తాడేపల్లి: 2022 సంవత్సరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయనామ సంవత్సరమని గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. పేద వారికి విద్య, వైద్య, ఆరోగ్యంపరంగా విజయనామ సంవత్సరం అని అభివర్ణించారు. ప్రతి ఇంటా అభివృద్ధి, సంక్షేమం వెల్లివిరిసిన సంవత్సరంగా నిలిచిపోయిందన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఈ ఏడాది పేద వర్గాలకు ఆనందం నింపిన సంవత్సరమని చెప్పారు. చంద్రబాబుకు ఏడుపు మిగిల్చిన సంవత్సరం, బూతులు తిట్టుకుంటూ మాట్లాడే అయ్యన్న, అచ్చెన్నలాంటి వాళ్లకి బూతులనామ సంవత్సరంగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. డీబీటీ ద్వారా పేదలకు వైయస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. విద్యారంగంలో సీఎం వైయస్ జగన్ చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతున్నారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. గడిచిన మూడున్నరేళ్ల వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైయస్ జగన్‌కు అండగా నిలిచారన్నారు. కుప్పం సహా అన్ని ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాడని గుర్తుచేశారు. వచ్చే సంవత్సరం మరిన్ని మేలైన కార్యక్రమాలతో సీఎం వైయస్ జగన్ ముందుకెళ్తారని చెప్పారు. 2023 చంద్రబాబు, పవన్‌లకు పచ్చిబూతులు ఎలా తిట్టాలని ట్రైనింగ్ అయ్యే సంవత్సరంగా మారబోతోందన్నారు. అభివృద్ధి అంటే చంద్రబాబుకో, తన కులానికో జరగటం కాదు. ప్రతి పేదవారికీ అభివృద్ధి ఫలాలు అందాలని కోరుకునే వ్యక్తి సీఎం వైయస్ జగన్ అని చెప్పారు.
చేతకాని బాబుకు ఎవరైనా ఛాన్స్ ఇస్తారా..?
ఇప్పుడు చంద్రబాబు ఒక్క ఛాన్సివ్వాలని అంటున్నాడు. చేత కానోడికి ఎవరైనా ఛాన్సు ఇస్తారా? చేతకాని దద్దమ్మకు ఎవరైనా ఛాన్సిస్తారా? చెడు చేసిన వారికి మళ్ళీ ఛాన్సిస్తారా? 14 ఏళ్లు మా బీసీలపై, మా ఎస్సీలపై, మా మైనార్టీలపై.. ఎక్కి తొక్కావే. మాతో ఊడిగం చేయించుకున్నావే.. మాతో ఓట్లు వేయించుకున్నావే. నీకు ఛాన్సివ్వాలా? దేనికివ్వాలి?. మిమ్మల్ని గెలిపించి.. మేం మళ్లీ ఇస్త్రీ పెట్టె పట్టుకోవడానికా? మగ్గం నేయడానికా? గొర్రెలు కాయడానికా? కుండలు చేయడానికా..? కల్లు గీయడానికా, మీరు వచ్చి మళ్ళీ మాకు మోకులు, ఇస్త్రీ పెట్టెలు ఇస్తారని ఛాన్సివ్వాలా?ఎందుకు ఛాన్సివ్వాలి మీకు. మీ పిల్లలు మాత్రమే అమెరికా వెళ్లి.. వాళ్లే ఇంగ్లీష్ నేర్చుకోవాలా..మా పిల్లలు కులవృత్తుల్లోనే మగ్గిపోవాలా? బీసీల పట్ల దుర్మార్గుడివి కదా బాబూ..?
ఆనాడు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మా పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంసీఎ, ఎంబీఏ చేయించారు.. ఈ రోజుకి కూడా కొన్ని లక్షల మంది మా బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే, అదంతా ఆ దేవుడు వైయస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే. ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్రెడ్డి.. 8 వతరగతి నుంచే సీబీఎస్ఈ సిలబస్ ద్వారా దేశానికి ఆదర్శంగా నిలవాలని మా పిల్లల్ని ఉన్నతంగా చదివిస్తున్నారు.. మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చి, ఇంగ్లిష్ మీడియం చదువులు చదివిస్తున్నారు. దేశానికే ఆంధ్రప్రదేశ్ తలమానికంగా నిలపాలని శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి. పిల్లలకు ట్యాబ్ లు ఇవ్వాలని, ఇంజనీర్లు, డాక్టర్లను చేయాలని బాబూ.. నీకు ఏ నాడైనా అనిపించిందా? నీకు వయసు పెరిగింది కానీ, చిన్న మెదడు చితికిపోయింది..
అధికారం కోసం ఇంత దిగజారాలా?
అధికారం కోసం చంద్రబాబు ఇంతగా అర్రులు చాచడమేంటి..? ఇంత తాపత్రయం ఏంటి? ఏనాడైనా ప్రజలకు మంచి చేస్తే ఓట్లు వేస్తారుగానీ.. 2019 ఎన్నికల్లో ఎందుకు చిత్తుగా ఓడించారు? . మళ్లీ ఇప్పుడు బయలు దేరావ్.. నిన్న గాక మొన్న కందుకూరు వెళ్లావ్.. 8 మందిని పొట్టనబెట్టుకున్నావ్.. తమ్ముళ్లూ.. మీరిక్కడే ఉండండి.. ఉంటారు కదా.. నేను వెళ్లి చచ్చిన వాళ్లను చూసొస్తానన్నావంటే.. అధికారం కోసం నువ్వు పడే తాపత్రయం.. ఎంత దారుణంగా ఉంది?. ఆ రోజు ఎన్టీఆర్‌ను పీకి పాకాన పెట్టేదాకా నిద్రపోలేదు. ఆయన్ని కాటికి పంపించే దాకా వదల్లేదు. కందుకూరులో 8 మంది చనిపోయిన 24 గంటలు గడవకుండానే, వెంటనే ఎవరైనా సభ పెడతారా? అదేమంటే వాళ్లు త్యాగం చేశారంటావా? ఇదేమైనా స్వాతంత్య్ర పోరాటమా?. నువ్వు త్యాగం చేయ్.. నీ కొడుకును చేయమను.. నీకు అధికారం కోసం ప్రజలు బలిదానం చేయాలా? త్యాగాలు చేయాలా? నీకు పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయింది. పరాకాష్టకు చేరింది.
ఇలాంటి నైజం ఉన్న దుర్మార్గుడు చంద్రబాబు.. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు నిన్ను నమ్మరు గాక నమ్మరు. నీకు ఎవరితో ఎటాచ్మెంట్ ఉంది? నువ్వు ఎవరిని ప్రేమగా పలకరించావు? నీకు ఎవరితోనైనా అనుబంధం ఉందా?
2024లో బీసీలు బాబు నడ్డివిరుస్తారు
ఈ రోజు బీసీలు నీకు దూరమయ్యారంటే.. కారణం నీకు తెలియదా? ఆ రోజు నువ్వు వారి తోకలు కత్తిరిస్తానన్నావ్.. మర్చిపోయావా? మళ్లీ నీ దగ్గర కెందుకొస్తాం. 024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నడ్డి విరుస్తాం. వెన్నుపూస కదిలిస్తాం. మమ్మల్ని నువ్వు బానిసలను చేస్తే .. సీఎం వైయస్ జగన్ బలవంతులను చేశారు. శక్తి మంతులను చేశారు. బీసీలను తలెత్తుకుని తిరిగేలా చేశారు. 82 వేల మంది బీసీలను ప్రజాప్రతినిధులను చేశారు. బీసీలకు చట్టం చేయాలని కాని, రిజర్వేషన్ లు ఇవ్వాలన్న ఆలోచనగానీ ఏనాడైనా మీకు కలిగిందా? నీ మదిలో మెదిలిందా? నిన్నెందుకు చూస్తారు? సామాజిక న్యాయనిర్ణేత సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి వెంట బీసీలు,ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు నడుస్తారు. కదం తొక్కుతారు.
పప్పు గళంగా మార్చుకో..
నిన్న చంద్రబాబు నాయుడు కొడుకు లోకేశ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. పాదయాత్ర చేస్తాడట.. ప్రతి పప్పుగాడికీ ఇదేదో ఫ్యాషన్ అయింది. పాదయాత్రకు పేటెంట్ వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ జగన్‌లకు మాత్రమే ఉంది. అసలు మీరు పాదయాత్రకు అర్హులా? ఇదేమైనా ఫిజికల్ ఎక్సర్‌సైజా? పొలిటికల్ ఎక్సర్‌సైజా? సీమ పందికి ఫ్యాంటు షర్టు వేసుకుని నడిచినట్లుంటది నువ్వు పాదయాత్ర చేస్తే.. ఏముంది నీకు అర్హత? పాదయాత్ర ఎందుకు చేయాలి? నువ్వు ఎమ్మెల్యేవి కూడా కాదు. మీ తండ్రి నిన్ను దొడ్డిదారిన ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రిని చేశాడు. నీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఎన్నికల్లో గెలువు చూద్దాం. వార్డు మెంబర్‌గా గెలవలేని లోకేష్.. ఒక వీరుడు, ధీరుడు, ఒక ధీశాలి, దమ్మున్న నాయకుడు, విశాల హృదయమున్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమా? ఆయన కాలిగోటికి కూడా లోకేష్ సరితూగలేడు. భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో, చరిత్ర పుటల్లో, చరిత్ర ఉన్నంతవరకు వైయస్ జగన్ పేరు శిలా శాసనంగా మిగిలిపోతుంది.
మాటకోసం, లక్ష్యం కోసం , ఎంత వరకైనా వెళ్ల గలిగే దమ్మున్న నాయకుడు జగన్ గారు. దేన్నయినా ఎదుర్కొనే దమ్ముంది. ఆయనతో మీ తండ్రీకొడుకులకు పోలికా..? నీ పాదయాత్ర పేరు యువగళం.. ఆపేరు సూటుకాదు. మూడు పేర్లు చెబుతా.. ఒకటి సెలక్టు చేసుకో.. పప్పుగళం, తుప్పు గళం, చిప్పగళం.. ఈ మూడింటిలో ఒక పేరు సూటవుతుంది. ఒకపేరు సెలక్టు చేసుకో. సినీ పరిశ్రమలో కొందరు నీ వెనుక నడవాలంట.. తెలంగాణ నుంచి కొందరు నడవాలంట.. ఏదో దండు కదలాలంట.. ఆంధ్రా నుంచి ఎవరూ రారు.. దత్తపుత్రుడేమో బస్సు యాత్ర అంటాడు. ఒకరు బస్సు..ఇంకొకరు తుస్సు..
175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల్ని నిలబెడతావా బాబూ..?
బాబూ.. నీకు దమ్ముంటే, రోషముంటే 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల్ని నిలబెడతాం.. వైయస్సార్సీపీ, సీఎం వైయస్ జగన్‌ని ఓడిస్తామని ధైర్యంగా చెప్పు చూద్దాం. దత్తపుత్రుడికి చెబుతున్నాం.. నువ్వు ఎక్కడ నిలబడాలో నీకే తెలియదు. దత్తపుత్రుడికీ ఛాలెంజ్ చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టి ముఖ్యమంత్రిని అవుతానని చెప్పు చూద్దాం. మీకు తెలిసిందల్లా పనికిమాలిన కొన్ని పత్రికలను, మీడియాను అడ్డం పెట్టుకుని వార్తలు రాయాలి. వ్యాసాలు రాయాలి. ఆ తర్వాత ఆ పత్రికల్లోని బ్యానర్ ఐటమ్ ల మీద మీరు చర్చలు చేయాలి. నిత్యం ఇదే మీపని.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా, 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ మా పార్టీ విజయదుందుభి మోగించబోతోంది. బాబుకు చిప్ప మిగులుతుంది. పవన్ కల్యాణ్ , ఆ పప్పు, తుప్పు అందరూ కొట్టుకుపోతారు.
బాబును అరెస్టు చేయాలి.
కందుకూరులో 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో బాధ్యుడు చంద్రబాబే. అతనే ఈ సంఘటనకు ప్రేరేపితుడు. అతన్ని అరెస్టు చేయాల్సిందే. మనిషి ప్రాణానికి విలువ కట్టి డబ్బులివ్వగానే సరిపోదు చందాలతోనూ సరిపోదు. ఇరుకుసందులో సభ పెట్టి, వారిని బంధించి, వారి చావుకు కారకుడైన వాడిని అరెస్టు చేయాలి. డీజీపీకి ఈ విషయం చెబుతాం.. ఇలాంటి సభలపై క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. వేలాది మందివచ్చారని డ్రోన్ కెమెరాలు పెట్టి బాబు వంటి వాళ్లు చేసే దుష్ప్రచారం ఏ మాత్రం సహించరానిది. ఈ పన్నాగాలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసు డిపార్ట్‌మెంట్‌పై ఉంది. మా పార్టీ మీటింగుల్లో ఎక్కడా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడూ దాపురించలేదు. మేం స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ సూచనలను పరిగణనలోకి తీసుకుని నిర్వహించాం. డ్రోన్లను ప్రయోగించి, తక్కువ మంది వచ్చినా ఎక్కువ మంది సభకు వచ్చారని చూపించేలా ఇలాంటి పనికిమాలిన, తప్పుడు ఆలోచనలు ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి దొంగ ఆలోచన బాబు తప్ప ఎవరూ చేయరు. అధికారాన్ని ఏ రకంగా లాక్కోవాలా ? అని తహతహలాడే చంద్రబాబు తప్ప ఇలాంటి పనులు ఇంకెవరూ చేయరు.
బాబు సవాల్ ను స్వీకరిస్తున్నా.. చర్చకు నేను సిద్ధం
చంద్రబాబు నాయుడు చేసిన సవాల్‌ను స్వీకరించడానికి వైయస్సార్ పార్టీ తరఫున నేను సిద్ధంగా ఉన్నా. బాబుకు దమ్ముంటే బీసీలపై చర్చకు రావాలి. ఆ ధైర్యం బాబుకు లేదు. ఆయన చంచాలు.. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర.. ఎవరొచ్చినా పాత్రికేయులు, లేదా ప్రజల సమక్షంలో నేను చర్చకు సిద్ధమే. బీసీల గురించి మేం గళమెత్తితే చంద్రబాబు దొడ్డిదారిన పారిపోతాడు. టైమ్, డేట్, ప్లేస్.. చెప్పమనండి. మేం చర్చకు సిద్ధం. బీసీలు ఇచ్చే రిటర్న్ గిఫ్టు ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో మరోసారి బాబు నడ్డి విరుస్తారు.. సిద్ధంగా ఉండు.. అని మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు.