ఆస్పత్రి, ఆర్టీసీ డిపో ప్రారంభించడం సంతోషంగా ఉంది

మానవత్వంతో ఆస్పత్రిని ఏర్పాటు చేసిన ఆర్టీసీకి అభినందనలు

ఆస్పత్రిని, ఆర్టీసీ డిపోను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌ 

రూ.7.5 కోట్లతో డిపో, రూ.5.8 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం

కడప బ‌స్టాండ్‌కు డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బస్‌స్టేషన్‌గా నామకరణం

తాడేపల్లి: ఆర్టీసీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో బస్‌ డిపో, వైయస్‌ఆర్‌ జిల్లా కడపలో డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏరియా ఆస్పత్రి ప్రారంభించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ కూడా మానవత్వంతో ముందుకొచ్చి ఆస్పత్రిని ఏర్పాటు చేయడం మంచిపరిణామం అన్నారు. కడపలో ఏరియా ఆస్పత్రిని, పుంగనూరులో ఆర్టీసీ బస్‌ డిపోను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.7.5 కోట్లతో పుంగనూరు ఆర్టీసీ డిపో, రూ.5.8 కోట్లతో కడపలో ఏరియా ఆస్పత్రిని నిర్మించారు. ఈ సందర్భంగా కడప బ‌స్టాండ్‌కు డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బస్‌స్టేషన్‌గా నామకరణం చేశారు. 

అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘పాదయాత్రలో పుంగనూరుకు వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ డిపోను ప్రారంభించడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం’ అన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. పుంగనూరులో ఆర్టీసీ డిపో ద్వారా ప్రజల కల సాకారమైందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోనే మోడల్‌ డిపోను పుంగనూరుకు ఇచ్చినందుకు సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా కడప నుంచి డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిలు మాట్లాడుతూ.. రూ.5.80 కోట్లతో డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆస్పత్రిని ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌పీ ఠాకూర్, ఆర్టీసీ ఈడీలు కృష్ణమోహన్, కోటేశ్వరరావుతో పాటు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుంగనూరు నుంచి ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, పలువురు ఎమ్మెల్యేలు, కడప నుంచి డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా, ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి, ఎమ్యెల్యేలు, కడప మేయర్‌ సురేష్‌బాబు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top