ఇఫ్తార్ విందులు సోదరభావాన్ని పెంపొందిస్తాయి

 మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జైనబ్బి దర్గా మసీదు ప్రాంగణంలో ముస్లిం సోదరులకు మాజీ ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశ్వేశ్వరరెడ్డితో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ నదీమ్ అహమ్మద్, పార్టీ యువజన విభాగం జోనల్ చైర్మన్ వై. ప్రణయ్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ముస్లిం సోదరులకు పండ్లు ఇచ్చి ఉపవాసం విడిపించారు. అనంతరం నురాని మజీద్ లో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమాం, ముతవల్లి తదితరులు విశ్వేశ్వరరెడ్డి, నదీమ్ అహమ్మద్, ప్రణయ్ రెడ్డి లను సన్మానించారు. తర్వాత వారు దగ్గరుండి ముస్లిం సోదరులకు భోజనం వడ్డించారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. నెలవంక చూసినప్పటినుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపట్టి, అల్లా కృపకు పాత్రులవుతారన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష చేపట్టడం గొప్ప విషయమన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. రాబోయే రంజాన్ పర్వదినాన్ని ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. ఇఫ్తార్ విందు ఏర్పాట్లను వైయ‌స్ఆర్‌సీపీ  మైనారిటీ విభాగం నేతలు దగ్గరుండి పర్యవేక్షించారు. 
 

Back to Top