విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక విప్లవకారుడని, స్పీకర్ నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు సామాజిక న్యాయం పాటించారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సామాజిక న్యాయం అనే మాటకు విలువిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని కొనియాడారు. విజయవాడలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర పోస్టర్‌ను మంత్రి జోగి రమేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పి. గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రమేనని గుర్తుచేశారు. 75% శాతం సామాజిక న్యాయం అమలు చేశారన్నారు. బహుజనులంతా జయహో జగనన్న అని నినదిస్తున్నారని, ఈనెల 26 నుంచి 29 వరకూ సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేపట్టనున్నట్టు చెప్పారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ బస్సుయాత్రను దిగ్విజయం చేస్తామని తెలిపారు. బస్సుయాత్రలో 17 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారన్నారు. నాలుగు జిల్లాల్లో బహిరంగ సభలు వేలమందితో నిర్వహిస్తామన్నారు.