్లో తాను నాయకుడిగా ఎదగాలనే తాపత్రయం గానీ.. తనపార్టీ తాలూకూ భవిష్యత్తును కాపాడుకోవాలనే లక్ష్యం ఎక్కడా వినిపించడంలేదన్నారు. వారాహి పేరుతో ఒక లారీ ఎక్కి మూడోవిడత యాత్ర అంటూ పవన్‌కళ్యాణ్ ఊగిపోతూ ప్రసంగిస్తున్నాడని, లక్ష్యం, సిద్ధాంతం, వ్యక్తిత్వం లేని వ్యక్తి అసత్య ఆరోపణలతో ఆవేశపడి ఊగిపోయినంత మాత్రానా నాయకుడు కాలేడనేది పవన్ తెలుసుకోవాలని సూచించారు. ఒక కథానాయకుడిగా సినిమాల్లో ఏ వేషాలైనా వేసి తాను కలలుగనే లక్ష్యాన్ని చేరుకోవచ్చు.. అంతేగానీ ప్రజాక్షేత్రంలో పోరాడి ప్రజలు మెచ్చిన నేతగా ఉన్న సీఎం వైయస్ జగన్‌ని ఓడించాలనుకోవడం సాధ్యం కాని విషయమని అర్థం చేసుకోవాలన్నారు. విశాఖలోని సర్క్యూట్‌హౌస్‌లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన ఇంకేం మాట్లాడారంటే..
పవన్ బానిసత్వానికి జాలిపడాలి
నాయకుడిగా నిలబడాలంటే మనం నమ్మిన వారిని.. మనల్ని నమ్మేవారిని కాపాడుకోగలగాలి. ఇక్కడ పవన్‌కళ్యాణ్ మాత్రం తనను అభిమానించే అభిమానులను కాదని.. తాను నమ్ముకున్న దత్తతండ్రి చంద్రబాబుకు బానిసగా బతుకుతున్నాడు. బాబు ఇచ్చిన ప్యాకేజీ ఫీడ్‌తో స్క్రిప్టులు పట్టుకుని రోడ్లమీదికొచ్చి ఊగిపోతున్నాడు. ఆయన మాట్లాడే ప్రతీ మాట వెనుకనున్న అంతరార్థం, తన యజమానికి పనిచేసి పెట్టాలన్న పవన్ బానిసత్వానికి ప్రతీ ఒక్కరూ జాలిపడాల్సిందే.
అల్పుడెపుడు పల్కు .. అంటూ వేమన పద్యం చూస్తే..
పవన్‌కళ్యాణ్‌కు, గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య వ్యత్యాసాన్ని యోగి వేమన ఎప్పుడో చెప్పారు. ‘అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను.. సజ్జనుండు పలుకు చల్లగాను, కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా.. విశ్వదాభిరామ వినురవేమ’ అని ఆ మహానుభావుడు వేమన పద్యం రాశారు. ఏమీలేని ఆకు ఎగిరెగిరి పడిందని.. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందనే నానుడిని కూడా పెద్దలు చెబుతారు. పవన్‌కళ్యాణ్‌లాంటోళ్ల కోసమే ఇలాంటి సామెతలు, నానుడులు పలుకుతారు.
సంసారం బీజేపీతో.. సహజీవనం టీడీపీతోనా..?
పవన్ కల్యాణ్ 15 ఏళ్ల కిందట రాజకీయాల్లోకొచ్చాడు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయ అరగేట్రం చేసిన నువ్వు.. ఆ తర్వాత జనసేన పార్టీ పెట్టి పదేళ్లలో ఏం సాధించావు..? నీకు ఒక విధానం, సిద్ధాంతం, లక్ష్యం, స్థిరత్వం లేదు. ఒకపక్క విప్లవవాదినంటావు. మరోపక్క బీజేపీతో కలిసి పనిచేస్తున్నానంటావు. 2014 నుంచి 2023 వరకు గడచిన 9 ఏళ్లుగా దాదాపు ఆరేడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నావు. వాటిల్లో ఒక పార్టీకి మరో పార్టీకి విధానాలు కలవవు. లక్ష్యాలు, సిద్ధాంతాలు వేరుగా ఉన్న పార్టీలతో కలిసి పనిచేస్తావు. 2014లో తెలుగుదేశం, బీజేపీతో పొత్తు.. అదే 2019 ఎన్నికలు వచ్చేసరికి సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్నావు. 2019లో ఓడిన తర్వాత కొన్నాళ్లకు మళ్లీ బీజేపీతో కలుస్తావు. ఇప్పుడు సంసారమేమో బీజేపీతో సహజీవనమేమో తెలుగుదేశం పార్టీతో చేస్తున్నావు. ఇది పవన్‌కళ్యాణ్ తాలూకా రాజకీయ వ్యక్తిత్వమని చెప్పుకోవాలి.
సీఎం వైయస్ జగన్‌ను ఆదర్శంగా తీసుకో..
పవన్‌కళ్యాణ్ తీరును చూస్తుంటే చాలామందికి జాలేస్తుంది. ఇన్నాళ్లు సినిమా ఇమేజ్‌తో ఉన్న అతను తన రాజకీయ ప్రసంగాలతో ఉన్న గౌరవాన్ని కోల్పోతున్నాడని అతని ఫ్యాన్ కూడా బాధపడుతున్నారు. మొదట్నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై అసూయ, ద్వేషం, ఆక్రోశంతో విమర్శలు చేయడమే పవన్ కల్యాణ్ పనిగా పెట్టుకున్నాడు. చిన్న వయసులో వైయస్ జగన్ అనే నాయకుడు రాజకీయాల్లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా 151 స్థానాల్ని కైవసం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారనే సంగతిని గుర్తెరగాలని .. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఎదగాలని అనుకోలేదు. మరి, సీఎం వైయస్ జగన్ పవన్‌కళ్యాణ్ మాదిరిగా సినిమా నటుడు కాదు. ఆయనకున్న సినిమా ఇమేజ్ లేని వ్యక్తి. రాజకీయాల్లో నడవడమంటే సినిమాల్లో చేసే యాక్టింగ్ కాదు. ప్రజల మధ్య నిలబడి ప్రజల తాలూకూ బాధలు, కష్టాల్ని చూసి ప్రాంతాల నడుమ పరిస్థితుల్ని, ఇబ్బందుల్ని పూర్తిగా అధ్యయనం చేయడం, ఈ వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకుంటే తమ కష్టాల్ని తీరుస్తాడనే ప్రజలకు నమ్మకం కలిగించడం. ఈ విషయాలన్నింటిపై రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు వైయస్ జగన్‌ని నమ్మారు కాబట్టే ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో ఎదగడానికి ప్రయత్నించకుండా ప్రతీక్షణం సీఎం వైయస్ జగన్‌ని విమర్శిస్తేనో.. దుయ్యబడితోనే పవన్‌కళ్యాణ్ ఏమీ సాధించడు.
175 స్థానాల్లో పోటీ చేయవు.. సీఎం ఎలా అవుతావు..?
పవన్‌కళ్యాణ్ మైకుపట్టుకుంటే వైయస్ జగన్ అధికారం నుంచి దిగిపోవాలంటాడు. మరి, ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావు..? నువ్వా..? 175 నియోజకవర్గాలకు 175 చోట్ల జనసేన పోటీ చేస్తుందా..? నిన్న విశాఖపట్నం బహిరంగ సభ ప్రసంగంలో ఆ ప్రస్తావనేమీ తేలేదు. మరి, ‘చంద్రబాబు నీ చెవిలో నాకొడుకు లోకేశ్‌ను పక్కనబెట్టి నిన్నే ముఖ్యమంత్రిని చేస్తాను పవన్..’ అంటూ నీకేమైనా చెప్పాడా..? అందుకేనా.. చంద్రబాబు అందించిన స్క్రిప్టును అక్షరం పొల్లుపోకుండా చదువుతున్నావు. కేవలం.. నువ్వు పనిచేసేది, ప్రసంగించేది చంద్రబాబు అధికారం కోసమే కదా..? ఇదికూడా కాదంటే.. ఆనాడు ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న చంద్రబాబు విధానాన్నే ఆదర్శంగా తీసుకుని నువ్వు గెలిచాక, ఆయన్నే వెన్నుపోటు పొడుద్దామనుకుంటున్నావా..? అలా చేయాలన్నా.. నువ్వు ఎక్కడా గెలిచే పరిస్థితీ కనిపించడం లేదు. అయితే, ఊగిపోయే లారీ ప్రసంగాలేంటి..? ఈ ప్రశ్నలపై ప్రజలకు పవన్‌కళ్యాణ్ సమాధానం చెప్పాలి.
ఈ ప్రశ్నలకు సమాధానమిస్తావా..?
పవన్‌కళ్యాణ్ ఇప్పటివరకు ఒక వర్గం, సమూహం, ప్రాంతం నుంచి ఆదరణ, గుర్తింపు పొందనేలేదు. మహిళలు, రైతులు, యువకులు ఇలా ఏ ఒక్కరి ఆదరణ పొందలేని వ్యక్తి ఇతను. ఈరోజు మహిళలు, వారి మనోభావాలు, వారి గౌరవం, అక్రమ రవాణా అంటూ మాట్లాడుతున్నాడు. తన దత్తతండ్రిని భుజాలపై మోస్తున్న పచ్చమీడియా ఛానెళ్లల్లో కొందరు న్యూస్‌ప్రెజెంటర్లు సినిమా తారలపై అసభ్యంగా వాగినప్పుడు.. సినీ కథానాయికలంతా బాధపడినప్పుడు ఈ పవన్‌కళ్యాణ్ నోరేమైపోయింది.? రాష్ట్రంలో మహిళల పేరిట సంక్షేమ పథకాలు అందివ్వడం మా ప్రభుత్వం తప్పా..? మహిళలకు ఉదయం సంక్షేమ పథకాల కింద డబ్బు అందుతుంటే రాత్రికి వెళ్లి మందు తాగుతున్నారంటున్నావు. అంటే, మహిళలు సాయంత్రమైతే మందుతాగుతారనే అభిప్రాయంలో ఈ పవన్‌కళ్యాణ్ ఉన్నాడా..? ఇదేనా.. ఆయన మహిళలకిచ్చే మర్యాదా..? గౌరవం..? కాపు సామాజికవర్గ ఉద్యమకర్తగా ఉన్న ముద్రగడ పద్మనాభం భార్య, కోడలిని ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేసినప్పుడు పవన్‌కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు..? మరి, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక సంఘటన జరిగినంతమాత్రాన 2.60 లక్షల మంది ఉన్న వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తప్పుబడుతున్నాడు..? విశాఖపట్నం గంజాయికి రాజధానిగా మారిందని చంద్రబాబు కేబినెట్ మంత్రులే అన్నప్పుడు నువ్వెందుకు ప్రశ్నించలేదు..? అని పవన్‌కళ్యాణ్‌ను నిలదీస్తున్నాం.
విశాఖలో ఇప్పుడెవరో భూములు దోచేస్తున్నారంటున్నావ్.. మరి, బాబు హయాంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు తమ పార్టీవారే విశాఖలో ల్యాండ్‌స్కామ్ చేస్తున్నారంటూ నిండు శాసనసభలో చెప్పినప్పుడు నువ్వెక్కడ దాగున్నావ్..? గతంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక శాసనసభ్యుడు 150 ఎకరాలు దోచేశాడని అప్పటి ప్రభుత్వం ఆయనపై 420 కేసు పెట్టినప్పుడు ఈ పవన్‌కళ్యాణ్ నిద్రపోతున్నాడా..? 2019 ఎన్నికల్లో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసినటువంటి వ్యక్తికి సంబంధించిన సంస్థ ఆధీనంలో దాదాపు రూ.1000 కోట్ల విలువైన 40 ఎకరాల భూమి ఉందని తేలినప్పుడు నీ నోరు మూగబోయిందా. ఇంతమంది టీడీపీ నేతల అక్రమదందాలు, భూబాగోతాలను మేం వెలికితీసి నిర్ధారించినప్పుడు లేవని నీ నోరు రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలు, విసన్నపేట భూములపై లేస్తుందా..? నువ్వు మాట్లాడేవన్నీ అసత్య ఆరోపణలు కావా..? అని అడుగుతున్నాను.
పలుకుబడి లేదు.. బాబు రాబడే ఉంది
లేనిపోని ఆరోపణలతో మామీద బురదజల్లి చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చాలని.. పవన్‌కళ్యాణ్ ఎంతగా ప్యాకేజీకి కట్టుబడి పనిచేస్తున్నారో అర్ధమవుతూనే ఉంది. మాటకొస్తే కేంద్ర పెద్దలతో చెబుతాడంట. ఈయనకు కేంద్రంలో పలుకుబడి లేదు. ఆయనకున్నదంతా చంద్రబాబు దగ్గర రాబడే అని చెప్పాలి. అందుకే, ఇంతగా తాపత్రయపడుతున్నాడని ప్రజలు గమనిస్తున్నారు. కేంద్రంతో ఏం చెబుతావు..? ఎవర్ని బెదిరిస్తావు.? మేం ఏం తప్పు చేస్తున్నామని భయపడాలనుకుంటున్నావు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలతో పాటు అందరికీ సంక్షేమ పథకాలతో డీబీటీ ద్వారా రూ.2.31 లక్షల కోట్ల లబ్ధిని అందజేస్తూ మిగతా ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచినందుకు మేం భయపడాల్నా..? విద్య, వ్యవసాయం, వైద్యం వంటి అనేకరంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి అమలు చేస్తున్న వైయస్ జగన్‌ని ఆదర్శంగా తీసుకోవాలే తప్ప .. ఈరోజు ఎవడో వచ్చి ఎవరికో చెబుతామంటే భయపడే ప్రభుత్వం మాది కాదని స్పష్టంచేస్తున్నాను.
విశాఖస్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై నోరుపడిపోయిందా..?
- కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను, అత్యంతశక్తివంతమైన మహిళగా ఉన్న సోనియాగాంధీని 37 సంవత్సరాల వయసులోనే ఎదిరించి ఢీకొట్టిన ధీశాలి మా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ పవన్‌కళ్యాణ్ ఎవరికి చెప్పుకుంటాడు..? కేంద్రంతో కాకపోతే అమెరికా బైడెన్‌కు, రష్యా వెళ్లి పుతిన్‌కు చెప్పుకోమనండి. కేంద్రంలో పవన్‌కళ్యాణ్‌కు అంత పలుకుబడి ఉంటే ఇప్పటికే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేసి ఉండాలికదా..?
- నిన్న ప్రసంగంలో స్టీల్‌ప్లాంట్ పదం రాగానే దాటేసిన వ్యక్తి ఇతను. మరి, విశాఖ రాజధానిపై ఎందుకు మాట్లాడలేకపోయాడు..?
- రాజకీయ పార్టీ పెట్టి విడతలవారీగా అమ్ముడుపోతున్న వ్యక్తి పవన్‌కళ్యాణ్. అలాంటిది, రాజకీయం వ్యాపారం అవుతుందన్న ఆయన మాటల్ని చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు.
- ముఖ్యమంత్రిని ఎవర్ని చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు. రేపటి ఎన్నికల్లో ఇతను, ఇతని దత్తతండ్రి చంద్రబాబుకు అధికారం కలేనని గుర్తెరిగి.. ఒకట్రెండు గెలిచే సీట్లు ఉన్నట్లైతే.. వాటిల్లో అభ్యర్థులుగా ఎవర్ని నిలబెట్టుకోవాల్నో చర్చించుకోవాలి గానీ.. మా నాయకుడు సీఎం వైయస్ జగన్‌ని.. మా ప్రభుత్వంపై బురదజల్లే నిందలేస్తే ప్రజాగ్రహానికి గురవుతారని హెచ్చరిస్తున్నాను.